ఉమ్మడి పశ్చిమగోదావరిలో టీడీపీ, జనసేన టిక్కెట్ల పంపకం రెండు పార్టీల్లోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది. టిక్కెట్లు ఆశించి భంగపడ్డ నేతలు తమ పార్టీల నాయకత్వానికి సవాళ్ళు విసురుతున్నారు. ముఖ్యంగా తణుకు, ఉండి నియోజకవర్గాల్లో టీడీపీ, జనసేన పార్టీల్లోని ఆశావహుల ఆగ్రహం నుంచి తిరుగుబాట్లు వచ్చేలా కనిపిస్తున్నాయి. సీటు రానివారు రెబల్ అభ్యర్థులుగా, స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో దిగడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ రెండు నియోజకవర్గాల్లో సీట్లు పొందింది ఎవరో.. రానివారు ఎవరు?..
పశ్చిమగోదావరి జిల్లాలో టికెట్ ప్రకంపనలు తీవ్రమవుతున్నాయి. నమ్మక ద్రోహం చేశారని ఒకరు, కోట్లు ఖర్చు పెట్టించి గొంతు కోశారని మరొకరు తమ పార్టీలపై ధ్వజమెత్తుతున్నారు. ఉండి, తణుకు నియోజకవర్గాల్లో పొలిటికల్ హీట్ బాగా పెరిగింది. టికెట్లు ఆశించి భంగపడ్డ ఇద్దరు నేతలు తమ అనుచరులతో సమావేశమై స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో ఉంటామంటూ టీడీపీ, జనసేనలకు అల్టిమేటం జారీచేశారు. దీంతో ఈ రెండు నియోజకవర్గాల్లో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. ఉండిలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు, తణుకులో జనసేన ఇన్‌ఛార్జ్ విడివాడ రామచంద్రరావు అసమ్మతి స్వరం తీవ్రస్థాయికి చేరుతోంది.
జనసేన నాయకత్వం తనను నమ్మించి గొంతు కోసిందంటూ తణుకు జనసేన ఇన్‌చార్జ్ విడివాడ రామచంద్రరావు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. తాను ఎట్టి పరిస్తితుల్లోనూ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ఆయన స్పష్టం చేశారు. టీడీపీ సీటు దక్కించుకున్న అరిమిల్లి రాధాకృష్ణ విడివాడ నివాసానికి వచ్చి ఆయన్ను కలిసేందుకు ప్రయత్నించగా నా గుమ్మం తొక్కడానికి వీల్లేదు వెళ్లిపో.. నీ మీద పోటీ చేసేది నేనే అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విడివాడ తీరు చూసి టీడీపీ అభ్యర్థి రాధాకృష్ణ, ఆయన వెంట వచ్చిన పార్టీ నేతలు ఖంగుతిన్నారు. జనసేన టికెట్ ఆశించిన విడివాడ రామచంద్రరావు ఇప్పటివరకు పార్టీ కోసం భారీగా ఖర్చు చేశారు. 2019 ఎన్నికల్లో చివరి నిమిషంలో జనసేన టిక్కెట్‌ను విడివాడకు బదులు తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి చెందిన పసుపులేటి వెంకట రామారావుకు టికెట్ కేటాయించారు.
ఎన్నికల్లో ఓడిపోయిన వెంటనే పసుపులేటి వెంకటరామారావు జనసేనకు గుడ్ బై చెప్పి బీజేపీలో చేరారు. అప్పుడు కూడా విడివాడ జనసేనలోనే కొనసాగి పార్టీ చెప్పే ప్రతీ కార్యక్రమం నిర్వహించారు. కొద్ది నెలల క్రితం పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర సందర్భంగా తణుకులో సమావేశం నిర్వహించినపుడు.. విడివాడను విస్మరించి పార్టీలోకి వచ్చి, పోయేవాళ్లకి టికెట్ ఇచ్చి తప్పు చేశామని, ఈసారి రామచంద్రరావే పోటీలో ఉంటారని సంకేతాలు ఇచ్చారు. టికెట్ తనదేనన్న ధీమాతో అప్పటినుంచి విడివాడ సీరియస్‌గా పనిచేసి మరింత బాగా ఖర్చుచేసి జనసేన అధినేత చేతిలో రెండోసారి మోసపోయారు. అనుచరులతో సమావేశమై టికెట్ విషయంలో ప్రతిసారీ మోసం చేస్తూనే ఉన్నారని.. స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి తాడోపేడో తేల్చుకుంటానని విడివాడ చేసిన ప్రకటన తణుకులో హాట్ టాపిక్‌గా మారింది.
ఇక ఉండిలో టీడీపీ టిక్కెట్ వ్యవహారం గురు శిష్యుల మధ్య కుంపట్లు రాజేసింది. గతంలో రెండుసార్లు ఉండి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన వేటుకూరి శివరామరాజుకు గత ఎన్నికల్లో నరసాపురం ఎంపీ సీటుకు పోటీ చేసి ఓడారు. ఈసారి తప్పనిసరిగా ఉండి ఎమ్మెల్యే సీటు ఇవ్వాల్సిందేనని చంద్రబాబు దగ్గర పట్టుపట్టారు. గత ఎన్నికల్లో తన శిష్యుడైన మంతెన రామరాజుకు ఎంపీ సీటు ఇవ్వమని చంద్రబాబును కోరగా..పెద్దగా చదువులేని రామరాజుకు ఎంపీ వద్దని వేటుకూరికే ఎంపీ సీటిచ్చారు. మంతెనకు ఉండి ఎమ్మెల్యే సీటు ఇవ్వగా ఆయన గెలిచారు. ఇప్పుడు కూడా ఆయన్నే ఉండి అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో వేటుకూరి శివరామరాజు పార్టీ అధినేత మీద, తన శిష్యుడు ఎమ్మెల్యే రామరాజు మీద మండిపడుతున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగి గెలుస్తానని ఛాలెంజ్ చేస్తున్నారు.
వేటుకూరి కోపాన్ని చల్లార్చడానికి పార్టీ నాయకత్వం ఎంత ప్రయత్నించినా వినలేదు. తన అనుచరుల కోరిక మేరకు ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని ప్రకటించారు. ఈవిధంగా రెండు నియోజకవర్గాల్లోనూ సొంత పార్టీల్లోనే తిరుగుబాట్లతో అటు టీడీపీ, ఇటు జనసేన నాయకత్వాలు తలపట్టుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment