సాక్షి, అమరావతి: స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో మాజీ సీఎం చంద్రబాబు అరెస్టైన తరుణంలో టీడీపీలో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. చంద్రబాబు జైల్లో ఉన్న వేళ ‘‘నేను వస్తున్నా..’’ అంటూ బాలయ్య చేసిన వ్యాఖ్యలు ఆయన అల్లుడు లోకేశ్ శిబిరాన్ని ఉలికిపాటుకు గురి చేశాయి. దీంతో చినబాబు వెంటనే తన తల్లి, భార్యతో కలిసి పార్టీ నేతల సమావేశాన్ని ఏర్పాటు చేసి టీడీపీ తమ చేతుల్లోనే ఉందనే సంకేతాలు ఇచ్చుకున్నారు. తాజా పరిణామాలతో టీడీపీ క్యాడర్‌లో అయోమయం నెలకొంది. పార్టీలో ఏం జరుగుతుందోననే ఆందోళన వారిని వేధిస్తోంది.
బాబు సీట్లో బాలయ్య..
చంద్రబాబు అరెస్టు అయిన తర్వాత బాలకృష్ణ తొలిసారి సోమవారం మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి వచ్చారు. అక్కడ అందుబాటులో ఉన్న నాయకులతో సమీక్ష నిర్వహించేటప్పుడు ఆయన చంద్రబాబు సీట్లో కూర్చోవడం చర్చనీయాంశమైంది. అది చంద్రబాబు కూర్చునే సీటు అని, పక్కనే కూర్చోవాలని ఇతర నేతలు వారించినా బాలకృష్ణ కన్నెర్ర చేసి అందులోనే కూర్చుని సమావేశం నిర్వహించారు. రెండో రోజు మంగళవారం మళ్లీ పార్టీ కార్యాలయానికి వచ్చి నేతలతో సమావేశమయ్యారు.
ఈసారి మీడియా సమావేశం నిర్వహించి గతంలో ఎన్నడూ లేని విధంగా ‘నేనున్నా.. నేను వస్తున్నా..!’ అంటూ కొత్త తరహా వ్యాఖ్యలు చేశారు. అసలు తెలుగుదేశం పార్టీ తనదే అనేలా ఆయన చేసిన వ్యాఖ్యలు ఉన్నాయని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇకపై పార్టీని తానే నడిపిస్తాననేలా ఆయన చేసిన ప్రసంగంతో పార్టీ శ్రేణులంతా ఆలోచనలో పడ్డాయి. అంతటితోపాటు ఆగకుండా ఎప్పుడూ లేని విధంగా బాలకృష్ణ వరుసగా పార్టీ నేతల సమావేశాల్లో పాల్గొనడం ఆసక్తికరంగా మారింది.
పోరంకిలో జరిగిన కృష్ణా జిల్లా పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఆయన వ్యాఖ్యలు, వ్యవహార శైలి పార్టీపై పట్టు సాధించేలా ఉండడంతో బాలయ్య కొత్త రాజకీయానికి తెర తీశారనే అభిప్రాయాలు టీడీపీలో వ్యక్తమవుతున్నాయి. తన తండ్రి స్థాపించిన పార్టీని చంద్రబాబు స్వాధీనం చేసుకుని ఇంతకాలం చక్రం తిప్పినా బాలకృష్ణ అందుకు సహకరించారు. ఇప్పుడు బావ జైలుకు వెళ్లిన తరుణంలో బాలకృష్ణ తాను రేసులో ఉన్నానంటూ ముందుకు రావడం చర్చనీయాంశమైంది.
అప్రమత్తమైన లోకేశ్..
బాలయ్య వైఖరితో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ లోకేశ్ అప్రమత్తమయ్యారు. రాజమహేంద్రవరంలో తన తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మణితో కలిసి పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు. తాజా పరిణామాలు, చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఇందు లో చర్చించారు. చంద్రబాబుకు మద్దతుగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఈ సందర్భంగా భువనేశ్వరితో మాట్లాడించారు. తల్లి, భార్యతో కలిసి నేతలు, కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించడం ద్వారా పార్టీ తమ కుటుంబం చేతుల్లోనే ఉందని చినబాబు శ్రేణులకు సంకేతాలు పంపారు.
అంతేకాకుండా వివిధ జిల్లాల నుంచి నాయకులను తన వద్దకు రప్పించుకుని మాట్లాడుతున్నారు. జిల్లాల వారీగా పార్టీ నేతలు రాజమహేంద్రవరం వెళ్లి లోకేశ్‌తో మాట్లాడుతున్నారు. చంద్రబాబు అరెస్టు పరిణామాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలో నాయకత్వం కోసం లోకేశ్, బాలకృష్ణ మధ్య పోటీ నెలకొన్నట్లు ప్రచారం జరుగుతోంది.
పార్టీపై పట్టు సాధించేందుకు బాలకృష్ణ, తమ పట్టు నిలుపుకునేందుకు ఆయన అల్లుడు లోకేశ్ ప్రయత్నిస్తున్నట్లు స్పష్టమవుతోంది. దీంతో ఏం జరుగుతుందో అంతుబట్టక నేతలు, కార్యకర్తలు అయోమయానికి లోనవుతున్నారు. చంద్రబాబు అరెస్టు అయినా ప్రజల్లో స్పందన లేకపోవడం, మామ – అల్లుడి మధ్య పోటీ నెలకొనడంతో వారికి ఏమీ పాలుపోని పరిస్థితి నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment