
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు అనేది రాష్ట్ర ప్రజలు కొన్ని దశాబ్దాలుగా కంటున్న కల అని, దీన్ని నిజం చేసిన ఘనత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డికే దక్కుతుందని పోలవరం ఎమ్మెల్యే బాలరాజు చెప్పారు. శాసనసభలో బుధవారం పోలవరంపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ‘దివంగత మహానేత వైఎస్సార్ దీనికి శంకుస్థాపన చేస్తే దీన్ని పూర్తిచేసి ప్రారంభించే అరుదైన అవకాశం ఆయన తనయుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి లభిస్తోంది. పోలవరం ప్రాజెక్టు కడితే వైఎస్సార్‌కు పేరు వస్తుందనే స్వార్థంతో నాడు చంద్రబాబునాయుడు ఒడిశా, ఛత్తీస్‌ఘడ్ వారిని రెచ్చగొట్టి కోర్టుకు పంపించారు. పోలవరం భూసేకరణను అడుగడుగునా అడ్డుకునేలా కోర్టుల్లో కేసులు వేయించారు. అయినా వైఎస్సార్ ముందుకే వెళ్లారు.
2014లో టీడీపీ అధికారంలోకి రాగానే పోలవరానికి చంద్రగ్రహణం పట్టింది. సోమవారం పోలవారం అన్నది బాబు కిక్‌బ్యాగ్స్ కోసమే. పోలవరాన్ని చంద్రబాబు పాలిచ్చే ఆవులా మార్చుకున్నారు. పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు ఏటీఎంలా వాడుకుంటున్నారని సాక్షాత్తూ ప్రధానమంత్రే వ్యాఖ్యానించడం ఇందుకు నిదర్శనం. నిర్వాసితులను చంద్రబాబు గోదావరిలో ముంచారు. ఆర్ అండ్ ఆర్‌లో అవకతవకలపై విచారణ జరిపించాలి. పోలవరం ప్రాజెక్టు వద్ద దివంగత నేత వైఎస్సార్ వంద అడుగుల విగ్రహం పెట్టాలని మా అందరి తరఫున సీఎంకు విజ్ఞప్తి చేస్తున్నా. చిరస్మరణీయుడికి తెలుగుజాతి తరఫున ఇలా నివాళులు అర్పించాలని కోరుతున్నా..’ అని బాలరాజు పేర్కొన్నారు. ఈ సందర్భంగా అధికారపక్ష సభ్యులంతా ఈ ప్రతిపాదనను బలపరుస్తూ.. జోహార్ వైఎస్సార్, జోహార్ వైఎస్సార్ అని నినాదాలు చేశారు.