సాక్షి, హైదరాబాద్: తమ పాలనలో రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ ఏమి ఒరగబెట్టారో సమాధానం చెప్పాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ డిమాండ్ చేశా రు. బీఆర్‌ఎస్ పాలనలో వైఫల్యాలు, అవినీతి, నియంతృత్వ పోకడలు, ప్రజాస్వామ్య హననం, కుటుంబ పాలన, కేసీఆర్ అసమర్థతపై వెయ్యి ప్రశ్నలు అడిగినా సరిపోదన్నారు. అందువల్ల తాను వేస్తున్న కేవలం 31 ప్రశ్నలకు కేసీఆర్ జవాబు చెప్పాకే ప్రజల నుంచి ఓట్లు అడగాలని ఆదివారం ఆయన ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా దాటవేస్తే తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చలేని అసమర్థ ప్రభుత్వంగా, పార్టీ గా కేసీఆర్ ఒప్పుకుని బహిరంగ క్షమాపణలు చెప్పాలన్నారు.
సంజయ్ సంధించిన ప్రశ్నల్లో కొన్ని..
♦ మీకు నిజం చెప్పకూడదు.. అన్న శాపం ఏమైనా ఉందా? ఏనాడూ మీరు నిజాలు చెప్పరు? అందుకే అబద్ధాలతో ప్రజలను మోసం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారా?
♦ 2023లో 13 పేజీలు, 2018లో 16 పేజీలు, 2014లో 32 పేజీలతో ప్రకటించిన మేనిఫెస్టోల్లోని హామీల్లో ఎన్ని అమలు చేశారు? దీనిపై బీజేపీ ప్రతినిధులతో చర్చించడానికి మీరు సిద్ధమా?
♦ కాంగ్రెస్ ఎంఐఎంతో మీరు లోపాయికారి ఒప్పందం, మ్యాచ్‌ఫిక్సింగ్ చేసుకున్న విషయం వాస్తవం కాదా? మీ పార్టీ గుర్తు స్టీరింగ్ మజ్లిస్ చేతుల్లో ఉందా లేదా?
♦ హస్తంతో లోపాయికారి దోస్తీ, బయటకు మాత్రం కుస్తీ. దీనికి మీ జవాబు ఏమిటి?
♦ ఇంటికో ఉద్యోగం ఇస్తామని వాగ్దానం చేసిన మీరు.. మీ కుటుంబంలో మాత్రం ఐదుగురికి ఉద్యోగాలు ఇచ్చుకున్నారు. దీనికి మీ సమాధానమేమిటి?
♦ ప్రభుత్వ ఉద్యోగులకు, టీచర్లకు 1వ తేదీన మీ పాలనలో జీతాలు అందుతున్నాయా?
♦ 2014లో అధికారంలోకి వచ్చిననాటి నుంచి ఇప్పటిదాకా ఎన్ని ఉద్యోగ ఖాళీలు భర్తీ చేశారు? ఎన్నిసార్లు పేపర్ల లీకేజీ కారణంగా పరీక్షలు రద్దు చేశారు?
♦ ఇప్పటి వరకు ఎంత మందికి నిరుద్యోగ భృతి ఇచ్చారు?
♦2014లో మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు సెక్రటేరియట్‌కు ఎన్నిసార్లు, ఎన్నిరోజులు వెళ్లా రు? మీ ఫామ్‌హౌస్‌లో ఎన్నిరోజులు ఉన్నారు?
♦ ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో లక్ష ఎకరాలకు సాగునీరు ఇస్తామన్నారు. 9 ఏళ్లలో ఏ అసెంబ్లీ స్థానంలో లక్ష ఎకరాలకు సాగునీరు ఇచ్చారో వివరాలు ఇవ్వగలరా?
♦ రైతులకు రూ.లక్ష రుణమాఫీ చేస్తామని 2014, 2018 ఎన్నికల్లో మీరిచ్చిన హామీ ఎంతమేరకు నెరవేర్చారు?
♦ దేశంలోనే అత్యంత అవినీతిపరుడు, ధనవంతుడు కేసీఆర్ అని పేరుంది. దీనికి స్పందించి మీ నిజాయితీని నిరూపించుకుంటారా?
♦మీ కుటుంబ సభ్యులు, బంధువులు, మీ పార్టీ కి చెందిన నాయకులు, కార్యకర్తలు చేస్తున్న ఇసుక, లిక్కర్, డ్రగ్స్ దందాలు, భూ కబ్జాలపై సీబీఐ లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేత దర్యాప్తునకు సిద్ధమా?
♦ 2014లో మీరు ముఖ్యమంత్రి పదవిచేపట్టే నాటికి మీ ఆస్తులు, మీ కుటుంబ సభ్యులు, బంధువుల ఆస్తులు ఎంత? ఇప్పుడు ఎంత?
♦ తొమ్మిదేళ్లలో ఎన్ని డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు నిర్మించారు? ఎంత మంది పేదలకు ఇచ్చారు?
♦ గల్ఫ్ కార్మికులను ఆదుకునేందుకు మీ ప్రభుత్వం గత 9 ఏళ్లలో తీసుకున్న చర్యలు ఏమిటి?
ఈ ప్రశ్నలకు బదులివ్వండి.. సీఎం కేసీఆర్‌ను నిలదీసిన బండి
Published Mon, Nov 20 2023 4:37 AM | Last Updated on Mon, Nov 20 2023 7:57 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment