నానమ్మను మించి రాహుల్ దురాలోచన
కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఇకనైనా కుటిల రాజకీయాలు, చీకటి ఒప్పందాలు వీడి ప్రతిపక్షంగా ప్రజల పక్షాన నిలబడాలని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ సూచించారు. పార్లమెంట్ సమావేశాల్లో ప్రజాసమస్యలపై అర్థవంతంగా చర్చకు సహకరించి పరిష్కారమార్గాలు సూచించాలని ఒక ప్రకటనలో కోరారు. దేశాన్ని అస్థిరపరిచి, బలహీనపరిచేందుకు విదేశీ శక్తుల పాత్ర ఉందనే సాకుతో అధికారాన్ని నిలుపుకునేందుకు నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించారని గుర్తుచేశారు. ‘ఆ చీకటి అధ్యాయానికి 50 ఏళ్లు. ఎమర్జెన్సీపాలన దేశానికి ఓ మాయని మచ్చ.
ప్రజల గొంతునొక్కి కాంగ్రెస్ చేసిన అరాచకాలు, అధికార దాహానికి ఎమర్జెన్సీ నిదర్శనం’ అని మండిపడ్డారు. అధికారం కోసం ఇందిరాగాంధీని మించి ఆమె మనవడు రాహుల్‌గాంధీ దురాలోచన చేస్తున్నారని ఆరోపించారు. వివిధ దేశాల్లో పర్యటిస్తూ ‘ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది’ అనే ముసుగులో రాహుల్ పాశ్చాత్య దేశాల జోక్యాన్ని నిస్సిగ్గుగా కోరుతూ దేశ ప్రతిష్టను దెబ్బతీసేందుకు యత్నించారని ధ్వజమెత్తారు. గతంలో ప్రతిపక్ష ప్రభుత్వాలను కూల్చేందుకు 99 సార్లు 356 ఆర్టికల్‌ను దుర్వినియోగం చేసిన చరిత్ర కాంగ్రెస్‌దేనని దుయ్యబట్టారు.
తెలుగురాష్ట్రాల్లో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడిన డీఎస్పీరెడ్డి, జంగారెడ్డి, వి.రామారావు, జూపూడి యజ్ఞనారాయణ, పీవీ.చలపతిరావు, వెంకయ్య నాయుడు, సీహెచ్.విద్యాసాగర్‌రావు, ఇంద్రసేనారెడ్డి, ఇంకా సంఘ్ పరివార్ కార్యకర్తలను అరెస్ట్ చేసిన చరిత్ర కాంగ్రెస్‌దేనని చెప్పారు. బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు రద్దు చేస్తుందని ఎన్నికల్లో తప్పుడు ప్రచారం చేసి ఓట్లు పొందాలని చూసినా, కాంగ్రెస్‌కు దేశ ప్రజలు తగిన బుద్ధి చెప్పారన్నారు. అయినా ఆ పార్టీ నేతలు తీరు మారలేదని బండిసంజయ్ విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment