
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీజేపీలో నేతల మధ్య ముసలం పార్టీ నేతలను ఇబ్బందులకు గురిచేస్తోంది. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని హైకమాండ్ భావిస్తుండగా.. స్థానిక నేతల్లో ఐకమత్యం లేకపోవడం తలనొప్పిగా మారిందనే చర్చ నడుస్తోంది. ఇక, తాజాగా తెలంగాణ మాజీ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌ను టార్గెట్ చేసిన సంచలన కామెంట్స్ చేశారు.
దీంతో, తెలంగాణ బీజేపీలో బండి సంజయ్ వర్సెస్ రఘునందన్ అన్నట్టుగా పొలిటికల్ హీట్ నెలకొంది. అయితే, పార్టీలో రఘునందన్ ప్రాధాన్యతపై బండి సంజయ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీని, ప్రధాని మోదీని, అమిత్ షాలను విమర్శించిన వ్యక్తికి ఇంత ప్రాధాన్యత ఎందుకంటూ బండి ఫైరయ్యారు. ఇదే విషయమై పార్టీ పెద్దల దగ్గర బండి ఆవేదన వ్యక్తం చేశారు. ఇక, నిన్న(శుక్రవారం) కోర్ కమిటీ సమావేశం ముగియకముందే బండి సంజయ్ వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. నిన్నటి మీటింగ్‌లోనూ ఆయన ఫిర్యాదులు చేసినట్టు సమాచారం.
ఇదిలా ఉండగా.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన రోజే పార్టీ నేతల మధ్య లుకలుకలు బయట పడ్డాయి. కిషన్‌రెడ్డి బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని ఆహ్వానించడాన్ని, ఆయన సభలో పాల్గొనడాన్ని పార్టీ నేతలు కొందరు తీవ్రంగా వ్యతిరేకించారు. ఆయనను ఎలా ఆహ్వానిస్తారంటూ మండిపడ్డారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని తీవ్రంగా వ్యతిరేకించి తెలంగాణకు ఒక్క రూపాయి నిధులు కేటాయించబోమని, ఏమి చేసుకుంటారో చేసుకోండన్న కిరణ్‌కుమార్‌రెడ్డిని ఎలా పిలుస్తారని కొందరు నేతలు పార్టీ నాయకత్వాన్ని పార్టీ జాతీయ కార్యవర్గసభ్యులు కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి, విజయశాంతి, తదితరులు అభ్యంతరం చెప్పినట్టు సమాచారం. ఉద్యమ సమయంలో తనపై కేసులు పెట్టి వేధించిన వ్యక్తిని పిలవడంపై విజయశాంతి నిలదీసినట్టు తెలిసింది. ఇదే తరహాలో రాజ్‌గోపాల్ కూడా అభ్యంతరం వ్యక్తం చేసినట్టు సమాచారం.
కిషన్‌రెడ్డి బీజేపీ పగ్గాలు చేపట్టిన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో నేతల ప్రసంగాలు దుమారం రేపుతున్నాయి. సొంత పార్టీలోనే కొందరు తనపై నాయకత్వానికి ఫిర్యాదులు చేశారంటూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. మరోవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశమయ్యాయి. ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితను తప్పించేందుకు.. సీఎం కేసీఆర్ ఈడీని మేనేజ్ చేశారని ఆయన అనడం పార్టీ నేతల మధ్య చర్చకు దారితీసింది. దీంతో, బీజేపీలో పాలిటిక్స్ పీక్ స్టేజ్‌కు చేరుకున్నాయి.
ఇది కూడా చదవండి: కిషన్ రెడ్డి వచ్చినా కొత్త టెన్షన్.. తలలు పట్టుకున్న బీజేపీ నేతలు!
Comments
Please login to add a commentAdd a comment