కోల్‌కతా: ప్రస్తుతం పశ్చిమ బెంగాల్లో మూడో విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మంగళవారం 31 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగుతున్నాయి. ఇదిలా ఉండగా బెంగాల్ ఎన్నికల కమిషన్.. నిబంధనలు ఉల్లంఘించాడంటూ ఓ ప్రభుత్వ అధికారిని సస్పెండ్ చేసింది. పోలింగ్‌కు ముందు రోజు సదరు అధికారి తనకు బంధువైన టీఎంసీ నాయుకుడి ఇంట్లో రాత్రంతా ఈవీఎంలతో పాటు ఉన్నందుకు గాను బెంగాల్ ఈసీ సదరు అధికారిని సస్పెండ్ చేసింది. అయితే అధికారి వద్ద ఉన్న ఈవీఎం, వీవీపాట్ సామాగ్రిని ఎన్నికల్లో వినియోగించలేదని ఈసీ తెలిపింది. ఈ ఘటన ఉలుబేరియా ఉత్తర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని తులసిబీరియా గ్రామంలో చోటు చేసుకుంది.
ఆ వివరాలు.. తపన్ సర్కార్ అనే డిప్యూటి అధికారి 17 సెక్టర్ ఉలుబేరియా ఉత్తర్ పోలింగ్ కేంద్రంలో వినియోగించడానికి నిర్దేశించిన 4 ఈవీఎంలు, వీవీపాట్‌లను తీసుకుని తనకు బంధువు, స్థానిక టీఎంసీ నాయకుడు ఇంటికి వెళ్లాడు. రాత్రంతా అక్కడే ఉన్నాడు. ఈ విషయం కాస్త బయటకు పొక్కడంతో వివాదం రాజుకుంది. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న బెంగాల్ ఎన్నికల కమిషన్ తపన్ సర్కార్‌ని సస్పెండ్ చేసింది. అతడిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఈ మేరకు ఈసీ ఓ ప్రకటన విడుదల చేసింది.
‘‘సెక్టార్ అధికారి చర్యలు భారతదేశ ఎన్నికల కమిషన్ నియమావళికి తీవ్ర భంగం కలిగించాయి. ఇందుకు గాను అతడిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఇక అధికారి వద్ద ఉన్న ఈవీఎంలు, వీవీపాట్‌లను పోలింగ్‌లో వినియోగించలేదు. ఎక్స్‌ట్రాగా ఉన్న ఈవీఎంలను అధికారి తనతో పాటు ఉంచుకున్నాడు. ఏది ఏమైనా అతడి చర్యలు ఆమోదించదగినవి కావు. అధికారితో పాటు ఆ ప్రాంత పోలీసులపై కూడా చర్యలు తీసుకుంటాం’’ అని ఈసీ తెలిపింది. ఈ ఘటన అనంతరం జనరల్ అబ్జర్వర్ నీరజ్ పవన్ అన్ని ఈవీఎం సీళ్లను పరిశీలించారు.
ఇక ఈ ఘటనపై కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ మండి పడ్డారు. పూర్తి స్థాయిలో విచారించాలని డిమాండ్ చేశారు. ఈ రోజు పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం దారుణం. ఈ క్రమంలో సదరు అధికారి ఇంట్లో ఉన్న అన్ని ఈవీఎంలను, వీవీపాట్‌లను క్షుణ్ణంగా పరిశీలించాలని డిమాండ్ చేస్తున్నాం. అన్నారు. కొద్ది రోజుల క్రితం అస్సాంలో బీజేపీ నాయకుడి వ్యక్తిగత వాహనంలో ఈవీఎం తరలించడం కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment