సీఎం రేవంత్ సమక్షంలో తెల్లం వెంకట్రావును పార్టీలోకి ఆహ్వానిస్తున్న మంత్రి పొంగులేటి
సీఎం రేవంత్ సమక్షంలో చేరిన భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు
సాక్షి, హైదరాబాద్: బీఆర్‌ఎస్ నుంచి మరో ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఆదివారం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డితో పాటు పలువురు ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలకు చెందిన నేతలు పాల్గొన్నారు.
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో తెల్లం వెంకట్రావు బీఆర్‌ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచినా, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో బీఆర్ ఎస్ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. అధికారికంగా పార్టీలో చేరకపోయినా, కాంగ్రెస్ సమావేశాలకు కూడా ఆయన హాజరవుతున్నారు. శనివారం తుక్కుగూడలో జరిగిన జనజాతర సభకు కూడా ఆయన హాజరై వేదికపై కూర్చున్నారు.
ఈయన కాంగ్రెస్‌లోకి వస్తారన్న ప్రచారం చాలాకాలంగా జరుగుతున్నా ఆదివారం పార్టీ కండువా కప్పుకుని అధికారికంగా ఆ పార్టీలో చేరారు. వెంకట్రావు చేరికతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్‌ఎస్‌కు ప్రాతినిధ్యం లేకుండాపోయింది. ఇప్పటికే కాంగ్రెస్‌కు చెందిన తొమ్మిది ఎమ్మెల్యేలు ఆ జిల్లాలో ఉండగా, వెంకట్రావు చేరికతో పదికి పది చోట్లా ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలే కావడం, బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన ఎమ్మెల్యేల సంఖ్య మూడుకు చేరడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment