సాక్షి, హైదరాబాద్: దళితబంధు రాలేదన్న కారణంతో తన చావుకు సీఎం కేసీఆరే కారణమంటూ లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్న ఆదిలాబాద్ జిల్లా బోరోజ్ గ్రామానికి చెందిన రమాకాంత్ మరణానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. రాష్ట్రంలో దళిత, గిరిజన కుటుంబాలకు చెందినవారు ఎవరూ నిరాశ, నిస్పృహలకు గురై ఆత్మహత్యలు చేసుకోవద్దని ఆయన కోరారు. మోసపూరిత ప్రకటనలతో ప్రజలను కలల ప్రపంచంలోకి నెట్టి, వారి చావులకు కారణమవుతున్న బీఆర్‌ఎస్‌కు వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
శుక్రవా రం గాందీభవన్‌లో విలేకరులతో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్ తదితరులతో కలసి ఆయన మాట్లాడుతూ.. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో సమాజం ఏమైపోయినా సరే తాను, తన పార్టీ బాగుండాలనే భావనతో పాలకులు ఉండడం దురదృష్టకరమన్నారు. కేసీఆర్ తాను సీఎం అయ్యేందుకు దళిత ముఖ్యమంత్రి అనే హామీని వాడుకున్నారని, ఆ తర్వాత దళితులకు మూడెకరాల భూమి అని చెప్పారని, ఇప్పుడు దళితబంధు ఇస్తామని ఎన్నికల్లో ఓట్లు వేయించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
ప్రజల జీవితాలతో సీఎం కేసీఆర్ చెలగాటమాడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ మాత్రమే తెలంగాణ ప్రజల కలలను నిజం చేస్తుందని, కాబోయే కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వంలో దళిత, గిరిజనుల అభివృద్ధికే నిధులన్నీ ఖర్చుపెడతామని, సంపదను రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు పంచుతామని చెప్పారు. ఆత్మహత్య చేసుకున్న రమాకాంత్ కుటుంబానికి న్యాయం జరిగేంతవరకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పారు.
వామపక్షాలతో చర్చలు జరుగుతున్నాయి
కాంగ్రెస్, వామపక్షాల పొత్తు గురించి భట్టి మాట్లాడుతూ ‘వామపక్షాలతో చర్చలు జరుగుతున్నాయి. జాతీయ స్థాయిలో ఈ అంశం చర్చలో ఉంది. జాతీయ స్థాయి నేతలు తగిన సమయంలో ప్రకటిస్తారు’అని చెప్పారు. వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపడం సంతోషంగా ఉందని, ఆమె తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు.
రాహుల్ గాంధీ ఎక్కడ పోటీ చేయాలనేది ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్‌కు అవసరం లేదని, ఆయన ఎంఐఎం అభ్యర్థులు ఎక్కడ పోటీ చేయాలో చూసుకుంటే సరిపోతుందని అన్నారు. రాహుల్ ఎక్కడ పోటీ చేయాలో, తామెక్కడ పోటీ చేయాలో కాంగ్రెస్ పార్టీ సీఈసీ నిర్ణయిస్తుందని భట్టి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment