సాక్షి, న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికలతోపాటు దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లోని 58 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఫలితాలు రావడం ప్రారంభమైంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు బిహార్‌లో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి 127 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా, 105 స్థానాల్లో ఆర్జేడీ నేతృత్వంలోని మహాఘట్ బంధన్ ముందంజలో ఉంది. ఇక మధ్యప్రదేశ్‌లోని 28 స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ 19 స్థానాల్లో, కాంగ్రెస్ 9 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. తెలంగాణ రాష్ట్రంలోని దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గంలో పది రౌండ్లు ముగిసేటప్పటికీ పాలకపక్ష టీఆర్‌ఎస్‌కంటే బీజేపీ అభ్యర్థి 3,734 ఓట్ల ఆధిక్యతలో కొనసాగుతోంది.
బిహార్‌లో పాలకపక్షమైన జేడీయు–బీజేపీ కూటమి ఓడిపోతుందని, ఆర్‌జేడీ–కాంగ్రెస్ కూటమి విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ తెలియజేయగా, వెలువడుతున్న ఫలితాల తీరు మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. బిహార్ పోలింగ్‌లో అక్రమాలకు పాలకపక్షం వ్యూహం పన్నిందని, అందుకు ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసిందని ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణల్లో నిజం లేకపోలేదనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఒక్కసారే పలు యంత్రాలను ట్యాంపరింగ్ చేయడం కుదరదని, అయితే వేర్వేరుగా ఏ ఈవీఎంనైనా ట్యాంపరింగ్ చేయవచ్చని పలువురు సాంకేతిక నిపుణులు ఇది వరకే సాక్ష్యాధారాలతో నిరూపించారు.
(చదవండి: నితీష్‌కు సీఎం పీఠం దక్కుతుందా?)
ఎన్నికల్లో భారీ సంఖ్యలో ఈవీంలను ఉపయోగిస్తారు కనుక, వాటన్నింటిని ట్యాంపరింగ్ చేయడం సాధ్యం కాదని నిపుణులే స్పష్టం చేశారు. అయితే ఫలితాలను తారుమారు చేయాలంటే అన్ని ఈవీఎంలను ట్యాంపర్ చేయాల్సిన అవసరం లేదని, అలా చేయడం వల్ల అనుమానాలొస్తాయని, అవసరమైన నియోజక వర్గాల్లో, అవసరమైన చోట కొన్ని ఈవీఎంల చొప్పున ట్యాంపరింగ్ చేయడం ద్వారా ఆశించిన ఫలితాలు సాధించవచ్చని ఎన్నికల విశ్లేషకులు పేర్కొన్నారు.
బీహార్‌లోని 40 లోక్‌సభ స్థానాలకు 2019లో జరిగిన ఎన్నికల్లో 39 స్థానాలను బీజేపీ కైవసం చేసుకోవడం పట్ల పెద్ద ఎత్తున ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందంటూ నాడు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ సారి అసెంబ్లీ ఎన్నికలపై కూడా తనకు విశ్వాసం లేదని, ఈవీఎంలన్నీ ‘మోదీ ఓటింగ్ మెషిన్లే’ అంటూ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గత బుధవారం విమర్శించారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలకు సంబంధించి వచ్చిన ఆరోపణలను దృష్టిలో పెట్టుకొని ఈసారి బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు ఈవీఎం (ఎం2) వెర్షన్‌ను కాకుండా వాటిని ఈవీఎం (ఎం3) వెర్షన్‌గా అభివద్ధి చేసి
ఉపయోగించారు.
అయితే, వాటన్నింటికి ‘ఓటర్ వెరిఫైడ్ ఆడిట్ ట్రయల్ స్లిప్స్’ లేవు. 50 శాతం ఈవీఎంలకు ఆ సౌకర్యం ఉండాలంటూ కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఏళ్లుగా డిమాండ్ చేస్తూ వస్తోంది. ఈ విషయమై సుప్రీం కోర్టును కూడా ఆశ్రయించింది. ఇరువర్గాల వాదనలను విన్న సుప్రీం కోర్టు, మధ్యేమార్గంగా ప్రతి నియోజకవర్గానికి ఓట్ల ఆడిట్ ట్రయల్స్‌కు అవకాశం ఉన్న ఐదు ఈవీఎంల చొప్పున ఉపయోగించాల్సిందిగా ఆదేశించింది. ఈ నేపథ్యంలో బీహార్ ఎన్నికల ఫలితాల తీరు, ఎగ్జిట్ పోల్ ఫలితాలకు భిన్నంగా ఉండడంతో ఈవీఎంల పనితీరుపై అనుమానాలు రెట్టింపవుతున్నాయి.
(చదవండి: ఒకవేళ ఓడితే.. కారణాలు ఇవే!)
Comments
Please login to add a commentAdd a comment