ముంబై: మహారాష్ట్రలో ముఖ్యమంత్రి పదవిపై ఉత్కంఠ నెలకొంది. మహాయతి కూటమిలో సీఎం ఎవరు అనేది ఢిల్లీ బీజేపీ పెద్దల చేతిలోకి వెళ్లింది. మరోవైపు.. మహాయుతి కూటమి భారీ విజయం నేపథ్యంలో బీజేపీ నేతలు కాంగ్రెస్ పార్టీ నాయకులను టార్గెట్ చేస్తున్నారు. హస్తం పార్టీలో గెలిచిన నేతలు బీజేపీలో చేరాలని తాజాగా కాషాయ పార్టీ నేత మాట్లాడటం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది.
మహారాష్ట్ర బీజేపీ నేత ఆశిశ్ దేశ్ ముఖ్ మాట్లాడుతూ.. ఎన్నికల్లో బీజేపీ కూటమి భారీ మెజార్టీతో విజయం సాధించింది. కాంగ్రెస్ కూటమిని ప్రజలు తిరస్కరించారు. వారి ఓటమిని ప్రజలే శాసించారు. గతంతో పోలిస్తే మహారాష్ట్రలో కాంగ్రెస్ మరింత బలహీనపడింది. హస్తం పార్టీకి మరిన్ని ఓట్లు తగ్గాయి. ఆ పార్టీకి భవిష్యత్ లేదు. ఇంత జరుగుతున్నా ఇంకా అదే పార్టీలో ఉంటే కాంగ్రెస్ నేతల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మిగులుతుంది. అందుకే కాంగ్రెస్ నేతలు ఇప్పటికైనా బీజేపీలో చేరాలి. ఎన్నికల్లో గెలిచిన 16 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరండి అని సూచించారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా హాట్ టాపిక్ అయ్యాయి.
ఇదిలా ఉండగా.. ఆశిశ్ దేశ్ ముఖ్ మాజీ కాంగ్రెస్ నేత. పలు కారణాలతో ఆయనను కాంగ్రెస్ పార్టీ గతేడాది పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. దీంతో, ఆయన బీజేపీలో చేరారు. ఈ క్రమంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున ఆశిశ్ బరిలోకి దిగారు. నాగాపూర్ లోని సావ్నర్ స్థానంలో విజయం సాధించారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరాలని ఆయన పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment