బెంగాల్‌పై కాషాయం కన్ను   | BJP Focus On West Bengal Assembly Elections | Sakshi
Sakshi News home page

బెంగాల్‌పై కాషాయం కన్ను  

Published Tue, Jan 19 2021 6:58 AM | Last Updated on Tue, Jan 19 2021 11:10 AM

BJP Focus On West Bengal Assembly Elections - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఎట్టి పరిస్థితుల్లోనూ బెంగాల్‌ గడ్డపై కాషాయ జెండా ఎగురవేయాలని కమలదళం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. ఎప్పటికప్పుడు తాజా పరిస్థితులను అంచనావేస్తూ, తృణమూల్‌ కాంగ్రెస్‌ను ధీటుగా ఢీ కొట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. రాష్ట్రంలోని కీలక అంశాలను దృష్టిలో ఉంచుకొని ఎన్నికల షెడ్యూల్‌ విడుదలయ్యే కంటే ముందే పర్యటనల షెడ్యూల్‌ ఖరారు చేయాలని బీజేపీ పెద్దలు నిర్ణయించారు. అందులో భాగంగా శుక్రవారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా నేతృత్వంలో బెంగాల్‌ ఎన్నికలకు సంబంధించిన కీలక సమీక్ష జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పశి్చమ బెంగాల్‌ ఇన్‌ఛార్జి కైలాష్‌ విజయ వర్గియా, జాతీయ ఉపాధ్యక్షుడు ముకుల్‌ రాయ్, శివ ప్రకాష్, అమితావో చక్రవర్తి పాల్గొన్నారు. రెండు నెలల్లో చేపట్టిన కార్యక్రమాలతో పాటు, రాబోయే కొన్ని వారాల్లో పశి్చమ బెంగాల్‌లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.  

బూత్‌స్థాయిలో పార్టీ పటిష్టంపై దృష్టి 
ఇప్పటికే క్షేత్రస్థాయిలోని పరిస్థితులకు అనుగుణంగా ఒక అంచనాకు వచి్చన కేంద్ర నాయకత్వం బూత్‌ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని రాష్ట్ర నాయకత్వానికి సూచించిందని సమాచారం. రాష్ట్రంలో మహిళలు, పిల్లల భద్రతపై ఘెరావ్‌ సీఎం కార్యక్రమాన్ని నిర్వహించాలని బీజేపీ మహిళా మోర్చా చేసిన ప్రతిపాదనపై ఈ సమావేశంలో చర్చించారు. అంతేగాక రాష్ట్రంలో తృణమూల్‌ కాంగ్రెస్‌ను మరింత ఇబ్బంది పెట్టే విధంగా రాష్ట్రంలో ఓటర్లలో బీజేపీ సామర్థ్యంపై విశ్వాసాన్ని పెంచేందుకు బిజెపి పోస్టర్లు, జెండాలు మరింత ఎక్కువగా కనిపించేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. మరోవైపు, రాష్ట్రంలో ఇతర పారీ్టల నుంచి బీజేపీలో చేరికలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా అధికార తృణమయూల్‌ కాంగ్రెస్‌కు చెందిన దాదాపు 19 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ ఇప్పటికే కాషాయ కండువా కప్పుకున్నారు. వీరేగాక ఇంకా 41 మంది తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు బిజెపిలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని బీజేపీ రాష్ట్ర ఇన్‌ఛార్జి కైలాష్‌ విజయవర్గియా ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయితే ఇతర పారీ్టల నుంచి వస్తున్న నాయకుల్లో ఎవరిని పార్టీలో చేర్చుకోవడానికి అనుమతించాలనే విషయంపై కోర్‌ కమిటీలో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని కేంద్ర నాయకత్వం సూచించారు. అంతేగాక ఈసారి బెంగాల్‌ ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపు ఆధారంగానే బీజేపీ టికెట్ల పంపిణీ ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి. 

క్షేత్రస్థాయిలో పర్యటనలు 
ఈనెల 30, 31 తేదీల్లో అమిత్‌ షా మరోసారి బెంగాల్‌లో పర్యటించేందుకు షెడ్యూల్‌ ఖరారైంది. ఆయన తర్వాత ఫిబ్రవరిలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పర్యటించనున్నారు. రాష్ట్రంలోని రైతు కుటుంబాలకు చేరువయ్యేందుకు ఏక్‌ ముట్ఠీ చావల్‌ పేరుతో నడ్డా ప్రచారాన్ని ప్రారంభించారు. బీజేపీ రైతులకు అండగా ఉంటుందని భరోసా కల్పించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మరోవైపు తృణమూల్‌ కాంగ్రెస్‌ను మరింత ధీటుగా ఎదుర్కొనేందుకు ప్రధాని మోడీని బరిలో దింపాలని నిర్ణయించారు. ప్రధాని నరేంద్ర మోదీ మార్చి నెలలో పార్టీ కోసం బెంగాల్‌లో ప్రచారం చేసే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ప్రధాని మోదీ, అమిత్‌ షా, జేపీ నడ్డా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ వంటి ఛరిష్మా ఉన్న నాయకుల పర్యటనలకు ఎక్కువ సమయం కేటాయించాలని రాష్ట్ర నాయకత్వం కేంద్ర నాయకత్వాన్ని కోరింది. అంతేగాక క్షేత్ర స్థాయిలో పార్టీ కార్యకర్తల్లో మనోధైర్యాన్ని నింపేందుకు గజేంద్ర సింగ్‌ షెకావత్, మన్సుఖ్‌ మాండవియా, సంజీవ్‌ బలియన్, నిత్యానంద్‌ రాయ్‌ సహా మొత్తం 8 మంది కేంద్ర మంత్రులు, ఉత్తరప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి కేశవ్‌ మౌర్య ప్రతి వీకెండ్‌ పశ్చిమ బెంగాల్‌లో పర్యటించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement