కొలిక్కి వచ్చిన కసరత్తు...3 సీట్లకు ముగ్గురేసి చొప్పున జాబితా సిద్ధం
అభ్యర్థుల పేర్లను ఖరారు చేయనున్న జాతీయ ఎన్నికల కమిటీ
సాక్షి, హైదరాబాద్: బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఓ కొలిక్కి వచ్చింది. రెండుమూడురోజుల్లో మూడు స్థానాలకు అభ్యర్థులను పార్టీ అధిష్టానం ఖరారు చేయనుంది. ఒక్కో స్థానానికి మూడేసి పేర్లతో జాబితాను రూపొందించి ఢిల్లీలోని జాతీయ ఎన్నికల కమిటీకి పంపించనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల ఉపాధ్యాయ, పట్టభద్రులు, వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలు వచ్చే ఏడాది మార్చి 29తో ఖాళీ కానున్నాయి.
రాష్ట్రంలో బీజేపీకి 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు ఉండగా, వారిలో నలుగురు ఎంపీలు, ఏడుగురు ఎమ్మెల్యేలు కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల పరిధిలోనే గెలిచారు. దీంతో ఈ జిల్లాల పరిధిలోని ఒక టీచర్, ఒక గ్రాడ్యుయేట్ స్థానాలను కచ్చితంగా గెలవాలని రాష్ట్ర నాయకత్వం పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో బలమైన ఎమ్మెల్సీ అభ్యర్థులను నిలిపేలా చేస్తున్న కసరత్తు పూర్తి అయినట్టు పార్టీవర్గాల సమాచారం. శని, ఆదివారాల్లో ఈ మూడు స్థానాలకు ముగ్గురు చొప్పున అభ్యర్థులను (తొమ్మిది మందితో) ప్రతిపాదిస్తూ కేంద్ర ఎన్నికల కమిటీకి జాబితా పంపించనున్నారు.
ప్రధానంగా ఉత్తర తెలంగాణ జిల్లాల పరిధిలోని ఉపాధ్యాయ, పట్టభద్రుల స్థానాల్లో నేతలు టికెట్ కోసం తీవ్రంగా పోటీ పడుతున్నారు. పార్టీకి అంతగా బలం లేదని భావిస్తున్న వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ స్థానం నుంచి కూడా పలువురు టికెట్ ఆశిస్తున్నారు. ఇటీవల జరిగిన భేటీలో అభ్యర్థుల పేర్లపై ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు, ఎన్నికలు జరగబోయే ఆయాజిల్లాల పార్టీ అధ్యక్షుల నుంచి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, సంస్థాగత ప్రధానకార్యదర్శి చంద్రశేఖర్ తివారీ అభిప్రాయాలు సేకరించారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఎంపీ ధర్మపురి అరవింద్, ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు, ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, కాసం వెంకటేశ్వర్లు, ప్రదీప్‌కుమార్‌లతో ఓ ప్రత్యేక కమిటీని బీజేపీ రాష్ట్ర నాయకత్వం నియమించింది.
పోటాపోటీగా ప్రయత్నాలు
కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల్లో పోటీకి పార్టీనేతలతోపాటు, తటస్తులు కూడా టికెట్ ఆశిస్తున్నట్టు సమాచారం. ఈ రెండు స్థానాల్లో గ్రాడ్యుయేట్ స్థానం నుంచి టికెట్ కోసం మంచిర్యాలకు చెందిన ఎర్రబెల్లి రఘునాథరావు, సంగారెడ్డి జిల్లాకు చెందిన గోదావరి అంజిరెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన గుజ్జుల రామకృష్ణారెడ్డి, దుగ్యాల ప్రదీప్‌కుమార్ ముందువరుసలో ఉన్నట్టుగా పార్టీనాయకులు చెబుతున్నారు. ఈ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పోటీకి విద్యాసంస్థల అధినేత మల్క కొమురయ్య, గత ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన మామిడి సుధాకర్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారు. ఖమ్మం, నల్లగొండ, వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ టికెట్ కోసం పీఆర్‌టీయూ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు సర్వోత్తమరెడ్డి, సంఘ్ పరివార్‌కు చెందిన టీపీయూఎస్ నాయకుడు సాయిరెడ్డి తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment