కమలానికి ‘ఉక్కు’ భయం! | BJP Hopes On Tirupati Parliamentary Seat Are Shattered | Sakshi
Sakshi News home page

కమలానికి ‘ఉక్కు’ భయం!

Published Mon, Mar 1 2021 7:13 AM | Last Updated on Mon, Mar 1 2021 9:01 AM

BJP Hopes On Tirupati Parliamentary Seat Are Shattered - Sakshi

ఈ పరిస్థితుల్లో బీజేపీ తప్పుకుని జనసేనానికి కేటాయిస్తే ‘స్వామి కార్యం, స్వకార్యం’ రెండూ నెరవేరినట్లు ఉంటాయని అధిష్టానం వద్ద క్రియాశీలక నేతగా వ్యవహరిస్తున్న నాయకుడు వెల్లడించినట్లు సమాచారం.

కేంద్రంలో ఏకఛత్రాధిపత్యంగా చెలాయిస్తున్న భారతీయ జనతాపార్టీకి ‘ఉక్కు’ భయం పట్టుకుంది. అధికార దాహం కోసం ఇచ్చిన హామీలు ఒక్కటీ అమలు కాకపోగా ఉన్నవాటిని కూలదోసే కుట్రలపై ఆ పార్టీ కేడర్‌ను డైలమాలో పడేసింది. తిరుపతి ఉపఎన్నికల నేపథ్యంలో పోటీకి దూరమవ్వాలని యోచిస్తోంది. ఓటమి తప్పని సీటుకు పోటీపడడం ఎందుకుని భావిస్తోంది. పోటీకి ఉత్సాహం చూపుతున్న జనసేన నెత్తిన చెయ్యి పెట్టేందుకు వ్యూహాలు రచిస్తోంది. పైపై నాటకాన్ని రక్తికట్టించి తిరుపతి ప్రజల సానుభూతి పొందాలని ప్రణాళిక సిద్ధం చేస్తోంది.  

సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుపతి పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీచేసి ఘోర పరాభవం పొందే కంటే తప్పుకుని పరువు నిలుపుకోవడం ఉత్తమమని బీజేపీ నేతలు ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు కేంద్రం మొగ్గు చూపడం భారతీయ జనతాపార్టీ పట్ల వ్యతిరేకతకు దారితీసింది. అసలే ఏపీలో అంతంత మాత్రమే ఉన్న ఆ పార్టీకి ఉక్కు ప్రైవేటీకరణ పర్యవసానాలు మరింత నష్టాన్ని కలిగించినట్లు పరిశీలకులు చెబుతున్నారు. తాజాగా దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ వెల్లడైన నేపథ్యంలో, తిరుపతి పార్లమెంట్‌ ఉప ఎన్నికకు కూడా ప్రత్యేక నోటిఫికేషన్‌ జారీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో తిరుపతిలో పోటీ చేసేందుకు బీజేపీ ముందు చూపినంత ఆసక్తి ఇప్పుడు చూపడం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఆంధ్రుల హక్కు– విశాఖ ఉక్కు నినాదంతో సాధించిన ఆ పరిశ్రమ ప్రయివేటీకరణకు కేంద్ర ప్రభుత్వం మొగ్గు చూపడంపై రాష్ట్ర ప్రజలు రగిలిపోతున్నారు. ఈ వాస్తవాన్ని పసిగట్టిన రాష్ట్ర బీజేపీ నేతలు కేంద్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఇప్పటి పరిస్థితుల్లో మిత్రపక్షమైన జనసేనకు తిరుపతి సీటు అప్పగించడం శ్రేయస్కరమని బీజేపీ శ్రేణులు వివరించినట్లు తెలుస్తోంది. పైగా ఐదు బలిజ సంఘాలు చంద్రగిరిలో సమావేశమై, తిరుపతి ఎంపీ సీటును జనసేనకు కేటాయించాలని, ఒకవేళ ఇవ్వకపోతే తమ సామాజికవర్గం నోటాకు ఓట్లు వేస్తామని హెచ్చరికలు జారీ చేశాయి.

ఈ పరిస్థితుల్లో బీజేపీ తప్పుకుని జనసేనానికి కేటాయిస్తే ‘స్వామి కార్యం, స్వకార్యం’ రెండూ నెరవేరినట్లు ఉంటాయని అధిష్టానం వద్ద క్రియాశీలక నేతగా వ్యవహరిస్తున్న నాయకుడు వెల్లడించినట్లు సమాచారం. ఎటూ ఓటమి తప్పని సీటును పట్టుకొని వేలాడడంకంటే ఆ సీటు వదులుకొని జనసేనకు అప్పగిస్తే అన్ని విధాలుగా ఉపయోగమని పలువురు బీజేపీ నేతలు వివరిస్తున్నారు. ‘పవన్‌’ సామాజిక వర్గాన్ని మచ్చిక చేసుకునే వెసులుబాటు ఉంటుంది, భవిష్యత్‌లో తమ పోటీ మరోలా ఉండేదని చెప్పుకునే అవకాశం ఉంటుందని బీజేపీ జిల్లా నాయకత్వం కూడా వివరించినట్లు తెలుస్తోంది. తిరుపతి సీటు విషయమై గతంకంటే కాస్త్త భిన్నంగా బీజేపీ నుంచి సానుకూల పవనాలు వీస్తున్నట్లు  జనసేన నాయకులు కూడా చర్చించుకుంటున్నారు. దీనంతటికీ ప్రధాన కారణం విశాఖ ఉక్కు ప్రయివేటీకరణ అంశంగా వారు వివరిస్తున్నారు.

తప్పించుకోవడమే ఉత్తమం  
టీడీపీకి కరుడుగట్టిన కుప్పం లాంటి ప్రాంతంలోనే నాటి ఎన్నికలతో పోలిస్తే వైఎస్సార్‌సీపీ గణనీయమైన మెజారిటీ సాధించింది. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పాలన, ప్రజల ముంగిటకు ప్రభుత్వాన్ని తీసుకెళ్లిన నేపథ్యంలో ప్రజలు సంపూర్ణ మద్దతు పలుకుతున్నారు. తిరుపతి కేంద్రంగా ఇచ్చిన ప్రత్యేకహోదా హామీ నీరుగారిపోయింది. విశాఖ ఉక్కు ప్రయివేటీకరణ వ్యవహారం తెరపైకి వచ్చింది. పైగా తిరుపతి పార్లమెంటు పరిధిలో అన్ని అసెంబ్లీలు వైఎస్సార్‌సీపీ ఖాతాలో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో పోటీ చేసి ఘోర పరాభవం పొందేకంటే తప్పుకొని పరువు నిలుపుకోవడం ఉత్తమమని ఆపార్టీలోని క్రియాశీలక నేత ఒకరు వెల్లడించారు.
చదవండి:
చేతులెత్తేసిన టీడీపీ: పోటీ పడలేం బాబూ..!
ఒక ఒరలో ఇమడని 'కొడవళ్లు'


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement