సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో దుబ్బాక ఉప ఎన్నికలతో బీజేపీ, టీఆర్‌ఎస్ మధ్య మొదలైన పొలిటికల్ హీట్ ఇంకా అదే రేంజ్‌లో కొనసాగుతోంది. తాజాగా వచ్చిన మునుగోడు ఉప ఎన్నికల వేళ రెండు పార్టీల మధ్య రాజకీయా సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. రాజకీయ నేతలు.. సొంత పార్టీకి ట్విస్ట్ ఇస్తూ మరో పార్టీలోకి జంప్ అవుతున్నారు. గత కొద్ది రోజులుగా అధికార టీఆర్‌ఎస్ పార్టీ లీడర్లు, కాంగ్రెస్ నేతలు ఒక్కొక్కరుగా పార్టీలను వీడుతున్నారు. అదే సమయంలో కొందరు కీలక నేతలు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలోకి చేరుతున్నారు. ఉద్యమ నేత, మాజీ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే బూర నర్సయ్య గౌడ్.. గులాబీ పార్టీని వీడి కాషాయతీర్థం పుచ్చుకోనున్నట్టు తెలిపారు. ఇక, కోమటిరెడ్ది రాజగోపాల రెడ్డి కూడా ఇటీవలే కాంగ్రెస్‌ను వీడి.. బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.
ఈ తరుణంలో తెలంగాణ బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ కె. లక్ష్మణ్ చేసిన కామెంట్స్ రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. కాగా, ఎంపీ లక్ష్మణ్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ మునుగోడు ఉప ఎన్నిక తర్వాత బీజేపీలోకి భారీగా వలసలు ఉంటాయన్నారు. తమతో చాలా మంది నేతలు టచ్‌లో ఉన్నారని పేర్కొన్నారు. త్వరలోనే ఓ మాజీ మంత్రి కూడా బీజేపీలో చేరనున్నారని అన్నారు. సదరు నేతతో ఇప్పటికే సంప్రదింపులు పూర్తయ్యాయని స్పష్టం చేశారు. కరెక్ట్ టైమ్ చూసుకుని బీజేపీలో చేరుతారని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
ఈ సందర్భంగానే మునుగోడు ఉప ఎన్నికలపై స్పందించిన ఆయన.. బీజేపీ ఘన విజయం సాధిస్తుందని అన్నారు. రాజగోపాల్ రెడ్డి గెలుపు ఖాయమైందని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్.. మునుగోడు ప్రజలను ఎంత మభ్యపెట్టినా ప్రయోజనం లేదన్నారు. కేసీఆర్ మోసగాడనే ముద్ర పడిపోయిందని.. ఆయనను ఎవరు దగ్గరికి రానిచ్చే పరిస్థితి లేదన్నారు. ఇప్పటి వరకు జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్.. ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment