
సాక్షి, విశాఖపట్నం: ప్రధాని నరేంద్ర మోదీ విశాఖపట్నం పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన రోడ్డు షో విజయవంతమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పేర్కొన్నారు. విశాఖలో శనివారం ప్రధాని బహిరంగ సభ అనంతరం వీర్రాజు నగరంలోని బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ ఉత్తరాంధ్ర ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు.
ప్రధాని రోడ్డు షోను విజయవంతం చేసిన ఇన్‌చార్జిలు, వివిధ విభాగాల బాధ్యులను ఆయన అభినందించారు. ప్రధాని మోదీతో కోర్ కమిటీ సమావేశంలో జరిగిన చర్చ, రాజకీయ అంశాల ఆధారంగా భవిష్యత్తులో పార్టీ ప్రగతిపై నేతలతో ఆయన చర్చించారు. వివిధ అంశాలపై వీర్రాజు పార్టీ శ్రేణులకు సూచనలు చేశారు.
ఏపీ చరిత్రలో ఇలాంటి సభ జరగలేదు: విష్ణుకుమార్ రాజు
ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఎన్నడూ ఇలాంటి భారీ బహిరంగ సభ జరగలేదని, ఇకపై జరగబోదని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్‌రాజు వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ సభని అత్యద్భుతంగా విజయవంతం చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఏర్పాట్లలో కీలకంగా వ్యవహరించిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతోపాటు ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు చెబుతున్నానన్నారు.
ప్రధాని సభ అత్యద్భుతం: జీవీఎల్ నరసింహారావు
మురళీనగర్ (విశాఖ ఉత్తర): విశాఖలో ప్రధాని సభ అత్యద్భుతంగా జరిగిందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు. ప్రధాని విశాఖ పర్యటన విజయవంతమైందని.. ఊహించిన దానికంటే ప్రజలు అత్యధికంగా హాజరవడంతో ఏయూ గ్రౌండ్ కిక్కిరిసిపోయిందన్నారు. మీడియాతో శనివారం ఆయన మాట్లాడుతూ వేలాది మంది సభ బయట ఉండిపోయారని, ట్రాఫిక్‌లో చిక్కుకుపోవడంతో సభాస్థలికి రాలేకపోయారన్నారు. విశాఖలో ప్రధాని మోదీ పర్యటన గురించి ఆంధ్రప్రదేశ్‌తో పాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందన్నారు.