BJP Vs AAP: గ్యాంగ్‌స్టర్లతో దందా.. ఎమ్మెల్యే ఆడియో క్లిప్‌ లీక్‌! | BJP Leaders Says Gangsters Are Biggest Supporters To AAP | Sakshi
Sakshi News home page

BJP Vs AAP: గ్యాంగ్‌స్టర్లతో దందా.. ఎమ్మెల్యే ఆడియో క్లిప్‌ లీక్‌!

Published Sat, Nov 30 2024 4:58 PM | Last Updated on Sat, Nov 30 2024 6:54 PM

BJP Leaders Says Gangsters Are Biggest Supporters To AAP

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి రాజకీయం రసవత్తరంగా మారింది. ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేపై బీజేపీ నేత సంచలన ఆరోపణలు చేశారు. స్థానిక ఎమ్మెల్యే గ్యాంగ్‌స్టర్ల అండతో బిల్డర్లను బెదిరించి దోపిడీలకు పాలల్పడుతున్నారని అన్నారు. ఈ క్రమంలో ఆప్‌ ఎమ్మెల్యే.. గ్యాంగ్‌స్టర్‌తో మాట్లాడిన ఆడియో క్లిప్‌ను సోషల్‌ మీడియాతో షేర్‌ చేశారు.

ఆప్‌ ఎమ్మెల్యే నరేశ్ బల్యాన్‌పై బీజేపీ ఐటీ విభాగం అధిపతి అమిత్‌ మాలవీయ సంచలన ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా ట్విట్టర్‌ వేదికగా ఆడియో క్లిప్‌ను షేర్‌ చేశారు. ఈ సందర్భంగా మాలవీయ.. ‘అరవింద్‌ కేజ్రీవాల్‌ ఢిల్లీలో దోపిడీ రాకెట్‌ నడుపుతున్నారు. పైగా శాంతి భద్రతలు సరిగా లేవంటూ ఆప్‌ నేతలు బీజేపీ గురించి మాట్లాడతారు. కేంద్రంపై నిందలేస్తున్నారు. ఢిల్లీని ఆప్‌ అవినీతి కేంద్రంగా మార్చేసింది. ఆప్‌ ఎమ్మెల్యే నరేశ్ బల్యాన్‌.. గ్యాంగ్‌స్టర్‌తో మాట్లాడుతున్నట్లుగా ఉంది. ఢిల్లీ బిల్డర్లు, వ్యాపారవేత్తల నుంచి డబ్బులు ఎలా డిమాండ్‌ చేయాలో వారిద్దరూ మాట్లాడుకున్నట్లుగా అందులో ఉంది అంటూ కామెంట్స్‌ చేశారు. ఇదే సమయంలో మాజీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

మరోవైపు.. బీజేపీ నేత గౌరవ్ భాటియ మాట్లాడుతూ..‘ఆప్ గూండాల పార్టీగా మారిపోయింది.. గ్యాంగ్‌స్టర్లు ఆప్‌కి పెద్ద మద్దతుదారులుగా మారిపోయారు. ఆప్ ఎమ్మెల్యే సూచనలతోనే సామాన్యులను బెదిరించి బహిరంగంగా డబ్బులు దండుకుని దోపిడీ చేస్తున్నారు. అరవింద్ కేజ్రీవాల్ అంగీకారంతో ఆప్ ఎమ్మెల్యే ఇ‍వ్వన్నీ చేస్తున్నారు. అమాయకులను బెదిరించి డబ్బులు దండుకుంటున్నారు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ఎమ్మెల్యే ఇలా దందాలు చేయడం ఎంత వరకు కరెక్ట్‌? అని ప్రశ్నించారు.

ఇదిలా ఉండగా.. బీజేపీ నేతల ఆరోపణలను ఆప్‌ తీవ్రంగా ఖండించింది. అమిత్‌ మాలవీయ వ్యాఖ్యలపై ఆప్‌ రాజ్యసభ ఎంపీ సంజయ్‌ సింగ్‌ స్పందించారు. ఈ సందర్భంగా సంజయ్‌ సింగ్‌ మాట్లాడుతూ.. అది నకిలీ ఆడియో క్లిప్‌. ఢిల్లీలో పెరుగుతున్న నేరాల గురించి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నేరాలను ఆపాల్సింది పోయి.. మాపైనే నిందలేస్తున్నారు. మా నేతను అడ్డుకునేందుకు నకిలీ ఆడియో క్లిప్‌ను ప్రచారం చేస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement