అగర్తలా: తృణమూల్ కాంగ్రెస్‌లోకి వలసలు మొదలయ్యాయి. పశ్చిమ బెంగాల్ మాజీ మంత్రి రజీబ్ బెనర్జీ, త్రిపుర బీజేపీ ఎమ్మెల్యే అశిష్‌దాస్ శనివారం త్రిపురలోని అగర్తలాలో జరిగిన ఒక కార్యక్రమంలో టీఎంసీ గూటికి చేరారు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ సమక్షంలో తృణమూల్ తీర్థం పుచ్చుకున్నారు. 2011, 2016లో పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ ప్రభుత్వంలో మంత్రిగా చేసిన రజీబ్ గత ఎన్నికల సమయంలో బీజేపీలో చేరి దోమ్‌జూర్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. తృణమూల్ అధికారంలోకి రావడంతో బీజేపీ నుంచి మళ్లీ మాతృసంస్థకి చేరుకున్నారు.
గోవా నుంచి త్రిపుర వరకు పార్టీని విస్తరించడానికి చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా అగర్తాలలో తృణమూల్ కాంగ్రెస్ సభ నిర్వహించింది. ఈసారి త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో లెఫ్ట్, రైట్ అందరినీ మట్టికరిపిస్తామని అభిషేక్‌ధీమా వ్యక్తం చేశారు. ‘‘బీజేపీ అనే వైరస్‌కి వ్యాక్సిన్ ఒక్కటే ఉంది. దాని పేరు మమతా బెనర్జీ. త్రిపుర ఓటర్లు ఆ వైరస్‌కి రెండు డోసుల వ్యాక్సిన్ ఇవ్వాలి. మొదటిది వచ్చే నెలలో జరిగే స్థానిక ఎన్నికల్లోనూ, 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోనూ రెండో డోసు ఇవ్వాలి’’ అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. అగర్తలా ర్యాలీ నిర్వహించాలని గత కొద్ది రోజులుగా టీఎంసీ ప్రయత్నిస్తున్నప్పటికీ అక్కడ రాష్ట్ర బీజేపీ ప్రభుత్వం అడ్డు చెబుతూ వస్తోంది. కరోనా నిబంధనల వల్ల ర్యాలీలకు అనుమతించేది లేదని పోలీసులు తెగేసి చెప్పారు. దీంతో టీఎంసీ కోర్టుకెళ్లింది. చివరికి త్రిపుర హైకోర్టు ర్యాలీకి అనుమతించింది.
Comments
Please login to add a commentAdd a comment