కిషన్‌జీని చంపింది మమత సర్కారే
తృణమూల్ ఎంపీ అభిషేక్ బెనర్జీ వ్యాఖ్యలు
బెల్‌పహారి/కోల్‌కతా: మావోయిస్టు అగ్రనేత కిషన్‌జీ అలియాస్ మల్లోజుల కోటేశ్వరరావును మమతా బెనర్జీ ప్రభుత్వమే చంపిందంటూ ఆమె మేనల్లుడు, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2011, నవంబర్ 24న పశ్చిమ మిడ్నాపూర్ అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో కిషన్‌జీ చనిపోయారంటూ గతంలో భద్రతా దళాలు, పశ్చిమబెంగాల్ ప్రభుత్వం చెబుతుండగా, తాజాగా అభిషేక్ అందుకు విరుద్ధమైన వ్యాఖ్యలు చేయడంతో మమత సర్కారు ఇరకాటంలో పడింది. దీనిపై మమత వివరణ ఇవ్వాలంటూ విపక్షాలు, హక్కుల సంఘాలు డిమాండ్ చేశాయి. ‘ఇంతకుముందు పత్రికలు తిరగేసినప్పుడు జంగల్‌మహల్‌లోని మరణాలపై నిత్యం కథనాలు కనిపించేవి. అయితే గత నాలుగేళ్ల కాలంలో ఒకే ఒక వ్యక్తి మరణించారు. ఆయన ఎవరో కాదు మావోయిస్టు నేత కిషన్‌జీనే. మమత ఆయనను చంపేసి రానున్న కాలంలో ప్రజలు చెప్పిందే అంతిమ తీర్పు అని రుజువుచేశారు’ అని అభిషేక్ శుక్రవారం రాత్రి బెల్‌పహారిలో జరిగిన సభలో చెప్పారు.
‘ప్రభుత్వం ఆయుధాలను వాడేది ప్రజల మంచి కోసమే. ఉగ్రవాదం కోసం కాదు’ అని ఆయన పేర్కొన్నారు. దీంతో విపక్షాలు మమత సర్కారుపై అగ్గిమీద గుగ్గిలమయ్యాయి. మమత అక్రమానికి పెట్టింది పేరని దీన్ని బట్టి స్పష్టమవుతోందని బీజేపీ నేత సిద్ధార్థ్‌నాథ్ సింగ్ మండిపడ్డారు. అభిషేక్ మాటలకు మమత కట్టుబడి ఉంటారా అని ఆయన నిలదీశారు. మమత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మావోయిస్టు నేత ఆజాద్ మరణంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారని, అయితే అధికారంలోకి వచ్చాక కిషన్‌జీని చంపేందుకు రాష్ట్ర బలగాలను వాడుకున్నారని దుయ్యబట్టారు.