
సాక్షి, అమరావతి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజే 2024 ఎన్నికల వరకు కొనసాగుతారని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల సహ ఇన్‌చార్జ్ సునీల్ దేవధర్ పరోక్షంగా స్పష్టం చేశారు. విజయవాడలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. సోము వీర్రాజు నాయకత్వంలోనే ఏపీలో తమ పార్టీ ఎన్నికలకు వెళ్తుందని చెప్పారు. రాష్ట్రంలో విజయమే లక్ష్యంగా పనిచేస్తామని.. ఆ మేరకు జాతీయ నాయకులు దిశానిర్దేశం చేసినట్లు తెలిపారు.
రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయ శూన్యత కనిపిస్తోందని, టీడీపీకి మళ్లీ అధికారం అప్పగించడానికి ప్రజలు సిద్ధంగా లేరని చెప్పారు. కాగా, విశాఖలో పవన్‌కళ్యాణ్ పర్యటనను అడ్డుకోవడాన్ని బీజేపీ ఖండిస్తోందని చెప్పారు. పవన్‌తో సోము వీర్రాజు ఫోన్‌లో మాట్లాడారని.. పార్టీ ప్రతినిధిగా ఎమ్మెల్సీ మాధవ్‌ను అక్కడికి పంపామని పేర్కొన్నారు.