
సాక్షి, సిటీబ్యూరో/కుత్బుల్లాపూర్: గ్రేటర్‌పై కమలం పార్టీ ప్రత్యేకంగా దృష్టి సారించింది. అత్యధిక స్థానాలున్న మహానగరంలో పట్టు సాధించేందుకు శరవేగంగా పావులు కదుపుతోంది. ఆ దిశగా ప్రత్యేక కార్యాచరణ మొదలుపెట్టింది. తాజాగా బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు బండి సంజయ్ నిర్వహించ తలపెట్టిన ప్రజా సంగ్రామ యాత్ర నాలుగో విడత పాదయాత్ర ఈ నెల 12న నగరంలో ప్రారంభం కానుంది.
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే బాధ్యతలను ఆ పార్టీ నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. నగర శివార్లు..ప్రధాన నగరాన్ని అనుసంధానిస్తూ సాగే విధంగా పాదయాత్ర రూట్‌మ్యాప్ సిద్ధం చేశారు. అన్ని వర్గాల నుంచి పెద్ద ఎత్తున జన సమీకరణ చేయాలని నిర్ణయించారు. ఈ యాత్రతో బీజేపీ శ్రేణుల్లో మరింత ఊపునిచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
ఈ నెల 12న పాదయాత్ర కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలో ప్రారంభం కానుంది. భక్తుల కొంగు బంగారమైన గాజులరామారం చిత్తారమ్మ ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేసి అక్కడి నుంచి యాత్ర ప్రారంభించనున్నారు. సూరారం రామ్‌లీలా మైదానం వద్ద బహిరంగ సభ ఏర్పాటు చేయాలని ఆ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్ అధిష్టానానికి నివేదిక ఇచ్చినట్లు సమాచారం. మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని మొత్తం ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఈ యాత్ర సాగనుంది.
చివరగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని అబ్దుల్లాపూర్‌మెట్ వద్ద ముగింపు సభ ఏర్పాటు చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ముగింపు సభకు కమలం పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొనేలా పార్టీ నేతలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది.
భారీ జన సమీకరణకు ఏర్పాట్లు..
గ్రేటర్ పరిధిలో ఏడు నియోజకవర్గాలను చుట్టేస్తూ సాగే యాత్రకు భారీగా జనసమీకరణ చేయాలని ఆ పార్టీ నేతలు ప్రణాళికలు సిద్ధంచేస్తున్నారు. ముందుగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి ప్రారంభించే పాదయాత్ర, బహిరంగ సభకు భారీగా జనసమీకరణ చేసేందుకు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత కూన శ్రీశైలంగౌడ్ పార్టీ శ్రేణులతో చర్చించారు. నియోజకవర్గంలో బీజేపీ ఓటు బ్యాంకు పెంచుకునేందుకు, కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకు బండి సంజయ్ పాదయాత్ర ఎంతో ఉపయోగపడుతుందని ఆ పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు.
చదవండి: అక్టోబర్ 24 నుంచి రాష్ట్రంలో రాహుల్ పాదయాత్ర
Comments
Please login to add a commentAdd a comment