
పెండింగ్ 8 ఎంపీ సీట్లపై కమలనాథుల కసరత్తు
ఖమ్మం సీటుకు జలగం వెంకటరావు పేరు పరిశీలన
సాక్షి, హైదరాబాద్: బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల మలి జాబితా ఖరారు కసరత్తు ఊపందుకుంది. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకుగాను ఇప్పటికే 9 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. మిగిలిన 8 సీట్లకు సంబంధించి ఆదివారం రెండో జాబితాను ప్రకటించే అవకాశాలున్నాయి. ఢిల్లీలో జరిగే పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో పెండింగ్‌లో ఉన్న 8 సీట్లలో కొన్నింటికి అభ్యర్థులను ప్రకటించ వచ్చునని పార్టీ వర్గాల సమాచారం.
జలగం భేటీలు కొలిక్కి వచ్చేనా
బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే జలగం వెంకటరావు శుక్రవారం ఉమ్మడి రాష్ట్ర మాజీ సీఎం, బీజేపీ నేత కిరణ్‌కుమార్‌రెడ్డితో కలవగా, శనివారం బీజేపీ చేరికల కమిటీ కన్వీనర్ పొంగులేటి సుధాకర్ రెడ్డితో సమావేశమయ్యారు. ఈ భేటీల్లో పార్టీలో చేరికతో పాటు ఖమ్మం నుంచి పోటీ విషయంలో త్వరలోనే తన నిర్ణయం ప్రకటిస్తామని వెంకటరావు తెలియజేసినట్లు సమాచారం. ఖమ్మం లోక్‌సభ సీట్లో వెంకటరావును నిలిపే దిశగా కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి సైతం చర్చలు జరిపినట్టు పార్టీ నాయకులు చెప్తున్నారు.
మాజీ సీఎం జలగం వెంగళరావు కుమారుడిగా వెంకటరావుకు గుర్తింపు ఉందని.. దీనికితోడు వెలమ సామాజికవర్గానికి చెందిన వ్యక్తిగా, గతంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల నుంచి ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవంతో ఎంపీగా పోటీ చేయిస్తే లాభిస్తుందని అంచనా వేస్తున్నారు. ఇక మహబూబూబాద్ ఎంపీ స్థానం నుంచి పోటీకి బీఆర్‌ఎస్ మాజీ ఎంపీ సీతారాంనాయక్ పేరు బీజేపీ పెద్దల పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది.
పాలమూరు సీటు డీకే అరుణకే?
మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పేరు దాదాపు ఖరారైందని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మెదక్ సీటుకు మాజీ ఎమ్మెల్యే ఎం.రఘునందన్‌రావు, అంజిరెడ్డి పోటీపడుతున్నారు. వరంగల్ నుంచి మాజీ డీజీపీ కృష్ణప్రసాద్, చింతాసాంబమూర్తి, కొండేటి శ్రీధర్.. నల్లగొండ నుంచి జి.మనోహర్‌రెడ్డి, గోలి మధుసూదన్‌రెడ్డి, జితేందర్ గుప్తా, రంజిత్‌యాదవ్‌ల పేర్లు పరిశీలనలో ఉన్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి.
పెద్దపల్లి ఎస్సీ రిజర్వ్‌డ్ స్థానం విషయానికొస్తే.. గత ఎన్నికల్లో పోటీచేసిన ఎస్.కుమార్‌తోపాటు గాయకుడు మిట్టపల్లి సురేందర్ పేర్లు పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. రాష్ట్రంలోని మూడు ఎస్సీ రిజర్వ్‌డ్ సీట్లను మాదిగ సామాజికవర్గానికే కేటాయించడం ద్వారా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ పట్ల కేంద్ర ప్రభుత్వం, బీజేపీ చిత్తశుద్ధిగా ఉన్నాయని చూపుకోవాలని భావిస్తున్నట్టు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment