సాక్షి, హైదరాబాద్: తనను అనవసరంగా ఒక కేసులో ఇరికించి ప్రతిష్ట దెబ్బతీయడంతోపాటు అప్రతిష్టపాలు చేసినందుకు కేసీఆర్ సర్కారు పర్యవసానాలను ఎదుర్కోవాల్సిందేనని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) బీఎల్ సంతోష్ హెచ్చరించారు.
బీఆర్‌ఎస్ చేస్తున్న ‘ఎమ్మెల్యేలకు ఎర’ఆరోపణల్లో నిజానిజాలు త్వరలో నిగ్గుతేలుతాయని.. తనపై చేసిన అవాస్తవ ప్రచారానికి తగిన మూల్యంతోపాటు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. గురువారం శామీర్‌పేటలోని ఓ రిసార్ట్స్‌లో పార్టీ ముఖ్యనేతలు, కమిటీల నాయకులతో సంతోష్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన పలు అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. నాయకులకు దిశానిర్దేశం చేశారు.
తెలంగాణ సంపద రాజకీయం కోసం..
రాష్ట్రంలో భూముల విక్రయం ద్వారా సంపాది స్తున్న వేల కోట్ల రూపాయలను కేసీఆర్ ఇతర రాష్ట్రాల్లో పంచుతున్నారని.. తెలంగాణ సంపదను రాజకీయ అవసరాలకు వాడుతున్నారని బీఎల్ సంతోష్ ఆరోపించినట్టు తెలిసింది. ‘‘పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిన తెలంగాణ సర్కారును ఎట్టిపరిస్థితుల్లోనూ సాగనంపాల్సిందే. రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఒక్కటి మాత్రమే బీజేపీ పరమావధి కాదు. రాష్ట్రంలో అవినీతి నిర్మూలన కూడా ప్రధాన ధ్యేయం.
కేసీఆర్ తెలంగాణ తల్లి పేరును ఉపయోగించుకుని ఆ తల్లికే ద్రోహం చేస్తున్నారు. పాడి ఆవును పూర్తిగా పీల్చిపిప్పి చేసినట్టు చేసి చంపేస్తున్నారు’’అని వ్యాఖ్యానించినట్టు సమాచారం. గతంలో తానెవరో తెలంగాణలో పెద్దగా ఎవరికీ తెలియదని.. సిట్‌తో నోటీసులు ఇచ్చి ప్రతి ఇంటికి తెలిసేలా చేశారని పేర్కొన్నట్టు తెలిసింది. తనపై జరిగిన ప్రచారం మీడియా, ప్రజల దృష్టిని ఆకర్షించిందని.. తనకు ఎయిర్‌పోర్టులో స్వాగతం పలికేందుకు పెద్దసంఖ్యలో వచ్చారని, అంతకు ముందు ఒకరో, ఇద్దరో వచ్చి రిసీవ్ చేసుకునేవారని చెప్పినట్టు సమాచారం.
ఆ నలుగురితో విజయం మనదే..
రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు నియమించిన విస్తారక్, ప్రభారీ, ఇన్‌చార్జి, పాలక్‌లు సమన్వయంతో సమష్టిగా పనిచేస్తే బీజేపీ విజయం ఖాయమని బీఎల్ సంతోష్ చెప్పారు. క్షేత్రస్థాయిలో పోలింగ్‌బూత్, మండల స్థాయి, ఇతర కమిటీలు గట్టిగా కృషి చేస్తే పార్టీకి ఎదురనేదే ఉండదన్నారు. దక్షిణ, పశ్చిమ ప్రాంత రాష్ట్రాల లోక్‌సభ విస్తారక్‌ల శిక్షణ శిబిరంలో ఆయన దిశానిర్దేశం చేశారు. పార్టీ లోక్‌సభ, అసెంబ్లీ విస్తారక్‌లు ఏమాత్రం మొహమాటం లేకుండా వాస్తవదృష్టితో పనిచేయాలని సూచించారు.
కచ్చితత్వంతో పనిచేయడంతోపాటు తీసుకునే నిర్ణయాలు, నిర్వహించే విధులను గురించి స్పష్టమైన అవగాహన ఉండాలన్నారు. ఆయా అంశాల గురించి పార్టీ అడిగితే.. వారు తీసుకున్న వైఖరిని కచ్చితంగా, స్పష్టంగా వివరించాలని పేర్కొన్నారు. ఎంపీ, ఎమ్మెల్యే సీట్ల పరిధిలో ఎక్కడ ఎలాంటి ఇబ్బంది అనిపించినా, సమస్యలు ఎదురైనా వెంటనే అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. ఆయా రాష్ట్రాల సమన్వయకర్తలకు సమాచారం ఇవ్వాలని వివరించారు.
2024లోనూ బీజేపీదే విజయం: జేపీ నడ్డా
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లోనూ బీజేపీ పూర్తి మెజారిటీ సాధించి కేంద్రంలో అధికారంలోకి రావడం తథ్యమని పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ధీమా వ్యక్తంచేశారు. తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ విజయఢంకా మొగించడంతో పాటు, అత్యధిక ఎంపీ సీట్లను పార్టీ గెలుచుకుంటుందనే విశ్వాసం వ్యక్తంచేశారు.గత లోక్‌సభ ఎన్నికల్లో కంటే అధికసీట్లు సాధించి విజయపరంపరను కొనసాగించ బోతున్నామన్నారు.
గురువారం లోక్‌సభ విస్తారక్‌ల శిక్షణా శిబిరం ముగింపు సందర్భంగా ఢిల్లీ నుంచి నడ్డా వర్చువల్‌గా మాట్లాడారు. దక్షిణా రాష్ట్రాలతో పాటు పశ్చిమబెంగాల్, ఒరిస్సా, తదితర రాష్ట్రాల నుంచి ఈ సారి బీజేపీ గెలిచే సీట్ల సంఖ్య పెరుగబోతోందన్నారు. లోక్‌సభ విస్తారక్‌లంతా తమ తమ కార్యక్షేత్రాల్లో చురుకుగా పనిచేయడం ద్వారా మంచి ఫలితాలు సాధించగలమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment