
సీహెచ్‌సీ భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్న మంత్రి బొత్స సత్యనారాయణ
నెల్లిమర్ల: టిడ్కో గృహాలను త్వరలో లబ్ధిదారులకు అప్పగించనున్నట్టు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల పట్టణంలో సోమవారం నిర్వహించిన ‘ప్రజలతో నాడు–ప్రజల కోసం నేడు’ పాదయాత్రలో పాల్గొన్న ఆయన.. రూ 2.08 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన భవనాలను, రామతీర్థం దేవస్థానం ఆర్చ్(ముఖద్వారం)ను ప్రారంభించారు. రూ.4 కోట్లతో నిర్మించే సీహెచ్‌సీ అదనపు భవనాలకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ టిడ్కో ఇళ్ల నిర్మాణంలో గత టీడీపీ ప్రభుత్వం చదరపు అడుగుకు సుమారు రూ.500 అదనంగా చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకుందని, తద్వారా వేలా కోట్ల ప్రజాధనం దోపిడీకి పథక రచన చేసిందన్నారు. ఆ భారం లబ్ధిదారులపై పడకూడదన్న ఉద్దేశంతో తమ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ విధానాన్ని అవలంబించి, ప్రజాధనాన్ని కాపాడినట్టు తెలిపారు. ఈ రివర్స్ టెండరింగ్ కారణంగానే లబ్ధిదారులకు ఇళ్ల అప్పగింత ఆలస్యమైందన్నారు. ఆరు నెలల్లో ఇళ్ల నిర్మాణం పూర్తిచేసి లబ్ధిదారులకు ఇవ్వాల్సి ఉండగా.. గత టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో ఎందుకు ఇవ్వలేకపోయిందని ప్రశ్నించారు. కార్యక్రమంలో ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యే అప్పలనాయుడు, ఎమ్మెల్సీ డాక్టర్ పెనుమత్స సురేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment