నన్ను రాజకీయంగా ఎదుర్కొనలేక కవితను ఇరికించారు: కేసీఆర్
తండ్రిగా బాధ పడుతున్నా సంయమనంతో మౌనం పాటిస్తున్నా
ఎప్పుడు ఎక్కడ ఎలా కొట్టాలో నాకు తెలుసు
చరిత్రలో బీఆర్‌ఎస్‌ది విజయగాథ.. అందరం ఇష్టంతో పనిచేద్దాం
రేవంత్‌రెడ్డి సర్కార్‌కు హనీమూన్ పీరియడ్ ముగిసింది
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీలో పార్టీ అధినేత వెల్లడి
సాక్షి, హైదరాబాద్: ‘రాజకీయంగా ఎదుర్కొనలేక నా కూతురు కవితను కేసులో ఇరికించారు. తండ్రిగా నాకు ఎంతో బాధ ఉన్నా సంయమనంతో మౌనం పాటిస్తున్నా. గరళ కంఠుడిలా బాధను దిగమింగుకుంటున్నా. అగ్ని పర్వతంలా ఉన్నా. నాకు ఎప్పుడు ఎక్కడ ఎలా కొట్టాలో తెలుసు. పార్టీలో ఉండే వారు ఉంటారు.. వెళ్లే వారు వెళ్తారు. పార్టీలో ఉండాలా.. వద్దా అనేది వాళ్ల ధర్మం. కాంగ్రెస్‌కు ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్నా మళ్లీ అధికారంలోకి వచ్చారు. ప్రజలు తలచుకుంటే ఏమైనా జరగొచ్చు. పార్టీకి ఇది క్లిష్ట సమయం అనే వాదన సరికాదు. లక్షలాది కార్యకర్తలు ఉన్న పార్టీ మనది. ధైర్యం చెడకుండా ఇష్టంతో జనంతో మమేకమవుదాం’అని బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు చెప్పారు.
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో తెలంగాణ భవన్‌లో మంగళవారం సుమారు మూడు గంటలపాటు కేసీఆర్ సుదీర్ఘంగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్ అధికారం కోల్పోవడానికి దారితీసిన పరిస్థితులు, రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ స్థితిగతులు, రాబోయే రోజుల్లో అసెంబ్లీ లోపలా బయటా పార్టీ పరంగా అనుసరించాల్సిన కార్యాచరణ తదితరాలపై కేసీఆర్ ప్రసంగించారు. ‘అనేక మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను తయారు చేసిన చరిత్ర బీఆర్‌ఎస్‌కు ఉంది. ఉద్యమ కాలంలో ఢిల్లీతోపాటు స్థానికంగా బలమైన శక్తులతో పోరాడాం. రాష్ట్ర సాధన, అభివృద్ధిలో మనది విజయగాథ. అందరం ఇష్టంతో పనిచేద్దాం. ప్రజలను రెచ్చగొట్టి అధికారంలోకి వచి్చన కాంగ్రెస్ తీరును ప్రజలు గమనిస్తున్నారు’అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
హనీమూన్ పీరియడ్ ముగిసింది
‘రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి వివిధ రంగాలకు సంబంధించిన విధానాలు రూపొందించేందుకు కొంత వ్యవధి ఇచ్చాం. అయితే 8 నెలలు కావస్తున్నా విద్య, వైద్యం, విద్యుత్ సహా ఏ రంగంపైనా ఒక స్పష్టత లేకుండా పోయింది. కొత్త విధానాలు రూపొందించుకోవడంలో పూర్తిగా విఫలమైంది. కొత్త ప్రభుత్వానికి ఇచ్చిన హనీమూన్ పీరియడ్ ముగిసినందున ఇకపై ప్రజాక్షేత్రంలో మనం నిలబడాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రస్తుత ప్రభుత్వంపై ప్రజల్లో రోజురోజుకూ వ్యతిరేకత పెరుగుతోంది.
ఏకకాలంలో రుణమాఫీ అనేది పెద్ద మోసం.. ఈ అంశాన్ని అసెంబ్లీలో ఎండగట్టాలి. అధికారంలోకి వచ్చేందుకు పార్టీలు హామీలు ఇవ్వడం సహజం. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి అమలు దిశగా చిత్తశుద్ధితో ప్రయత్నించకపోవడం ప్రజలను మోసగించడమే’అని కేసీఆర్ పేర్కొన్నారు. వివిధ రంగాల్లో రాష్ట్ర అవతరణ మొదలుకుని బీఆర్‌ఎస్ దూరదృష్టితో అమలు చేసిన పథకాలు, పనులను సోదాహరణంగా వివరించారు. వ్యవసాయ రంగం స్థిరీకరణకు చేసిన ప్రయత్నాలను సుదీర్ఘంగా వివరించారు. అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమల్లో వైఫల్యాలను ఎండగట్టాలని కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment