సమావేశంలో మాట్లాడుతున్న కేటీఆర్. చిత్రంలో తలసాని, మల్లారెడ్డి తదితరులు
మనం టికెట్ ఇస్తేనే రంజిత్‌రెడ్డి ఎవరో తెలిసింది: కేటీఆర్
ఏప్రిల్ 13న చేవెళ్లలో జరిగే బీఆర్‌ఎస్ సభకు కేసీఆర్
చేవెళ్లలో కాంగ్రెస్‌కు అభ్యర్థి కూడా దొరకలేదు
చేవెళ్లలో ఎన్నికల సన్నద్ధతపై సమీక్ష
సాక్షి, హైదరాబాద్: అధికారం, ఆస్తులను కాపాడు కోవడం కోసమే చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి పార్టీని విడిచిపెట్టి ద్రోహం చేశారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. చేవెళ్ల నుంచి బీఆర్‌ఎస్ సీటు ఇచ్చి గెలిపించుకున్న తర్వాతే రంజిత్‌రెడ్డి ఎవరో ప్రపంచానికి తెలిసిందన్నారు. చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలతో బుధవారం కేటీ ఆర్ తెలంగాణ భవన్‌లో భేటీ అయ్యారు.
చేవెళ్ల పరిధిలో ఎన్నికల సన్నద్ధతపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రంజిత్‌రెడ్డిపై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘2019లో రాజకీయాల్లోకి రంజిత్ రెడ్డి కొత్తగా వచ్చినా పార్టీ కార్యకర్తలంతా కష్టపడి ఆయనను గెలిపించారు. ఆయనకు పార్టీలో అత్యధి క ప్రాధాన్యత ఇవ్వడంతోపాటు నియోజకవర్గంలో పూర్తి స్వేచ్ఛ ఇచ్చాం. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయను అని పార్టీ ఎదుట అశక్తతను వ్యక్తం చేయడంతోపాటు రాజకీయాల నుంచి తప్పుకుంటా అని రంజిత్‌రెడ్డి చెప్పారు.
కానీ రంజిత్‌రెడ్డి తన సోదరి అని చెప్పుకున్న కవిత నివాసంలో కేంద్ర ప్రభుత్వ సంస్థలు సోదాలు జరిపి అరెస్టు చేసిన రోజే నవ్వుకుంటూ కాంగ్రెస్‌లో చేరిన స్వార్థపరుడి గా మిగిలిపోయారు. 2019 లోక్‌సభ ఎన్నికల ముందు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కూడా పార్టీ కంటే తానే ఎక్కువ అనుకుని వేరే పార్టీలోకి వెళ్లి పోటీ చేస్తే ఫలితం ఏమైందో అందరికీ తెలుసు. పార్టీ కంటే తాను పెద్ద అనే అహంకారం ఉన్న వ్యక్తులు రాజకీయాల్లో గెలవరు.
అదే నిజమైతే దేశంలో పార్టీలతో సంబంధం లేకుండా స్వతంత్ర అభ్యర్థులే గెలుస్తారు. సీఎం రేవంత్‌రెడ్డి, రంజిత్‌రెడ్డి మనసులు కలిసినంత మాత్రాన క్షేత్రస్థాయిలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ శ్రేణులు కలిసి పనిచేస్తాయని అ నుకోవడం వారి రాజకీయ అజ్ఞానానికి నిదర్శనం. చేవెళ్లలో కాంగ్రెస్‌కు కనీసం అభ్యర్థి కూడా దొరకలేదు. పార్టీలో సొంతంగా అభ్యర్థులు లేని కాంగ్రెస్.. చేవెళ్ల, మల్కాజిగిరి, సికింద్రాబాద్ నియోజకవర్గాల్లో గెలుపొందడం అసాధ్యం’అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
13న చేవెళ్లలో భారీ సభ
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏప్రిల్ 13న చేవెళ్లలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని బీఆర్‌ఎస్ నిర్ణయించింది. ఈ సభకు పార్టీ అధినేత కేసీఆర్ హాజరుకానున్నారు. బుధవా రం తెలంగాణ భవన్‌లో జరిగిన భేటీలో సభ ఏర్పాట్లు, జన సమీకరణ తదితరాలపై కేటీఆర్ చర్చించారు. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాత బీఆర్‌ఎస్ నిర్వహిస్తున్న తొలి సభ కావడంతో ఏర్పాట్లను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని నిర్ణయించారు.
కాగా చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని నేతలతో ఈ నెల 29న తెలంగాణ భవన్‌లో సమావేశం జరగనుంది. బుధవారం కేటీఆర్ అధ్యక్షతన జరిగిన భేటీలో పార్టీ చేవెళ్ల అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్‌తోపాటు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, కాలే యాదయ్య, ప్రకాశ్‌గౌడ్, ఎమ్మెల్సీలు వాణీదేవి, ఎగ్గె మల్లేశం, మాజీ ఎమ్మెల్యేలు మహేశ్‌రెడ్డి, డాక్టర్ ఆనంద్, రోహిత్‌రెడ్డితోపాటు పార్టీ నేతలు కార్తీక్ రెడ్డి, శ్రీశైల్‌రెడ్డి పాల్గొన్నారు.
ట్యాపింగ్ పేరుతో డైవర్ట్ చేస్తున్నారు
రేవంత్‌పై కేటీఆర్ ధ్వజం
‘పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ ఎస్ ఒక్క సీటు కూడా గెలవదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఇద్దరం ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి మల్కాజిగిరిలోనే పోటీకి దిగుదాం రమ్మంటే నోరు మెదపలేదు. దమ్ముంటే పోటీ చెయ్.. ఇప్పటికీ నేను నా సవాల్‌కు కట్టుబడే ఉన్నా’ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్‌లో మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘భారీ డైలాగులే తప్ప విషయానికి వస్తే పారిపోయే పిరికివాడు రేవంత్‌రెడ్డి. ఈ ఎన్నికల పోరు వ్యక్తుల మధ్య కాదు. పదేళ్ల నిజానికి (బీఆర్‌ఎస్), వంద రోజుల అబద్ధానికి (కాంగ్రెస్), మరో పదేళ్ల విషానికి (బీజేపీ) మధ్యన జరుగుతున్నాయి.
కేసీఆర్‌ను నోటికొచ్చినట్లు తిడుతున్న వారిని చూసి ఎందరో వేదన చెందుతున్నారు. నాకూ తన్నాలనే ఉంది కానీ అంతకంటే బలమైన ఓటు దెబ్బతోనే గట్టిగా జాడించి తన్నాలి. ఆరు గ్యారంటీల అమలు చేతకాక ట్యాపింగ్‌లు, స్కాములు, స్కీముల పేరిట గారడీలు చేస్తూ ప్రజలను డైవర్ట్ చేస్తున్నారు. పది లక్షల ఫోన్లు ట్యాప్ చేశారంటున్నారు. లంగలవి, దొంగలవి, ఒకరిద్దరు లుచ్చాగాళ్లవి ట్యాప్ చేసి ఉండొచ్చు. అది పోలీసుల పని. హీరో నాగార్జున గ్రీకువీరుడైతే, ఈయన లీకు వీరుడు. ధైర్యముంటే లీకులు బంద్ చేసి మీరు చేసిన తప్పు ఇదీ అని చెప్పు. నువ్వే ముఖ్యమంత్రివి, ఎవరిని లోపల వేస్తావో వేయ్.. అంతేకానీ లేనిపోని మాటలెందుకు’ అని కేటీఆర్ అన్నారు.
ఈటల ఇంకా బీఆర్‌ఎస్‌లో ఉన్నా అనుకుంటున్నడు
‘హుజూరాబాద్, గజ్వేల్‌లో ఓడిపోయిన ఈటల రాజేందరన్న తానింకా బీఆర్‌ఎస్‌లో ఉన్నా అను కుంటున్నడు. రైతులకు రుణమాఫీ ప్రకటిస్తే ఇప్పుడు పోటీ నుంచి తప్పుకుంటా అంటున్న డు. మల్కాజిగిరిలో వేరే పార్టీల నుంచి పోటీ చేస్తున్న వారు కేసీఆర్‌కు వెన్నుపోటు పొడిచి వెళ్లినవారే. బీఆర్‌ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డిని గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ కష్టపడాలి’ అని కేటీఆర్ చెప్పారు. కార్యక్రమంలో పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, మాజీ మంత్రులు తలసాని, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment