సాక్షి, హైదరాబాద్: బీఆర్‌ఎస్ అభ్యర్థుల జాబితా చూసి కాంగ్రెస్‌గెలుపు ఖాయమనే నమ్మకం తెలంగాణ ప్రజలకు కలిగిందని కాంగ్రెస్ ఎంపీ, తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. సోమవారం గాంధీభవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడుతూ..
‘‘కేసీఆర్ రెండు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయడం అంటే.. తన ఓటమిని అంగీకరించినట్లే. ఓటమి భయం ఉన్న కేసీఆర్ కచ్చితంగా ఓడిపోతారు. మధ్యాహ్నం 12.08కి అభ్యర్థులను ప్రకటిస్తామని ముందుగా చెప్పారు. కానీ, ఆ టైంకి లిక్కర్ టెండర్ల డ్రా తీశారు. మహిళల టికెట్ల విషయంలో ఎమ్మెల్సీ కవిత బయటకు వచ్చి మాట్లాడాలి. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో దోస్తానా చేసుకుని.. ఇప్పుడు కరివేపాకులా కమ్యూనిస్టు పార్టీలను వాడుకొని పారేశారు. మోసం చేసిన కమ్యూనిష్టులు కేసీఆర్పై తిరుగుబాటు చేయాలి. తెలంగాణ కోసం అత్మబలిదానం చేసుకున్న శ్రీకాంతాచారి తల్లిని కేసీఆర్ అవమానించారు అని రేవంత్ మండిపడ్డారు.
12,500 గ్రామ పంచాయతీలకు విద్యుత్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఔటర్ రింగ్ రోడ్, ఎయిర్‌పోర్ట్, మెట్రో ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. బినామీల భూముల విలువ పెంచడానికే ఓఆర్‌ఆర్ చుట్టూ మెట్రో వేస్తున్నారు అంటూ ఆరోపణలు గుప్పించారు రేవంత్. నాడు వైఎస్ హయాంలో హైదరాబాద్ ఇంచార్జీ మంత్రి గా షబ్బీర్ ఆలీ సేవలు అందించారు. మైనార్టీ నాయకుడిని ఓడించాలనే కేసీఆర్ కామారెడ్డి లో పోటీ చేస్తున్నారు. ఉచిత విద్యుత్ అంటే నాడు కొందరు బట్టలు అరేసుకోవాలని వెటకారం చేశారు. తెలంగాణ కాడి కేసీఆర్ కింద పడేస్తేనే జానారెడ్డి, కోదండ రామ్ కలిసి JAC ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ హయంలోనే చాలా ప్రాజెక్టులు పూర్తి చేశారు. గత 50 ఏళ్లలో కాంగ్రెస్ ఎం చేసిందో కేసీఆర్ చర్చకు వస్తే చెప్పడానికి సిద్దంగా ఉన్నా అంటూ ప్రతిసవాల్ విసిరారు రేవంత్.
రెండు పంటలకు మాత్రమే రైతు బంధు ఎందుకు ఇస్తున్నారు. మూడో పంటకు రైతు బంధు ఎందుకు ఇవ్వడం లేదు. పేదలకు నాలుగు వేల పెన్షన్ ఇస్తాం.. కేసీఆర్ గోడ మీద రాసి పెట్టుకోవాలి. రాష్ట్రంలో ప్రభుత్వం ఏ అగ్రిమెంట్ చేసుకున్నా.. వారంలోపే విదేశాలకు వెళ్తారు. ఓట్ల కోసం డబ్బులు, మద్యం పంచబోము అని యదాద్రి, నాంపల్లి దర్గా, మెదక్ చర్చిలో ప్రమాణం చేయడానికి సిద్దమా ! అంటూ కేసీఆర్‌కు సవాల్ విసిరిన రేవంత్.. పార్టీ ఆదేశిస్తే, కార్యకర్తలు కోరితే నేను ఎక్కడైనా పోటీచేస్తానని ప్రకటించారు.
ఇదీ చదవండి: అధిష్టానం చెప్పింది అందుకే కామారెడ్డిల పోటీ- కేసీఆర్
Comments
Please login to add a commentAdd a comment