కాంధార్‌ లోహలో నేడు బీఆర్‌ఎస్‌ సభ | BRS Sabha today in Kandhar Loha | Sakshi
Sakshi News home page

కాంధార్‌ లోహలో నేడు బీఆర్‌ఎస్‌ సభ

Published Sun, Mar 26 2023 2:24 AM | Last Updated on Sun, Mar 26 2023 3:11 PM

BRS Sabha today in Kandhar Loha - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘అబ్‌ కీ బార్‌.. కిసాన్‌ సర్కార్‌’ నినాదంతో మహారాష్ట్రలోని కాంధార్‌ లోహలో ఆదివారం జరిగే బహిరంగ సభకు భారత్‌ రాష్ట్ర సమితి(బీఆర్‌ఎస్‌) ఏర్పాట్లు పూర్తి చేసింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సభకు అధ్యక్షత వహిస్తారు.

ఆదివారం ఉదయం 12.30 సమయంలో బేగంపేట విమానాశ్రయం నుంచి కేసీఆర్‌ ప్రత్యేక విమానంలో బయలుదేరి నాందేడ్‌కు చేరుకుంటారు. అక్కడ నుంచి హెలికాప్టర్‌లో బహిరంగ సభ కాంధార్‌ లోహకు చేరుకుని బస్సులో సభా స్థలికి చేరుకుంటారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు జరిగే బహిరంగ సభలో పాల్గొని తిరిగి హెలికాప్టర్‌ ద్వారా నాందేడ్‌కు చేరుకుంటారు.

సూర్యాస్తమయానికి ముందే నాందేడ్‌ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తిరిగి బయలుదేరి వస్తారు. నాందేడ్‌ విమానాశ్రయం నుంచి రాత్రి సమయంలో  విమానాలు నడిచే అవకాశం లేనందున  సాయంత్రం నాలుగు గంటల లోగా సభ ముగుస్తుందని బీఆర్‌ఎస్‌ వర్గాలు వెల్లడించాయి.

18 ఎకరాల విస్తీర్ణంలో సభ ఏర్పాట్లు
కాంధార్‌ లోహలోని బైల్‌బజార్‌ కూడలిలో 18 ఎకరాల విస్తీర్ణంలో బహిరంగ సభ వేదికతో పాటు తాత్కాలిక షెడ్ల నిర్మాణం, పార్కింగ్‌ ఏర్పాట్లు చేశారు.  కాంధార్‌ లోహతో  పాటు పట్టణానికి వెళ్లే మార్గాలన్నీ బీఆర్‌ఎస్‌ ఫ్లెక్సీలు, తోరణాలతో గులాబీమయంగా మారాయి.

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, షకీల్‌తో బీఆర్‌ఎస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి హిమాన్షు తివారీ, టీఎస్‌ఐఐసీ చైర్మన్‌ గ్యాదరి బాలమల్లు కొన్ని రోజులుగా అక్కడే మకాం వేసి స్థానిక బీఆర్‌ఎస్‌ నేతలతో కలిసి సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్, ఎంపీ బీబీ పాటిల్‌ శనివారం అక్కడికి చేరుకుని సభ ఏర్పాట్లను  పర్యవేక్షించారు. 

మహారాష్ట్ర స్థానిక సంస్థలపై ఫోకస్‌
భారత్‌ రాష్ట్ర సమితి కార్యకలాపాలను జాతీయ స్థాయిలో విస్తరించడంలో భాగంగా తెలంగాణకు పొరుగునే ఉన్న మహారాష్ట్రపై కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి సారించారు. గత నెల 5న నాందెడ్‌ జిల్లా కేంద్రంలో బీఆర్‌ఎస్‌ చేరికల సభ నిర్వహించగా, ప్రస్తుతం కాంధార్‌ లోహలో మలి సభను నిర్వహిస్తున్నారు. త్వరలో జరిగే మహారాష్ట్ర స్థానిక సంస్థల్లో పోటీ చేస్తామని ఇప్పటికే బీఆర్‌ఎస్‌ సంకేతాలు ఇచ్చింది.

ఈ నేపథ్యంలో బీజేపీ, ఆప్, ఎన్సీపీతో పాటు పలు ప్రజా సంఘాలకు చెందిన బీఆర్‌ఎస్‌లో చేరారు. వీరిలో వివిధ పార్టీలకు చెందిన పలువురు మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు కూడా ఉన్నారు. ఆదివారం జరిగే బహిరంగ సభలో ఇతర పార్టీలకు చెందిన ముఖ్య నేతలు కూడా బీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు నేతలు వెల్లడించారు.

తెలంగాణ మోడల్‌కు ప్రాధాన్యత
బహిరంగ సభకు జన సమీకరణతో పాటు మహారాష్ట్ర గ్రామాల్లో తెలంగాణ మోడల్‌ను బీఆర్‌ఎస్‌ విస్తృతంగా ప్రచారం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు, రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి తదితర ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులను ప్రచారం చేసేందుకు 20 ప్రచార రథాలు, 16 డిజిటల్‌ స్క్రీన్‌ ప్రచార వాహనాలను ఉపయోగిస్తోంది.

16 తాలూకాల పరిధిలోని 1,600 గ్రామాల్లో తెలంగాణ మోడల్‌ను విస్తతంగా ప్రచారం చేసేందుకు ఈ ప్రచార రథాలను ఉపయోగిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే నాటికి నాందేడ్, ఔరంగాబాద్, బీడ్, ఉస్మానాబాద్, షోలాపూర్‌ తదితర ప్రాంతాల్లో పార్టీని బలోపేతం చేసేందుకు కాంధార్‌ లోహ తరహాలో మరిన్ని సభలు నిర్వహించేందుకు బీఆర్‌ఎస్‌ సన్నాహాలు చేస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement