సాక్షి ప్రతినిధి, నెల్లూరు: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, ఆయన ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన నారాయణ విద్యా సంస్థల అధినేత పొంగూరు నారాయణ డబ్బు వసూళ్ల వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
వడ్డీ ఆశ చూపించి రాబోయే ఎన్నికల కోసం నెల్లూరు, ప్రకాశం జిల్లాల వ్యాపారుల నుంచి వందల కోట్లు వసూలు చేసిన వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. నారాయణకు చెందిన నెల్లూరులోని నారాయణ వైద్య కళాశాల కేంద్రంగా ఈ వసూళ్లు జరిగాయి. దీనికోసం ఈ కాలేజిలో వారం క్రితం 4 కౌంటర్లు ఏర్పాటు చేశారు. వాటి ద్వారా రూ.650 కోట్లు వసూలు చేసి, రహస్య ప్రదేశానికి తరలించినట్లు సమాచారం.
రూ.5 వడ్డీకి ..
విద్యా సంస్థల అధినేత అయిన నారాయణకు మార్వాడీలు, వ్యాపారులతో మంచి సంబంధాలు ఉన్నాయి. విద్యా సంస్థల కోసం వ్యాపారులతో తరచూ లావాదేవీలు నిర్వహించేవారు. దీంతో గత ఎన్నికల్లోనూ ఇలాగే రూ.2 వడ్డీకి రూ.400 కోట్లు వసూలు చేసినట్లు ప్రచారం జరిగింది. ఈసారి 2 రూపాయల వడ్డీకి వ్యాపారులు ముందుకు రాకపోవడంతో ఐదు రూపాయలకు పెంచారు. ఈమేరకు ప్రకాశం, నెల్లూరు జిల్లాల వ్యాపారులు, మార్వాడీలకు సమాచారమిచ్చారు.
వడ్డీ పెరగడంతో అనేక మంది వ్యాపారులు, మార్వాడీలు క్యూ కట్టారు. ఇలా నాలుగు రోజుల్లోనే రూ.650 కోట్లు సేకరించినట్లు సమాచారం. వ్యాపారులే కాకుండా, నారాయణ సంస్థలో పనిచేసే ఉద్యోగుల నుంచి కూడా నగదు సేకరించారు. ఈ సొమ్ముకు ఆధారాలు ఉండకూడదన్న ఉద్దేశంతో ఎవరికీ రశీదులు ఇవ్వలేదు. అందుకు బదులుగా టోకెన్ల ద్వారా లావాదేవీలు నిర్వహించారు.
వ్యాపారులు నగదు చెల్లించగానే టోకెన్లు ఇచ్చారు. వడ్డీ కావాల్సిన వారికి ప్రతి నెలా వడ్డీ చెల్లిస్తామని, లేదంటే ఏడాది తర్వాత అసలు, వడ్డీ కలిపి ఇస్తామని వ్యాపారులకు చెప్పారు. నారాయణ కళాశాలలో వడ్డీ వ్యాపారం బయటకు పొక్కడంతో దుకాణాలు మూయించేశారు. నగదును రహస్య ప్రాంతంతో దాచేశారు. అక్కడి నుంచి పార్టీ అధినేత సూచనల మేరకు అభ్యర్థులకు చేరవేస్తారు.
నారాయణ ఇష్టారాజ్యం
చంద్రబాబుతో అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగి, ఆయన బినామీగా ఉన్న నారాయణ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకముందే చంద్రబాబు ఆర్థిక వ్యవహారాలు చూసుకునేవారు. ప్రతి ఎన్నికల సమయంలో తన విద్యా సంస్థల నుంచే డబ్బు సేకరించి చంద్రబాబుకు పంపుతుంటారు. అంతేకాదు తన విద్యా సంస్థల ఉద్యోగుల ద్వారానే సర్వేలు చేయించేవారు. 2014లో చంద్రబాబు సీఎం కాగానే నారాయణకు ఎమ్మెల్సీ కట్టబెట్టి ఏకంగా మంత్రిని చేశారు.
చంద్రబాబు కేబినెట్‌లో కీలక మంత్రిగా ఉంటూ ఆయన బినామీగా నారాయణ రాజధాని భూసేకరణ నుంచి అన్నింటా ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ఈ సందర్భంగా భారీ స్థాయిలో అక్రమాలకు పాల్పడిన విషయం తెలిసిందే. నారాయణ విద్యా సంస్థల్లోనూ విద్యార్థులపై అమానుష ఘటనలు పలుమార్లు వెలుగుచూశాయి. విద్యార్థుల బలవన్మరణాలకూ దారి తీశాయి. ఇటీవలి కాలంలో నారాయణ వైద్య కళాశాలలో డ్రగ్స్ కూడా విక్రయిస్తున్నారన్న ఆరోపణలు వచ్చాయి.
రెండేళ్ల క్రితం ఓ వైద్యుడు మత్తు ఇంజక్షన్ చేసుకొని మృతి చెందిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇటీవల విద్యార్థులు అనేక మంది మత్తు పదార్థాలకు బానిసలవుతున్నారని తల్లిదండ్రుల నుంచి పలు ఫిర్యాదులు వచ్చాయి. కళాశాలలో నిషేధిత మందుల విక్రయాలు జరుగుతున్నట్లు ఉన్నతాధికారులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం జిల్లా ఔషధ నియంత్రణ అధికారులు కాలేజీలో సోదాలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment