ముంబై: కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) పరిధిపై ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మహారాష్ట్ర మత్స్య, జౌళి శాఖ మంత్రి అస్లాం షేక్ శుక్రవారం స్వాగతించారు. సీబీఐ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంలో ఒక పాన్ షాప్‌లా మారిందని ఆరోపించారు. సీబీఐ ఎక్కడికైనా వెళ్తుందని, ఎవరిపై అయినా కేసు పెడుతుందని అన్నారు. బీజేపీయేతర పార్టీల పాలన ఉన్న రాష్ట్రాల్లోనే తన ప్రతాపం చూపిస్తుందని ఎద్దేవా చేశారు. ఏకంగా ముఖ్యమంత్రులు, మంత్రులకు వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటుందని వ్యాఖ్యానించారు.
సీబీఐకి దాని పరిధి ఏమిటో గుర్తు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా సీబీఐ అక్కడ దర్యాప్తు ప్రారంభించరాదని సుప్రీంకోర్టు ఇటీవలే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. సీబీఐ పరిధిని నియంత్రిస్తున్న ఢిల్లీ స్పెషల్ పోలీసు ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్‌ను జస్టిస్ ఏఎం ఖాన్వీల్కర్, జస్టిస్ బీఆర్ గవాయిల సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రస్తావించింది. చట్ట ప్రకారం.. ఒక రాష్ట్రంలో ఏదైనా కేసులో సీబీఐ దర్యాప్తు జరపాలంటే అక్కడి ప్రభుత్వ అనుమతి ముందుగా తీసుకోవాల్సిందేనని ధర్మాసనం స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment