ఇఫ్తార్ విందులో అసదుద్దీన్‌తో సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘కేంద్రంలో గడబడ ఉంది. దానికేదో రోగం సోకింది. చికిత్స చేయాల్సి ఉంది. దేశం బాగుంటే రాష్ట్రం బాగుంటుంది. దేశం నాశనం అవుతుంటే, కావాలని మరీ దేశంలో దుష్ట పరిస్థితులను సృష్టిస్తుంటే .. దేశవాసులుగా ఆపాల్సిన బాధ్యత మనపై ఉంది. దేశాన్ని కాపాడుకోవాలి. దేశ ప్రయోజనాల కోసం అందరూ నడుం బిగించాలి.
ఏవిధంగానైతే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించామో, ప్రగతి బాట పట్టించామో..అదే తరహాలో దేశం కోసం మేము నడుం బిగిస్తాం. ఈ విషయంలో అనుమానాలకు తావు లేదు..’ అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. దేశానికి ప్రయోజనం చేకూర్చేందుకు వీలుగా తమకు మంచి స్థానమే లభిస్తుంది అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రంజాన్ మాసం సందర్భంగా శుక్రవారం నగరంలోని ఎల్బీ స్టేడియంలో ముస్లింలకు సీఎం ఇఫ్తార్ విందు ఇచ్చి మాట్లాడారు.
బుద్ధి జీవులు గళం విప్పుతారు..
‘భూమిపై దుష్ట శక్తుల ఆటలు అన్ని రోజులూ సాగవు. నిర్మాణాత్మక పాత్ర పోషించే శక్తులే తుదకు విజయం సాధి స్తాయి. మానవత్వం ఎన్నటికీ అంతం కాదు. కొన్ని శక్తులు పని చెడగొట్టడానికి, అల్లర్లు చేయడానికి ప్రయత్ని స్తాయి. వాళ్లు ఎప్పుడూ విజయం సాధించలేరు. విరగ్గొట్టడం, పగలగొట్టడం చాలా సులువు. కానీ దేన్నైనా నిర్మించడం కష్టం.
సిలికాన్ వ్యాలీగా పేరొందిన బెంగళూరులో విషాన్ని ఎలా వ్యాప్తి చేస్తున్నారో చూస్తున్నాం. దేశమం తటా ఇదే జరుగుతోంది. ఇది మంచిది కాదు. ప్రజలు అర్థం చేసుకో వాలని మేము కోరుతున్నాం. బుద్ధి జీవులు అర్థం చేసుకుం టున్నారు. మున్ముందు బయటకు వచ్చి బహిరంగంగా గళం విప్పుతారు..’ అని ముఖ్యమంత్రి అన్నారు.
కేంద్రంలో గడబిడుంటే రాష్ట్రంలో కూడా ఉంటుంది..
‘కేంద్రం బలహీనంగా ఉంటే రాష్ట్రాలూ బలహీనం అవు తాయి. కేంద్రంలో గడబిడ ఉంటే రాష్ట్రాల్లో కూడా గడబిడ అవుతుంది. 2014లో రూ.1.24 లక్షలున్న రాష్ట్ర తలసరి ఆదాయం 2021లో రూ.2.78 లక్షలకు పెరిగింది. రాష్ట్ర జీఎస్డీపీ రూ.11.5 లక్షల కోట్లు. రాష్ట్రంతో పోల్చితే కేంద్రం సగం కూడా సాధించలేక పోయింది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంతో సమానంగా పనిచేసి ఉంటే మన జీఎస్డీపీ రూ.14.5 లక్షల కోట్లు ఉండేది. ఏడేళ్ల కిందట తెలంగాణలో తీవ్ర దుర్భర పరిస్థితులుండేవి.
తాగేందుకు నీళ్లు, కరెంట్, రైతులకు సాగునీరు ఉండేది కాదు. భగవంతుడి దయ, ప్రజల సహకారంతో ఏడున్నరేళ్లలో ఈ సమస్యలను అధిగమించాం. రాష్ట్రం ఎన్నో రంగాల్లో నిర్మాణాత్మక కృషి చేసి దేశానికి ఆదర్శంగా నిలిచింది. విద్యుత్ సమస్యను అధిగమించి అన్ని రంగాల వినియోగదారులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. నేడు యావత్ దేశం అంధకారంలో ఉంటే, తెలంగాణ రాష్ట్రం వెలిగిపోతోంది. తాగునీరు, సాగునీరు, పంటల దిగుబడి.. అన్ని రంగాల్లో రాష్ట్రం అద్భుత ప్రగతి సాధించింది..’ అని కేసీఆర్ తెలిపారు.
ఇంకా చాలా చేయాల్సి ఉంది..
‘ఇప్పుడే మైనారిటీ గురుకుల పాఠశాల విద్యార్థులను కలిసి వచ్చిన. తెలంగాణ రాష్ట్రం తరహాలో యావత్ దేశంలో మైనారిటీ గురుకుల విద్యా సంస్థలను నిర్వహిం చాలనే చర్చ జరుగుతోంది. ఇంతటితో సరిపెట్టుకోకుండా ఇంకా మేము చాలా చేయాల్సి ఉంది. రాష్ట్రంలో మంచి పరిస్థి తులున్నాయి..’ అని సీఎం పేర్కొన్నారు. తెలంగాణ సహా దేశంలోని ముస్లింలకు హృదయపూర్వక రంజాన్ శుభా కాంక్షలు తెలిపారు.
మెరిట్ ఆధారంగా ఎంపిక చేసిన మైనా రిటీ గురుకుల విద్యార్థులకు సీఎం రంజాన్ కానుకలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, కొప్పుల ఈశ్వర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లా రెడ్డి, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ, ప్రభుత్వ సల హాదారులు ఏకే ఖాన్, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేం దర్‌రెడ్డి, ఇరాన్, టర్కీల దౌత్య అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment