సాక్షి, కాకినాడ: ఎన్నికలకు ఇంకో ఏడాది ఉన్న తరుణంలో చంద్రబాబు రోజుకో వేషం పూటకో మాట మాట్లాడుకుంటూ మళ్ళీ ప్రజల్ని మభ్య పెట్టే కార్యక్రమం చేపట్టారని మాజీ మంత్రి కురసాల కన్నబాబు ధ్వజమెత్తారు. ప్రాంతాలలో చిచ్చు పెట్టి, తన మాయలో పడేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. తానేదో సత్యహరిశ్చంద్రుడిలా, నీతి మంతుడిలా, ప్రపంచానికి పాఠాలు నేర్పుతున్న గురువులా బిల్డప్‌లు ఇవ్వడం బాబు ప్రారంభించాడని, కొన్ని ఎల్లో పత్రికలు అయితే చంద్రబాబు ప్రవచనాలతో పేజీలకు పేజీలు నింపాయని ఫైర్ అయ్యారు.
'పేదరిక నిర్మూలనకు.. ఈ వృద్ధ నాయకుడికి కొత్త విజన్ అట.. అసలు పేదల గురించి చంద్రబాబు మాట్లాడటం హాస్యాస్పదం. 1995లో తొలిసారి ముఖ్యమంత్రి అయినవాడు.. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసినవాడు, 28 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నవాడు, ఇప్పుడు కొత్తగా పేదరిక నిర్మూలన అని అంటున్నాడు. పేదలకు ఏం చేశావు అంటే.. తన మార్కు ఉన్న ఒక్క పథకం పేరు చెప్పలేడు. పేదరిక నిర్మూలన గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు ఎక్కడ ఉంది. ఇప్పుడు మళ్ళీ ప్రధాని మోడీ ప్రారంభింంచిన 2047 విజన్ కు తాను మద్దతు ఇచ్చానని చెబుతున్నాడు.' అని కన్నబాబు ఏకిపారేశారు.
మోదీ కనికరం కోసం మోకరిల్లిన బాబు
'రిపబ్లిక్ టీవీకి చంద్రబాబు ఇచ్చిన ఇంటర్వ్యూ చూస్తే.. మోదీ కోసం తాను రెడీగా ఉన్నానని, ఆయన కరుణ కోసం ఎదురు చూస్తున్నాడన్నది.. రాజకీయాల్లో ఏ కొంచెం అవగాహన ఉన్నవారైనా ఇట్టే చెబుతారు. గతంలో మీరు ఎన్డీఏ యేతర పార్టీలతో కూటమి కట్టారు కదా.. అని ఇంటర్వ్యూలో అడిగితే.. అప్పుడు కూడా మోదీని వ్యతిరేకించలేదు. ఆయన విజన్ తో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఆయన కోసం నేను, నా ప్రజలు కలిసి పనిచేస్తాం.. అని చెప్పే పరిస్థితికి బాబు వచ్చాడు.' అని కన్నబాబు ఎద్దేవా చేశారు.
కొడుక్కి రాజకీయ భవిష్యత్తు ఇవ్వడమే బాబు విజన్
'అనుభవం ఉందని 2014లో అధికారం అప్పగిస్తే.. ఒక్క పర్మినెంటు బిల్డింగు కట్టలేని వాడు, శివ రామకృష్ణన్ కమిటీ వద్దన్న చోటే రాజధానిని ప్రకటించి.. ఏమీ చేయలేని వాడు చంద్రబాబు. చంద్రబాబుకు విజన్ లేదు.. విస్తరాకుల కట్టా లేదు. బాబుకు భజన చేసే నారాయణ లాంటి వారు, కొన్ని కమ్యూనిస్టు పార్టీల నాయకులు ఇప్పుడు ఏం మాట్లాడతారో చూడాలి. చంద్రబాబుకు ఉన్న విజన్ ఒక్కటే.. ఎలాగైనా మళ్ళీ అధికారంలోకి రావాలి. తన చుట్టూ ఉన్న వందిమాగధులకు దోచి పెట్టాలి. తన కొడుక్కు రాజకీయ భవిష్యత్తు ఇవ్వాలి. ఇంతకంటే వేరే విజన్ బాబుకు ఉందా..?' అని మాజీ మంత్రి ప్రశ్నించారు.
చదవండి: టీడీపీ నేత వినోద్‌కుమార్ జైన్‌కు జీవితకాల జైలుశిక్ష
Comments
Please login to add a commentAdd a comment