సాక్షి, నంద్యాల: రాష్ట్రంలో వచ్చే మూడునెలలు టీడీపీ–జనసేన జెండాలు పట్టుకుని తిరగాలని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. తెలుగుదేశంతోనే అభివృద్ధి సాధ్యమని చెప్పారు. గోదావరి నుంచి 350 టీఎంసీలు రాయలసీమకు తరలించి సీమను సస్యశ్యామలం చేస్తామన్నారు. రా కదిలిరా కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆయన నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.
టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుచేస్తామని, నంద్యాల జిల్లాను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దే బాధ్యత తాము తీసుకుంటామన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ప్రచార పిచ్చి పట్టుకుందని, పాసు పుస్తకాలపైనా తన బొమ్మలు వేసుకుంటున్నారని విమర్శించారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు దోపిడి దొంగలుగా మారారని, ఈ ప్రభుత్వంలో అన్ని వర్గాలు నాశనమయ్యాయని ఆరోపించారు.
వైఎస్సార్‌సీపీ మంత్రులది సామాజిక యాత్ర కాదని అది మోసాలయాత్ర అన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే ఉమ్మడి కర్నూలు జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేస్తామన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులతో పాటు పెద్దఎత్తున పరిశ్రమలను స్థాపించి నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. నందికొట్కూరులో విత్తన సరఫరా యూనిట్‌ను, ఎమ్మిగనూరులో టెక్స్‌టైల్ పార్కును జగన్ ధ్వంసం చేశారని ఆరోపించారు. జగన్ వదిలిన బాణం ఎక్కడ తిరుగుతోందని వైఎస్ షర్మిలనుద్దేశించి ఆయన ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment