పవన్ కల్యాణ్‌ని తిట్టిస్తున్నారని చంద్రబాబు చెప్పడం దేనికి సంకేతం? | Chandrababu Naidu Caste Based Politics And Immature Comments | Sakshi
Sakshi News home page

కుప్పంలో దెబ్బ పడుతుందని తెలిసే.. బాబు ‘కుల’ రాగం అందుకున్నారా?

Published Sun, Sep 4 2022 1:36 PM | Last Updated on Sun, Sep 4 2022 3:27 PM

Chandrababu Naidu Caste Based Politics And Immature Comments - Sakshi

ఆంధ్రప్రదేశ్ మాజీముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కులం గురించి గొప్పగా చెప్పారు. కులం గురించి మాట్లాడినవారికి చెప్పు చూపాలని ఆయన కొద్ది రోజుల క్రితం  సూచించారు. ఎంత గొప్ప విషయం. కులం పునాదుల మీద రాజకీయాలలోకి వచ్చి, కులం గోడలను అడ్డు పెట్టుకుని రాజకీయాలలో కొనసాగుతున్న చంద్రబాబు నాయుడు ఇలా మాట్లాడడం ఆసక్తికరమైన అంశమే. ఒక రకంగా  ఇది ఆహ్వానించ దగ్గ పరిణామమే. కాకపోతే ఇందులో ఆయనకు ఉన్న చిత్తశుద్ది ఎంత అన్నదే చర్చనీయాంశం.

ఒక వైపు కులం, మతం గురించి మాట్లాడవద్దని అంటారు. మరో వైపు తానే ఆ విషయాలను  ప్రస్తావిస్తుంటారు. ఆయన లెక్కలో  తాను మాట్లాడితే అది కులం గురించి అనుకోకూడదు. మతం గురించి అనుకోకూడదు. అప్పుడు దేశం, సమాజం హితవు గురించి అని జనం అంతా అనుకోవాలి. ఇతరులు మాట్లాడినా, మాట్లాడకపోయినా వీలైనంత బురద రాయాలి. ఇదే ఆయన థీరీ. 

తాను అధికారంలో ఉంటే ఎన్నో సుద్దులు, అధికారంలో లేకపోతే శాపనార్ధాలు.. ఈ రకంగా విజయవంతంగా రాజకీయం సాగిస్తున్న చంద్రబాబుకు  గత మూడేళ్లుగా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. దానికి కారణమేమిటంటే  ఆయన మాట్లాడే మాటలలోని వైరుధ్యాలను, గతంలో ఆయన అవే అంశాలపై భిన్నంగా  మాట్లాడిన తీరును గుర్తు చేస్తూ సోషల్ మీడియాలో విస్తారంగా కామెంట్లు వచ్చేస్తున్నాయి. సోషల్ మీడియా లేకపోతే ఎప్పటికీ అదే  పద్దతిలో విజయంతంవంతంగా నడిపేవారేమో! 

విశేషం ఏమిటంటే ఏ సభలో అయితే ఆయన కులం గురించి మాట్లాడితే చెప్పు చూపాలని అన్నారో, అదే సభలో  వైఎస్సార్‌సీపీని విమర్శిస్తూ, ఆయనే కులం ప్రస్తావనను పదే పదే తేవడం. తన కులం వారితోనే తనను తిట్టిస్తున్నారని చెప్పడం. ఆయన అక్కడితో  ఆగలేదు. పవన్ కల్యాణ్‌ను కూడా ఆయన కులం వారితో తిట్టిస్తున్నారట. తన గురించి చెప్పుకున్నారంటే  పోనీలే అనుకోవచ్చు. 

వారిద్దరిలా ఎవరూ మాట్లాడలేదు
పవన్ కల్యాణ్‌ను వైఎస్సార్‌సీపీ వారు ఎవరో విమర్శిస్తే, అది కూడా కులం కోణంలోనే చంద్రబాబు చూడడం, తన పార్టీకి చెందినవారు కాకపోయినా, ఆయనతో  ఇంకా పొత్తు లేకపోయినా, ఇప్పటినుంచే పవన్‌ను కాకా పడుతున్నట్లుగా మాట్లాడుతున్నట్లు కనిపించడం దేనికి సంకేతం. అసలు కులం గురించి, మతం గురించి ఈ మూడేళ్లలో చంద్రబాబు కాని, ఆయన దత్తపుత్రుడని వైఎస్సార్‌సీపీ విమర్శించే జనసేన అదినేత పవన్ కల్యాణ్‌ కాని  మాట్లాడినంతగా  మరొకరు  మాట్లాడలేదని చెప్పవచ్చు. 

పవన్ కల్యాణ్‌ ఒకసారి అచ్చంగా కులభావన ఉండాలని, మరోసారి వద్దని, ఇంకోసారి ఫలానా, ఫలానా కులాలవారు తనకు మద్దతు ఇవ్వాలని అంటుంటారు. మరి ఆయనకు చంద్రబాబు చెప్పు చూపిస్తారా? ఎస్సీలలో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా? అని అన్నందుకు, తాను కమ్మ కాబట్టే ప్రభుత్వం ఇలా చేస్తోంది.. అలా చేస్తోందని అన్నందుకు తనకు తాను చెప్పు చూపించుకుంటారో తెలియదు.  

రంగస్వామి  నాయుడును తప్పించి మరీ అక్కడ నుంచే పోటీ
నిజానికి చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితం ఆరంభం అయిందే కులం పునాదుల మీద. ఆయన  ఎస్వి యూనివర్శిటీ లో చదువుకునే రోజుల్లోనే కమ్మ కులం తరపున వకల్తా పుచ్చుకుని ఆ వర్గం నాయకుడుగా గుర్తింపు తెచ్చుకున్నారు. అదే కోటాలో ఆయన కాంగ్రెస్ ఐ తరపున  1978లో టికెట్‌ పొందారు. అప్పటి ప్రముఖ నేత రాజగోపాలనాయుడు  ఆశిస్సులతో ఆయన టిక్కెట్ పొందగలిగారు.

సిపిఐ నేత నారాయణ కూడా చంద్రబాబు యూనివర్శిటీలో కుల రాజకీయాలు చేశారని చెప్పారా? లేదా? ఆ తర్వాత చంద్రబాబు 1983లో చంద్రగిరి లో ఓడిపోయిన తర్వాత కుప్పం నియోజకవర్గానికి ఎందుకు మారారు? అప్పటికే అక్కడ ఉన్న కమ్మ వర్గానికి చెందిన రంగస్వామి  నాయుడును తప్పించి  తను ఎందుకు పోటీచేశారు? అంటే  అక్కడ బిసి వర్గాలవారికి ఎన్.టి.ఆర్.పై ఉన్న అభిమానాన్ని తాను క్యాష్ చేసుకోవడానికి కాదా? 

ఒక వేళ నిజంగానే చంద్రబాబుకు బిసి వర్గాలవారిపై అంత ప్రేమ ఉండి ఉన్నట్లయితే ఆ సీటును  ఆ వర్గాలవారికి వదలిపెట్టి, చంద్రగిరి కాకపోతే, తాను చదువుకున్న తిరుపతిలోనో, చిత్తూరు , శ్రీకాళహస్తి వంటి చోటో ఎందుకు పోటీ చేయలేదు? అప్పుడు చంద్రబాబు కులం కార్డుపై లేరులే అనుకునేవారు కదా? టిడిపి వ్యవస్థపాకుడు ఎన్.టి.ఆర్. కులాలకు అతీతంగా గుడివాడతో పాటు తిరుపతి, నల్గొండ, టెక్కలి, హిందుపూర్, కల్వకుర్తిలలో పోటీచేశారు. కల్వకుర్తిలో మాత్రం ఓడిపోయారు. 

ఎన్‌.టి.ఆర్‌లా బాబు ఎన్నడైనా చేశారా?
హిందుపూర్ నుంచే ఆయన మూడుసార్లు ఎన్నికయ్యారు. ఆయన మరణం తర్వాత ఆ గుడ్ విల్‌ను ఆయన కుమారులు హరికృష్ణ, ఇప్పుడు బాలకృష్ణ వాడుకోగలుగుతున్నారు. ఎన్.టి.ఆర్ ఏ కులం వారు ఎక్కడ ఉన్నారో చూసి పోటీచేయలేదు. ధైర్యంగా ఎక్కడైనా తనకు ఆదరణ లబిస్తుందని నమ్మి రాజకీయం చేశారు. మరి చంద్రబాబు అలా ఎన్నడైనా చేయగలిగారా? ఒకే చోట నుంచి పోటీచేయడం తప్పని అనడం లేదు. కాని కులం సుద్దులు చెబుతున్నారు కనుక ఇవన్ని ప్రస్తావించవలసి వస్తుంది.  

చంద్రబాబు తాను  ఎక్కడి నుంచైనా  పోటీచేయగలనని ఇంతకాలం ఎందుకు రుజువు చేసుకోలేదు? బహుశా ఇప్పుడు కుప్పంలో ఏర్పడిన గడ్డు పరిస్థితి నేపథ్యంలో ఆయన నియోజకవర్గం మారతారేమో చూడాలి. మరికొన్ని విషయాలు కూడా చెప్పుకోవాలి. వంగవీటి రంగా హత్య తర్వాత కమ్మ వర్గంవారిపై ఎందుకు దాడులు జరిగాయి ? చంద్రబాబుకు కులతత్వం లేకపోతే రంగా హత్యకు ఎందుకు కమ్మ వర్గం నేతలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న ఆరోపణకు గురయ్యారు? 

ఈ విషయాన్ని కాపు నేత, మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య స్వయంగా తన పుస్తకంలో రాసుకున్నారు కదా? హైదరాబాద్ , అనంతపురంలలో తాను చేసిన అభివృద్ది గురించి ప్రస్తావిస్తున్నారు. హైదరాబాద్ లో హైటెక్ సిటీ భవనం నిర్మించారు. నిజమే. కాని ఆ చుట్టు పక్కల భూములన్నీ ముందుగానే  ఎక్కువ మంది  కమ్మ వర్గానికి చెందినవారు ఎందుకు ఎక్కువ కొనుగోలు చేశారని ప్రశ్నిస్తున్నవారు ఇప్పటికీ ఉన్నారు. 

ప్రాన్స్  కు చెందిన ఒక  పరిశోధకురాలు తన  వ్యాసంలో ఈ విషయాన్ని ఎందుకు చెప్పారు? అనంతపురం జిల్లా పెనుగొండ వద్ద కియా ఫ్యాక్టరీ రావడానికి ముందు టిడిపి నేతలు, ముఖ్యంగా కమ్మ వర్గం నేతలే భూములు కొనుగోలు  చేశారని, ఆ దందా వల్లే పెనుగొండలో టిడిపి ఓడిపోయిందన్న విమర్శ  వాస్తవమా? కాదా ? అన్నది చంద్రబాబే చెప్పాలి. 

ఎదుటివారిపై విమర్శలు చేయడానికి ముందు తాను ఏమి చేసింఆది ఆలోచించుకోవాలి కదా? తన మంత్రివర్గంలో కమ్మ వర్గానికి విశేష ప్రాధాన్యం ఎందుకు ఇచ్చారు? తెలుగుదేశం పార్టీ కమ్మ వర్గానికి ఎక్కువ ప్రాతినిద్యం వహిస్తోందన్న విమర్శ ఎందుకు వస్తోంది? మరో అగ్రవర్ణానికి చెందిన వారు ఎవరూ టిడిపిలో ఎమ్మెల్యేలుగా ఎందుకు గెలవలేకపోయారు. తాను కమ్మ కులం కాబట్టే, అమరావతిలోని రైతులను ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని చెప్పింది చంద్రబాబు కాదా?  

అమరావతిలో ఇన్ సైడ్ ట్రేడింగ్ కింద భూములు కొనుగోలు చేసినవారిలో అధికులు కమ్మ వర్గం వారే ఎందుకు ఉన్నారు? కమ్మ వర్గానికి తానే నాయకుడి మాదిరి ప్రొజెక్టు అవడం వల్లే కదా ఆ పార్టీ ఇతర వర్గాలవారికి దూరం అయింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు రెడ్డి వర్గంతో పాటు ఎస్సి, ఎస్టి, బిసి, మైనార్టీ తదితర  వర్గాలు అత్యధిక సంఖ్యలో ఎందుకు సపోర్టు చేస్తున్నాయి? జగన్ కుటుంబంలో వివిధ కులాలకు చెందినవారు ఉన్న విషయం మర్చిపోకూడదు. 

జగన్ ను క్రిస్టియన్ అని ఎన్నిసార్లు మతపరంగా ప్రస్తావించి దూషించిన చంద్రబాబు ఇప్పుడు కులం, మతం అంటూ నీతులు  చెబుతున్నారు. కొన్ని ఆలయాలపై దుండగులు దాష్టీకాలకు పాల్పడితే జగన్ ప్రభుత్వంపై ఎన్ని మతపరమైన ఆరోపణలు చేశారు? రాష్ట్రంలో ఎక్కడైనా చిన్న గొడవ జరిగినా, ఇద్దరు వ్యక్తుల మధ్య తగాదాలతో హత్యలు జరిగినా, లేక రాజకీయ ఘర్షణలు జరిగినా, వారు ఏ కులం వారో తెలుసుకుని మరీ ప్రభుత్వంపై విమర్శలు ఎందుకు చేస్తున్నారు?

వారి మద్దతు మెరిట్‌ ప్రకారమా!
ఇక మరో  సంగతి చెప్పాలి. చంద్రబాబుకు  తన కులానికి చెందిన మీడియా సంస్థలే ఎందుకు అంత ప్రముఖంగా మద్దతు ఇస్తున్నాయి? రామోజీరావు, రాధాకృష్ణ, బిఆఆర్.నాయుడు వంటివారు  కులంతోకాకుండా మెరిట్ ప్రకారం చంద్రబాబుకు మద్దతు ఇస్తున్నారా? తనను చూసే మంత్రివర్గంలో కమ్మవారికి చోటు ఇవ్వలేదన్నది కుల విమర్శా?కాదా? ఇలా కడుపు చించుకుంటే కాళ్లమీద పడుతుందన్న చందంగా చంద్రబాబు అనవసర విషయాలు పదే,పదే ప్రస్తావిస్తున్నారు. 

మరో సారి హిందూపూర్ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో గురించి మాట్లాడుతూ బట్టలిప్పితే కేంద్ర మంత్రి పదవి ఇస్తారా అని అంటున్నారు. అది ఫేక్ వీడియో అని పోలీసులు చెప్పిన తర్వాత కూడా చంద్రబాబు ఈ విషయం పదే, పదే మాట్లాడడం సరైనదేనా? ఓటు కు నోటు కేసులో చంద్రబాబు ఆడియో ఒరిజినల్ కాదని ఏ పోలీసు వ్యవస్థ అయినా నిర్దారించిందా? కనీసం తాను అయినా అది తన వీడియో కాదని చెప్పగలిగారా? తన పోన్ టాప్ చేస్తారా అని అన్నారే తప్ప తాను టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టే యత్నం చేయలేదని చెప్పలేకపోయారే. 

మరి తన బావమరిది నందమూరి బాలకృష్ణ  ఏకంగా ఆడపిల్ల కనిపిస్తే ముద్దు అయినా పెట్టాలి.. లేదా  ---అయినా చేయాలని  ప్రజలకు సలహా ఇచ్చారు కదా? అలాంటి వ్యక్తికి టికెట్‌ ఇచ్చి  హిందుపూర్ ఎమ్మెల్యేగా  చేశారు కదా. తన కుమారుడు లోకేష్ అరడజను మంది విదేశీ  యువతులతో చిందులు వేసిన పోటోలు సభ్య సమాజం ఆమోదించిందని ఆయనకు మంత్రి పదవి ఇచ్చారా? ఇలా చెప్పుకుంటూ పోతే అనేక ఉదాహరణలు ఉన్నాయి. 

ఏ రాజకీయ పార్టీ అయినా బాధ్యతగా ఉండాలి. ఏ నేత అయినా జవాబుదారిగా ఉండాలి. అందులోను సుదీర్ఘకాలం రాజకీయాలలో ముఖ్యమైన పదవులలో ఉన్న చంద్రబాబు వంటివారు హద్దులు మీరి మాట్లాడితే పోయేది వారి పరువే. జగన్ ప్రభుత్వంపై విధాన పరమైన విమర్శలు చేయలేక ఇలాంటి దిక్కుమాలిన విషయాలపై చంద్రబాబు ఆధారపడే దీన పరిస్థితి ఏర్పడిందని ప్రజలు అనుకుంటే అందులో తప్పు ఏమి ఉంటుంది?


-కొమ్మినేని శ్రీనివాసరావు
సీనియర్‌ పాత్రికేయులు   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement