ఆమె బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు కాకపోతే పొత్తే ఉండేది కాదేమో!
దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం
త్వరలో నామినేటెడ్ పోస్టుల భర్తీ
వంద రోజుల పాలనపై ఈ నెల 20 నుంచి ఆరు రోజులు ప్రచారం
ఎన్డీయే శాసన సభాపక్ష సమావేశంలో చంద్రబాబు
సాక్షి, అమరావతి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా పురందేశ్వరి ఉండబట్టే ఆ పార్టీతో పొత్తు సాధ్యమైందని సీఎం చంద్రబాబు చెప్పారు. ఆమె స్థానంలో వేరే వారు ఉంటే ఏమయ్యేదో తెలియదని అన్నారు. కూటమిలోని మూడు పార్టీల స్వభావాలు వేరైనా, ఆలోచన ఒకటేనని అన్నారు. మూడు పార్టీల కలయిక శాశ్వతంగా ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. బుధవారం మంగళగిరిలో జరిగిన ఎన్డీఏ శాసన సభాపక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ప్రారంభిస్తామని, వీలైతే ఆరోజే సిలిండర్లు ఇస్తామని చెప్పారు.
వరద సాయం కోసం సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.350 కోట్లు వచ్చాయని తెలిపారు. వరద సాయం కోసం ఎమ్మెల్యేలంతా ఒక నెల జీతాన్ని విరాళంగా ఇద్దామని అన్నారు. వరద బాధితులకు బెస్ట్ ప్యాకేజీ ప్రకటించామన్నారు. ఎమ్మెల్యేలు తప్పులు చేయకూడదని, కక్ష సాధింపులకు దిగవద్దని తెలిపారు. ఉపాధి హామీ నిధులతో పెద్దఎత్తున అభివృద్ధి చేయవచ్చని, ఆ నిధులు పవన్ కళ్యాణ్ వద్దే ఉన్నాయని అన్నారు. ప్రభుత్వంలో పవన్ దగ్గరే ఎక్కువ నిధులున్నాయని చెప్పారు.
అన్నమయ్య డ్యాం కొట్టుకుపోతే అప్పటి ముఖ్యమంత్రి అటు వైపే వెళ్లలేదని, పులిచింతల గేట్లు కొట్టుకుపోతే బిగించడానికి రెండు సీజన్లు పట్టిందని అన్నారు. కానీ కర్ణాటకలో తుంగభద్ర గేట్లు కొట్టుకుపోతే తాము వెళ్లి కన్నయ్యనాయుడు నేతృత్వంలో గేట్లు బిగించామని తెలిపారు. విశాఖ స్టీల్‌ప్లాంటుపై గత ఐదేళ్లలో నోరు మెదపని వైఎస్సార్‌సీపీ ఇప్పుడు గొడవ చేస్తోందని అన్నారు.
స్టీల్ ప్లాంటును ప్రైవేటుకు అప్పగించకుండా ప్రభుత్వమే నడిపేలా చర్యలు తీసుకుంటామన్నారు. త్వరలో నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తామన్నారు. వంద రోజుల పాలనపై ఈ నెల 20 నుంచి ఆరు రోజులు ప్రచారం చేయాలని సూచించారు. త్వరలో జరిగే రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం కోసం పని చేయాలని చెప్పారు.
అప్పటి నా ప్రకటనకు
వ్యూహమే లేదు : పవన్ కళ్యాణ్
వైఎస్సార్‌సీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వననే తన ప్రకటన వెనుక రాష్ట్రం బాగుండాలనే కోరిక తప్ప వ్యూహమేమీ లేదని జనసేన పార్టీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు. ఎన్డీఏ శాసన సభాపక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబును 53 రోజులు జైల్లో పెట్టినప్పుడు తాను షూటింగ్‌లకు కూడా వెళ్లలేదని అన్నారు. చంద్రబాబును చూసి తాను చాలా నేర్చుకున్నానని, ఆయనకు ఎప్పుడూ చేదోడు వాదోడుగా ఉండాలని
కోరుకుంటున్నానని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment