
జైపూర్/ఢిల్లీ: ఎమ్మెల్యేలతో కలిసి రాజ్‌భవన్‌లో నిరసనకు దిగిన ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ నేటికి ఆ కార్యక్రమాన్ని విరమించారు. తనకు మద్దతిస్తున్న 102 మంది ఎమ్మెల్యేల లిస్టును గవర్నర్‌కు సమర్పించిన అనంతరం ఆయన రాత్రి 7.40 గంటల ప్రాంతంలో అక్కడ నుంచి వెనుదిరిగారు. అంతకుముందు రాజ్‌భవన్ వేదికగా కొంత హైడ్రామా నడిచిన సంగతి తెలిసిందే. గవర్నర్ కల్‌రాజ్ మిశ్రా వైఖరికి నిరసనగా సీఎం గహ్లోత్ ఎమ్మెల్యేలతో కలిసి రాజ్‌భవన్‌లో బైఠాయించారు. బలం నిరూపించుకునేందుకు అసెంబ్లీని సమావేశ పరచాలని డిమాండ్ చేశారు. అనర్హత ఎమ్మెల్యేల పంచాయితీ సుప్రీం కోర్టులో ఉండటంతో ఇప్పుడే నిర్ణయం తీసుకోలేనని గవర్నర్ చెప్పడంపై సీఎం అభ్యంతరం తెలిపారు. కేంద్రంలో ఉన్న బీజేపీ పెద్దల ఒత్తిళ్లతో గవర్నర్ నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు.
(చదవండి: ఎవరి బలమెంతో అక్కడే తేలుతుంది: గెహ్లోత్)
స్పందన లేకపోవడంతోనే..
అసెంబ్లీని సమావేశ పరచాలని నిన్ననే గవర్నర్‌ను రాతపూర్వకంగా కోరామని సీఎం గహ్లోత్ తెలిపారు. అయినా, ఎటువంటి స్పందన రాలేదని, అందుకనే రాజ్‌భవన్‌కు వచ్చామని వెల్లడించారు. గవర్నర్ రాజ్యాంగ బద్ధంగా వ్యవహరించాలని కోరారు. అదే విధంగా కొంతమంది రెబల్ ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి వచ్చే అవకాశం ఉందని గహ్లోత్ అభిప్రాయపడ్డారు. మరోవైపు ఫలానా టైమ్‌కు అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేయాలని సీఎం గహ్లోత్ ఎక్కడా చెప్పలేదని, అసలు బల పరీక్షపై ఆయన స్పష్టమైన విజ్ఞప్తి చేయలేదని గవర్నర్ కార్యాలయ వర్గాలు చెప్తుండటం గమనార్హం.
హామీతోనే వెనుదిరిగాం
గవర్నర్ హామీతోనే నిరసన విరమించామని రాజస్తాన్ ఆరోగ్యశాఖ మంత్రి రఘు శర్మ చెప్పారు. రాజ్యంగానికి కట్టుబడి పనిచేస్తానని గవర్నర్ చెప్పినట్టు తెలిపారు. విశ్వాస పరీక్షకు కోవిడ్ నిబంధనలే అడ్డండి అయితే, తామంతా వైరస్ నిర్ధారణ పరీక్షలకు సిద్ధమని అన్నారు. ఇక సీఎం గహ్లోత్ వినతిపై నో చెప్పలేదని, ఇప్పుడే నిర్ణయం తీసుకోలేనని మాత్రమే చెప్పానని గవర్నర్ స్పష్టం చేశారు.. ఏదేమైనా నిబంధనల ప్రకారం నడుచుకుంటాని తెలిపారు.
ఇదిలాఉండగా.. గహ్లోత్ ప్రభుత్వంపై తిరుగుబాటు జెండా ఎగరేసిన సచిన్ పైలట్ సహా 19 మంది ఎమ్మెల్యేలు సీఎల్పీ భేటీకి హాజరుకాని సంగతి తెలిసిందే. దీంతో శాసనసభ స్పీకర్ అనర్హత నోటీసులు జారీ చేయడం.. అసమ్మతి ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించడం చకచకా జరిగిపోయాయి. వారి పిటిషిన్‌పై విచారించిన రాష్ట్ర హైకోర్టు.. తిరుగుబాటు ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని స్పీకర్‌ను శుక్రవారం మరోసారి ఆదేశించింది. సంయమనం పాటించాలని పేర్కొంటూ యథాతథ స్థితిని (స్టేటస్ కో) కొనసాగించాలని ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సచిన్ పైలట్ వర్గానికి ఊరట లభించింది.
(రాజస్తాన్ సంక్షోభం : పైలట్ వర్గానికి ఊరట)
Comments
Please login to add a commentAdd a comment