సాక్షి, పార్వతీపురం మన్యం: ప్రజలకు ఇంత మంచి చేస్తుంటే.. చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారని, అబద్ధాలు.. మోసాలతో మళ్లీ ప్రజలను మభ్యపెట్టేందుకు వస్తున్నాడని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. జగనన్న అమ్మ ఒడి పథకం నిధుల విడుదల కార్యక్రమంలో గభాంగా.. కురుపాం బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ.. చంద్రబాబుతో పాటు జనసేనాని పవన్ కల్యాణ్‌పైనా మండిపడ్డారు.
తన 45 ఏళ్ల రాజకీయంలో చంద్రబాబు ఏనాడూ మంచి గురించి ఆలోచించలేదు. టీడీపీని టీ అంటే తినుకో.. డీ అంటే దండుకో.. పీ అంటే పంచుకోగా మార్చేశారు. దోచుకున్న సొమ్ముతో వాళ్లు బొజ్జలు పెంచుకున్నారని ఎద్దేశా చేశారాయన. 14 ఏళ్లు సీఎంగా ఉండి కూడా ఏ మంచీ చేయని ఈ బాబు.. 3 సార్లు ముఖ్యమంత్రి అయినా కూడా ఏ ప్రాంతానికీ ఏ మంచీ చేయని ఈబాబు.. ఏ సామాజిక వర్గానికీ కూడా ఏ మంచీ చేయని బాబు. ఎన్నికల ముందు మేనిఫెస్టో బుక్కు తెస్తారు. అధికారంలోకి వస్తే.. మేనిఫెస్టోను చెత్త బుట్టలో పడేస్తారు. ఇదీ వాళ్ల ట్రాక్ రికార్డు. మరోసారి ఇదే దుష్ట చతుష్టయం.. ఇదే బాబు.. మరోసారి అధికారం ఇవ్వండంటూ మరోసారి మేనిఫెస్టోతో మళ్లీ మోసానికి దిగారు.డ్రామాలు ఆడటం మొదలు పెట్టారు. ఈసారి డ్రామాలకు కొంచం రక్తి కట్టించారు. ప్రతి ఇంటికీ కేజీ బంగారం, బెంజ్ కారంట.. మోసం చేసేదానికి ఒక హద్దులు పద్దులు పోయి.. జగన్ ఏం చేస్తున్నాడు.. జగన్ కంటే కాస్త ఎక్కువ చెప్పాలని మోసం చేయడంలో రక్తి కట్టిస్తున్నాడు. వీళ్లందరికీ తోడు ఒక దత్త పుత్రుడు ఉన్నాడు.
ఈ దత్త పుత్రుడు.. 2014లో కూడా ఇదే దత్తపుత్రుడు, ఇదే చంద్రబాబుకు మద్దతు పలికాడు. మీ ఇంటికి లేఖలొచ్చాయి. ఒకవైపు చంద్రబాబు, మరోవైపు దత్తపుత్రుడి సంతకంతో లేఖలు వచ్చాయి. మాదీ బాధ్యత అని.. ఎన్నికలు అయిపోయాయి, ఎన్నికల ప్రణాళిక చెత్త బుట్టలో వేశారు.
మన రాష్ట్రంలో మంచిచేయొద్దని చెప్పే నాలుగు కోతులు ఉన్నాయి. మంచి అనోద్దు.. మంచి వినోద్దు..మంచి చేయొద్దు అన్నదే వారి విధానం. నమ్మించి ప్రజలను నట్టేటా ముంచడమే వాళ్లకు తెలిసిన నీతి. రాష్ట్రంలో మంచి జరుగుతుంటే భరించలేకపోతున్నారు. వాళ్లకు కడుపులో మంట, ఈర్ష్యతో వాళ్లకు కళ్లు మూసుకుపోయాయి.
దత్తపుత్రుడు 2014లోనూ చంద్రబాబుకు మద్దతు ఇచ్చాడు. మరి ఆ తర్వాత చంద్రబాబు చేసిన మోసాన్ని ఎందుకు నిలదీయలేదు. ఆ దత్తపుత్రుడు.. మామూలుగా మాట్లాడడు. ఆ ప్యాకేజీ స్టార్ వారాహి అనే ఓ లారీ ఎక్కి ఊగిపోతూ తనకు నచ్చనివారిని.. చెప్పుతో కొడతానంటాడు. తాట తీస్తానంటాడు. ఇష్టానుసారం మాట్లాడుతున్నాడు. ఆ మనిషి నోటికి అదుపు లేదు.. నిలకడా లేదు. వారిలా నలుగురు నలుగురిని పెళ్లి చేసుకొని నాలుగేళ్లకోసారి భార్యనూ మార్చలేం. పెళ్లి అనే పవిత్ర వ్యవస్థను రోడ్డు మీదకు తీసుకొని రాలేం. దత్తపుత్రుడిలా తొడలు కొట్టలేం.. పూనకం వచ్చినట్లు ఊగిపోతూ బూతులు తిట్టలేం. అవన్నీ వారికి చెందిన పేటెంట్.
దుష్టచతుష్టయం సమాజాన్ని చీల్చుతోంది. కానీ, మన పునాదులు సామాజిక న్యాయంలో ఉన్నాయి. అందుకే పనికి మాలిని పంచ్ డైలాగులు ఉండవ్. బలమైన, పటిష్టమైన పునాదుల మీద నిలబడ్డాం. పౌర సేవలు, సంక్షేమ పథకాల అమలులో మన పునాదులు ఉన్నాయి. పేదల కష్టాల నుంచి మన పునాదులు పుట్టాయి. మన పునాదులు ఓదార్పు యాత్ర నుంచి పుట్టాయి. వాళ్ల మాదిరిగా వెన్నుపోటు, అబద్ధాలపై మన పునాదులు పుట్టలేదు. రాష్ట్రంలో రాక్షసులతో మనం యుద్ధం చేస్తున్నాం. యుద్ధంలో వారి మాదిరిగా మనకు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 లేవు. వారి మాదిరిగా మనకు దత్తపుత్రుడు లేడు. అబద్ధాలను పదే పదే చెప్పి భ్రమ కలిగించే మీడియా మనకు లేదు.
మీ బిడ్డ ప్రభుత్వంలో 5 మంది డెప్యూటీ సీఎంలలో నలుగురు నా ఎస్సీ, నా బీసీ, నా మైనార్టీలే. రాష్ట్రానికి హోం మంత్రి నా దళిత చెల్లెమ్మ. అలాంటి మనందరి ప్రభుత్వం మీద కావాలని పనిగట్టుకొని సమాజాన్ని చీల్చడం కోసం వాళ్లు పడుతున్న పాట్లు చూడాలి. పేదల కోసం తీసుకొస్తున్న విద్యా విప్లవంలో మన పునాదులున్నాయి. పేదల జీవితాలు మార్చేలా వాళ్ల కోసం చేస్తున్న ఇళ్ల స్థలాల్లో ఉన్నాయి. వారి కోసం కట్టిస్తున్న ఇళ్లలో మన పునాదులున్నాయి. గ్రామాల్లో ఎలాంటి లంచాలు, వివక్ష లేకుండా అక్కచెల్లెమ్మలు, రైతన్నలు, అవ్వాతాతలు, పిల్లలకు మంచి జరిగేలా అందిస్తున్న పౌర సేవల్లో నా పునాదులున్నాయి. అక్కచెల్లెమ్మల సాధికారత కోసం అమలు చేస్తున్న పథకాల్లో మన పునాదులున్నాయి. పనికిమాలిన పంచ్ డైలాగుల్లో లేవు వాళ్ల మాదిరిగా.
మన పునాదులు మన ఓదార్పు యాత్ర నుంచి, 3,648 కిలోమీటర్లు సాగిన పాదయాత్రలో, పేదల కష్టాల్లోంచి నా పునాదులు పుట్టాయి. వారి మాదిరిగా వెన్నుపోటులోంచి నా పునాదులు పుట్టలేదు. అబద్ధాలపైన మన పునాదులు లేవు. దోచుకో, పంచుకో,తినుకో అనే సిద్దాంతం నుంచి పుట్టలేదు. పేద వాడి కోసం నిలబడగలిగాం కాబట్టే 2009 నుంచి ఇప్పటి వరకు ఒకసారి జగన్ అనే మీ అన్నను ఒక్కసారి గమనిస్తే.. ఎక్కడా కూడా ఏ కార్యకర్తా కూడా జగన్ ను చూసినప్పుడు జగన్ నడిచే నడక చూసినప్పుడు అడుగో అతడే మా నాయకుడని కాలర్ ఎగరేసేలా నడత, ప్రవర్తన ఉంది. ఏ రోజూ అధర్మాన్ని, అబద్దాలు చెప్పి గెలవాలని ప్రయత్నం చేయలేదు. అధికారం కోసం, పొత్తుల కోసం పాకులాడలేదు. ప్రతి అడుగులోనూ పేద వాడు బాగుండాలని ఆలోచన చేశా. ఇదీ మన పునాది. ఇదీ మన ఫిలాసఫీ, ఇదీ మన పార్టీ. ఇదీ మన మనసున్న ప్రభుత్వమని తెలియజేస్తున్నా.
మీ బిడ్డ పొత్తుల కోసం ఏరోజూ పాకులాడలేదు. రాష్ట్రంలో రాక్షసులతో యుద్ధం చేస్తున్నాం. మీ బిడ్డ తోడేళ్లను నమ్ముకోలేదు.. దత్తపుత్రుడిని నమ్ముకోలేదు. జరగబోయే కురుక్షేత్రంలో మీ బిడ్డకు మీరే అండ. మీ బిడ్డకు అండగా ఉన్నది ఆ భగవంతుడు.. ప్రజలు మాత్రమే. మీకు మంచి చేశాను అనిపిస్తేనే ఈ యుద్ధంలో మీరే నాకు అండగా నిలవాలి అని కోరారాయన. దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలతో 10 రోజుల పాటు పండుగ వాతావరణంలో జరగబోతున్న వేడుకలో ప్రజా ప్రతినిధులంతా పాల్గొనాలని ఆదేశిస్తున్నా. ఇంకా మీకు మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నా అని తన ప్రసంగం ముగించారు సీఎం జగన్.
Comments
Please login to add a commentAdd a comment