
సాక్షి, హైదరాబాద్ : పట్ట భద్రుల ఎమ్మెల్సీ, దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ విజయం సాధించడం ఖాయమని ముఖ్యమంత్రి కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. నిరుద్యోగులతో పాటు అన్ని వర్గాల ప్రజలు టీఆర్ఎస్‌కు అనుకూలంగా ఉన్నాయని చెప్పారు. శనివారం ఆయన పట్టభద్రుల ఎమ్మెల్సీ, కార్పొరేషన్ ఎన్నికలపై ప్రగతి భవన్‌లో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ పలు సూచనలు చేశారు. సర్వేలన్నీ టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఉన్నాయన్నారు.
పట్టణాల్లోనూ పట్టభద్రులకు ఓటరు నమోదుపై అవగాహన కల్పించాలని, వారిలో చైతన్యం తేవాలని సీఎం సూచించారు. కొత్త రెవెన్యూ చట్టం, ఎల్‌ఆర్‌ఎస్‌పై ప్రజలు సంతృప్తికరంగా ఉన్నారని, వారికి సందేహాలుంటే నివృత్తి చేయాలన్నారు. రెవెన్యూ చట్టంపై అవసరమైతే రెండు రోజుల పాటు అసెంబ్లీ నిర్వహిస్తామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.