
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక ముగిసింది. కాగా, ఎన్నికల అనంతరం తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మరోసారి బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ ప్రగతిభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. దేశంలో ప్రజాస్వామ్యం హత్య జరుగుతోంది. నేను చాలా బాధతో మాట్లాడుతున్నాను. ఇంత దుర్మార్గం ఉంటుందా అని నమ్మలేని పరిస్థితి నాది. నిరుద్యోగం పెరిగిపోయింది. రూపాయి విలువ పడిపోయింది. బీజేపీ దేశాన్ని అన్ని రంగాల్లో సర్వ నాశనం చేసింది.
మునుగోడు ఉప ఎన్నిక ఉందనే ఇన్ని రోజులు ఓపిక పట్టి మాట్లాడలేదు. మునుగోడు ఎన్నిక ప్రచారంలో ఎన్నో అబద్ధాలు మాట్లాడారు. ఈసీ కూడా వారికి అనుకూలంగా పనిచేయాలా?. ఈసీపై దిగజారుడు ఆరోపణలు చేశారు. ఈసీపై కూడా చిల్లర ఆరోపణలు చేశారు. మీకు నచ్చినట్టు ఈసీ చేసే.. బాగా పనిచేసినట్టా?. ఏ వ్యవస్థనూ బీజేపీ లెక్కచేయడం లేదు.
కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి నన్ను కలిసినట్టు తప్పుడు ప్రచారం చేశారు. ఇది అంతర్జాతీయ సంస్థలు చెబుతున్న మాట. ఇలాంటి దుర్మార్గమైన పనులు సరికాదు. ఇంతలా దిగజారి ప్రవర్తించడం సరికాదు. ఫేక్ వార్తలలో భ్రష్టు పట్టించే ప్రయత్నం చేశారు. ఎన్నికలైన తర్వాత ఎవరైనా ప్రజా తీర్పును గౌరవించాల్సిందే. ప్రజా జీవనంలో ఉన్న వ్యక్తులకు సంయమనం ఉండాలి.
ఎమ్మెల్యేల కొనుగోలుపై గంట వీడియో ఉంది. దేశంలో అన్ని న్యూస్, ఏజెన్సీలకు, సీఎంలకూ వీడియోలు పంపిస్తున్నాము. మీ పార్టీ ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారంటూ దేశ ప్రధాని చెబుతారు. ఏక్‌నాథ్ షిండేలను సృష్టిస్తారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటివి వాంఛనీయామా?. సుప్రీంకోర్టు సహా దేశంలో న్యాయమూర్తులను చేతులు జోడించి కోరుతున్నా.. ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. దేశంలోని న్యాయమూర్తులందరికీ వీడియో పంపిస్తాను. కేంద్ర దర్యాప్తు సంస్థలన్నింటికీ కూడా వీడియో పంపిస్తాను. ఇలాంటివి సహించాలా?. దీని వెనుక ఉన్నది ఎవరు?.ఇప్పుడు చూపించే వీడియోలు చూసి నివ్వెరపోతారు. రోహిత్‌రెడ్డిని కలిసి ప్రలోభాలకు గురిచేసేందుకు యత్నించారు. దీనిపై రోహిత్‌రెడ్డి మాకు ఫిర్యాదు చేశారు. రోహిత్‌రెడ్డిని ఎలా ప్రలోభాలకు గురిచేశారో మీకే చూస్తారు.
Comments
Please login to add a commentAdd a comment