కేసీఆర్ వరాల జల్లు.. గిరిజనులపై పెట్టిన పోడు కేసుల మాఫీ | CM KCR showers sops for Asifabad | Sakshi
Sakshi News home page

కేసీఆర్ వరాల జల్లు.. గిరిజనులపై పెట్టిన పోడు కేసుల మాఫీ

Published Sat, Jul 1 2023 1:58 AM | Last Updated on Sat, Jul 1 2023 9:33 AM

CM KCR showers sops for Asifabad - Sakshi

సాక్షి, ఆసిఫాబాద్‌: రాష్ట్రంలో పోడుసాగు విషయంలో గిరిజనులపై పెట్టిన కేసులన్నింటినీ ఎత్తివేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. గతంలో అడవులను ఆక్రమించారని కొందరు గిరిజనులపై కేసులు నమోదయ్యాయని, వాటిని ఎత్తేయాలని నిర్ణయించామని చెప్పారు. ఇందుకోసం అనుసరించాల్సిన ప్రక్రియను చేపట్టాలని సీఎస్, డీజీపీలను ఆదేశించామని వెల్లడించారు. రాష్ట్రంలో 1.51 లక్షల మంది గిరిజనులు, ఆదివాసీలకు 4.06 లక్షల ఎకరాలకుపైగా పట్టాలను పంపిణీ చేస్తున్నామని చెప్పారు.

గిరిజనేతరుల సాగులో ఉన్న పోడు భూములకు పట్టాలివ్వడంలో కొంత సమస్య ఉందని, 75 ఏళ్లుగా వారు ఒకేచోట నివాసం ఉంటున్నట్టు రుజువు చేయాల్సి ఉంటుందని, ఇందుకోసం ఓ ప్రక్రియను తీసుకొచ్చి సమస్యను పరిష్కరించి, ఆలస్యంగానైనా వారికి కూడా పట్టాలు అందజేస్తామన్నారు. కుమురంభీం జిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం ఆసిఫాబాద్‌కు వచ్చిన సీఎం కేసీఆర్‌.. పట్టణంలో ఏర్పాటు చేసిన కుమురంభీం, మాజీ మంత్రి కోటా్నక భీంరావు విగ్రహాలను.. తర్వాత బీఆర్‌ఎస్‌ కార్యాలయం, ఎస్పీ కార్యాలయం, సమీకృత కలెక్టరేట్‌ సముదాయాలను ప్రారంభించారు.

అనంతరం ప్రగతి నివేదన సభలో ఆసిఫాబాద్, సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ నియోజకవర్గాల గిరిజనులకు పోడు పట్టాలు, రూ.23.56 కోట్ల మేర పోడు భూముల రైతుబంధు చెక్కులను మహిళల పేరిట అందజేశారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ ప్రసంగం ఆయన మాటల్లోనే.. ‘‘తెలంగాణ ఉద్యమ సమయంలో ఈ అటవీ ప్రాంతాల్లో తిరుగుతున్నప్పుడు ‘మా గూడెంలో మా రాజ్యం.. మా తండాల్లో మా రాజ్యం’అని చెప్పేవారు. అనేక దశాబ్దాలు పోరాటం చేసినా సాధ్యం కాలేదు. కానీ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో 3 నుంచి 4 వేల గిరిజన గూడేలు, తండాలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేశాం.

పోరాట యోధుడు కుమురంభీం పేరిట ఆసిఫాబాద్‌ జిల్లాను ఏర్పాటు చేసుకున్నాం. ఒకప్పుడు బెజ్జూర్‌ నుంచి ఆదిలాబాద్‌ వెళ్లాలంటే చాలా బాధపడేవాళ్లం. ఇప్పుడా పరిస్థితి లేదు. మీ ముంగిటకే కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలు వచ్చేశాయి. పోడు పట్టాల పంపిణీ ప్రక్రియకు ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టాం. ఒకప్పుడు వర్షాకాలం వచ్చిందంటే గిరిజనులు వ్యాధులతో సతమతం అయ్యేవారు. ‘మంచం పట్టిన మన్యం’అంటూ వార్తలు వచ్చేవి. ఇప్పుడా దుస్థితి లేదు. మిషన్‌ భగీరథ నీళ్లు వచ్చాయి. వైద్య వ్యవస్థను బాగు చేసుకున్నాం. ఇప్పుడు మారుమూల ఆసిఫాబాద్‌కు కూడా వైద్యకళాశాలను సాధించుకున్నాం. 

                            

ఆసిఫాబాద్‌ జిల్లాకు వరాలు.. 
వార్ధా నదిపై వంతెన కావాలని స్థానిక ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అడిగారు. ఆ బ్యారేజీ కోసం రూ.75 కోట్లు ఇప్పుడే మంజూరు చేస్తున్నా. అలాగే టెక్నికల్‌ కాలేజీ కావాలన్నారు. ఐటీఐని మంజూరు చేస్తున్నా. బుద్ధుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసి మినీ ట్యాంక్‌బండ్‌గా నాగమ్మ చెరువును అభివృద్ధి చేస్తాం. ఆసిఫాబాద్‌ మున్సిపాలిటీకి త్వరలోనే నోటిఫికేషన్‌ విడుదల చేస్తాం. ఆసిఫాబాద్, కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీలకు రూ.25 కోట్లు చొప్పున, జిల్లాలోని 335 గ్రామ పంచాయతీలకు రూ.10 లక్షల చొప్పున సీఎం ప్రత్యేక నిధి నుంచి మంజూరు చేస్తున్నాం. మంచిర్యాల జిల్లాలోని 7 మున్సిపాలిటీలు, 311 గ్రామ పంచాయతీలకు కూడా నిధులు మంజూరు చేస్తున్నా. 
ధరణి తీసేస్తే దోపిడీయే.. 
ఇవాళ గుంట నక్కలు అవాకులు చవాకులు పేలుతున్నాయి. రైతుల కోసమే ధరణి తెచ్చాం. కానీ అధికారంలోకి వస్తే ధరణి తీసేస్తామని కాంగ్రెస్‌ చెబుతోంది. ధరణి తీసేస్తే మళ్లీ పైరవీకారుల, దోపిడీదారుల రాజ్యం వస్తుంది. 

పోడు భూములకు ఉచితంగా కరెంటు, బోర్లు 
రాష్ట్రంలో 1.51 లక్షల మంది గిరిజనులు, ఆదివాసీలకు 4.06 లక్షల ఎకరాలకుపైగా పోడు పట్టాలను పంపిణీ చేస్తున్నాం. ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే ఆత్రం సక్కు కోరినట్లుగా ఆదివాసీ, గిరిజన బిడ్డల పొలాలకు ఉచితంగా త్రీఫేజ్‌ కరెంట్‌ను రెండు మూడు నెలల్లో ఇప్పిస్తాం. పట్టాలు పొందిన రైతులకు గిరివికాస్‌ కింద ఉచితంగా బోర్లు వేయిస్తాం..’’అని సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారు.

తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలు కావాలని పొరుగున ఉన్న మహారాష్ట్ర రైతులు కోరుతున్నారని.. లేదంటే తెలంగాణలో కలిపేయాలని అక్కడి గ్రామాల సర్పంచులు డిమాండ్‌ చేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్‌ అలీ, ప్రశాంత్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్, ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, ఎమ్మెల్యే ఆత్రం సక్కు, జెడ్పీ చైర్‌పర్సన్‌ కోవ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కాగా.. కేసీఆర్‌ ఆసిఫాబాద్‌లో కార్యక్రమం అనంతరం సాయంత్రం 5.15 గంటలకు రోడ్డు మార్గంలో బయలుదేరారు. మధ్యలో పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో గోదావరి వంతెన వద్ద ఆగారు. గోదారమ్మకు నమస్కరించి, నదిలో నాణేలు వేసి తిరిగి బయలుదేరి ఎర్రవల్లికి చేరుకున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement