హామీల అమల్లో సీఎం రేవంత్ విఫలం
లోక్‌సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ కొత్త గ్యారంటీల నాటకం
కాంగ్రెస్ గ్యారంటీలతో రైతులకు అన్యాయం
కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి మండిపాటు
నేడు బీజేపీ రైతు దీక్షకు హాజరు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన గ్యారంటీల అమలు జాడలేకుండా పోయిందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. ఆరు గ్యారంటీల పేరిట 16 రకాల హామీల ను అమలు చేస్తామని గద్దెనెక్కి.. ఇప్పుడు పార్లమెంటు ఎన్నికల కోసం కొత్త గ్యారంటీల నాటకాన్ని ఆడు తోందని దుయ్యబట్టారు. ఆదివారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి బీజేపీ సంకల్పపత్రాన్ని విడుదల చేసిందని వివరించారు.
రానున్న ఐదేళ్లలో పేదలు, మహిళలు, యువకులు, రైతుల అభ్యున్నతిపై బీజేపీ దృష్టి సారించిందన్నారు. మరో ఐదేళ్ల పాటు ప్రజలకు ఉచిత రేషన్ బియ్యాన్ని అందిస్తామని, తెల్లరేషన్ కార్డు లేని మధ్య తరగతికి చెందిన సీనియర్ సిటిజన్లకు ఆయుష్మాన్ భారత్ కింద వైద్యం అందిస్తామని వెల్లడించారు. రాబోయే ఐదేళ్లలో 3 కోట్ల ఇళ్లను పేదలకు నిర్మించి ఇస్తామని, మహిళలకు 33% రిజర్వేషన్ అందించాలని చట్టం చేశామని చెప్పారు.
జనగణన పూర్తయ్యాక దీన్ని అమలుచేస్తామన్నారు. వన్ నేషన్.. వన్ రేషన్ మాదిరిగా వన్ నేషన్.. వన్ ఎలక్షన్ అవసరమన్నారు. బీజేపీ సంకల్ప పత్రంపై మాట్లాడే దమ్ము రాహుల్ గాంధీకి, రేవంత్‌కు లేదన్నారు. ఆరు గ్యారంటీల అమలుపై స్పష్టమైన ప్రకటన చేసిన తర్వాతే ఇతర అంశాపై విమర్శించాలన్నారు.
నేడు కిషన్‌రెడ్డి రైతు దీక్ష: కాంగ్రెస్ గ్యారంటీలతో రైతులు అన్యాయానికి గురయ్యారని, వారికి న్యాయం చేసేందుకు బీజేపీ కార్యాలయంలో సోమవారం రైతు దీక్ష చేపడతామని తెలిపారు. మోదీ ప్రధాని అయ్యాక, అంతకుముందు అన్ని రంగాల్లో దేశం పరిస్థితి ఎలా ఉందనే అంశంపై రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే తదితరులు ఎవరితోనైనా తాను చర్చకు సిద్ధంగా ఉన్నానన్నారు.
Comments
Please login to add a commentAdd a comment