పేదల తలరాతలు మార్చే ఎన్నికలివి : సీఎం వైఎస్‌ జగన్‌ | CM YS Jagan in mukhamukhi with people in Erraguntla | Sakshi
Sakshi News home page

పేదల తలరాతలు మార్చే ఎన్నికలివి : సీఎం వైఎస్‌ జగన్‌

Published Fri, Mar 29 2024 5:03 AM | Last Updated on Fri, Mar 29 2024 6:49 AM

CM YS Jagan in mukhamukhi with people in Erraguntla - Sakshi

ఎర్రగుంట్లలో ప్రజలతో ముఖాముఖిలో సీఎం వైఎస్‌ జగన్‌ 

ఒక్క గ్రామంలోనే 1,391 మందికి రూ.48.74 కోట్ల మేర లబ్ధి 

93 శాతం మందికి మన ప్రభుత్వ పథకాలు అందాయి 

ఇన్ని సంక్షేమ పథకాలను చంద్రబాబు ఎందుకు అమలు చేయలేదు?.. 14 ఏళ్లు సీఎంగా ఉండీ ఈ చిన్న పిల్లోడు చేసినంత మేలు ఎందుకు చేయలేకపోయారు? 

సాక్షి, నంద్యాల  : వైఎస్సార్‌సీపీ 58నెలల పాలనలో గ్రామాల రూపురేఖలు సమూలంగా మారిపోయా­యని, ఈ ఎన్ని­కలు పేదల తలరాతలను మార్చే ఎన్నికలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొ­న్నారు. ‘ఇవాళ మన ప్రభుత్వ పాఠశాలలు,  ఆస్ప­త్రులు మారాయి. సర్కారు స్కూళ్లలో డిజిటల్‌ బోధన వచ్చింది. విలేజ్‌ హెల్త్‌ క్లిని­క్‌లు ఏర్పాటు చేశాం. వైఎస్సార్‌ ఆరోగ్య సురక్ష ద్వారా ప్రతి గ్రామాన్ని జల్లెడ పడుతూ పేదవాడికి ఆరోగ్య పరీక్ష­ల­తో­పాటు మందులు కావాలన్నా ఇంటి వద్దకే తెచ్చి ఇస్తున్నాం’ అని తెలిపారు. అర్హత ఉన్న ప్రతి ఒక్క­రికీ పథకాలను అందజేస్తున్నామన్నారు.

‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ఆళ్లగడ్డలోని రాత్రి బస ప్రాంతం నుంచి గురువారం ఉదయం మొదలైంది. అక్కడి నుంచి సీఎం జగన్‌ ఉదయం 11 గంటల సమయంలో ఎర్రగుంట్ల గ్రామానికి చేరుకుని రైతులు, వివిధ వర్గాల ప్రజలను కలుసు­కుని మాట్లాడారు. ప్రతి అక్కచెల్లెమ్మ తమ సొంత కాళ్లమీద నిలబడేలా రుణాలు, ప్రభుత్వ పరంగా తోడ్పాటు అందిస్తున్నాం. మహిళల భద్రతకు పెద్దపీట వేస్తూ దిశ యాప్‌ తీసు­కొచ్చాం. ఆపదలో ఉన్న అక్క­చెల్లెమ్మలను నిమిషాల వ్యవ­ధిలో ఆదుకుంటున్నాం.

మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేశామని గొప్పలు చెప్పుకునే వారు ఏ రోజూ కనీసం ఆలోచన చేయని విధంగా మీ బిడ్డ ఈ 58 నెలల వ్యవధిలో గొప్ప మార్పులు తెచ్చాడు. వ్యవస్థల్లో చోటు చేసుకున్న విప్లవా­త్మక మార్పులను గమనించండి. ఈ మార్పు కొనసాగడం ఎంత అవసరమో ఆలోచన చేయండి. దేవుడి దయవల్ల ఇంత మంచి  చేయగలిగాం. వ్యవ­స్థను మరింత మెరుగ్గా తీర్చిదిద్దేందుకు మీరు సలహాలు ఇవ్వవచ్చు.



అందరికీ ఓ విన్నపం..
ఎన్నికల కోడ్‌ కారణంగా పథకాలకు ఆటంకం తలెత్తకుండా ఈ మధ్య కాలంలో ఈబీసీ నేస్తం, చేయూత బటన్‌లు నొక్కాం. ఇది వరకు వారం రోజుల్లోనే ఖాతాల్లో డబ్బులు జమయ్యేవి. కోడ్‌ కారణంగా పది రోజులు అటు ఇటు­గా పథకాల లబ్ధి నేరుగా మీ ఖాతాల్లోకి జమ అవుతుంది. దీని గురించి ఆందోళన చెందవద్దు.

చిన్న పిల్లాడు చేసిన పనులు..మీరెందుకు చేయలేదు?
నేను చాలా చిన్న పిల్లాడిని. మన ప్రభుత్వం కంటే ముందు మీరు చాలా ప్రభుత్వాలను చూశారు. నాకన్నా వయసులో పెద్దోళ్లు, ఎంతో అనుభవం ఉందని గొప్పలు చెప్పుకునే వారు ముఖ్య­మంత్రులుగా పని చేశారు. ముఖ్యంగా రాష్ట్రం విడిపో­యాక నా కంటే ముందు 75 ఏళ్ల ముసలా­యన పరిపాలన చేశారు. ఆయన ఏకంగా 14 ఏళ్లు పాలించారు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు.

నేను వయ­సులో ఆయన కంటే చాలా చిన్నోడిని. నేను ఒకటే అడుగు­తున్నా. ఇంత చిన్నో­డు చేసిన పనులను 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఏనాడైనా చేశారా? మీరంతా దీనిపై ఆలోచన చేయాలి. ఈ రోజు ఏ రకంగా మన బతు­కులు, జీవితాలు మారా­యి? ఏ రకంగా వ్యవ­స్థల్లో మార్పులు తేగలిగాం? అనే విష­యా­లను అందరూ ఒక్క­సారి గమనించాలని కోరుతున్నా. 

రైతన్నకు ప్రతి అడుగులో అండగా..
ప్రతి రైతన్నను చేయి పట్టుకుని నడిపి­స్తున్నాం. రైతన్నల కోసమే ఆర్బీకేలు ఏర్పాటు చేశాం. ప్రతి ఎకరాను ఈ–క్రాప్‌ చేస్తున్నాం. ఉచిత పంటల బీమా అమలు చేస్తున్నాం. గత పాలనలో బ్యాంకులలో పంట రుణాలు అందకుంటే ఇన్సూరెన్స్‌ ఎలా చేసుకోవాలో తెలియని దుస్థితి. అలాంటిది ఈ రోజు గ్రామంలోనే ఆర్బీకేలను తీసుకొచ్చి ఈ క్రాప్, ఉచిత పంటల బీమా, పంట నష్టపోతే సీజన్‌ ముగిసేలోపు ఇన్‌పుట్‌ సబ్సిడీ అందజేస్తున్నాం. రైతన్నకు పెట్టుబడి సాయంగా రూ.13,500 చొప్పున మీ బిడ్డ హయాంలోనే అందుతోంది.

మీ కుటుంబంతో చర్చించండి..
గత ఎన్నికల్లో నాకు ఓటు వేయని వారిని కూడా అడుగుతున్నా. ఓటు వేయలేదని వివక్ష చూపించలేదు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పథకాల లబ్ధిని అందజే­స్తున్నాం. ఈ రోజు ప్రభుత్వ పాఠశాలల రూపు­రేఖలు మారిపో­యాయి. గ్రామాల్లో విలేజ్‌ క్లినిక్‌­లు వచ్చాయి. విద్యార్థులకు డిజిటల్‌ బోధన అంది­స్తున్నాం. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్‌ మీడి­యం ప్రవేశపెట్టాం. ఒకవైపు ఇంగ్లిష్, మరోవైపు తెలుగు మీడియంతో ప్రచురించిన పుస్తకాలను పిల్లలకు అందజేస్తున్నాం.

విద్యార్థులకు ట్యాబ్‌లు కూడా ఉచితంగా ఇస్తున్నాం. మీరంతా ఒక్కసారి ఇంటికి వెళ్లి ఆలోచన చేయండి. ఈ ప్రభుత్వంలో సాకారమైన మార్పులను గమనించండి. ఇది కేవలం ఎమ్మెల్యే, ఎంపీలను ఎన్నుకునే ఎన్నిక కాదు. ఈ ఎన్నికలు పేదల తలరాతలను మార్చే ఎన్నికలు. అందరూ ఇంటికి వెళ్లాక ఒక్కసారి మీ భార్య, పిల్లలు, ఇంట్లో అవ్వాతాతలతో మాట్లాడండి. అందరూ కలిసికట్టుగా నిర్ణయం తీసుకోండి. 

నేడు ఎమ్మిగనూరులో సీఎం జగన్‌ సభ
సాక్షి, అమరావతి: మేమంతా సిద్ధం బస్సు యాత్ర మూడో రోజైన శుక్రవారం కర్నూలు జిల్లా పెంచికలపాడులో సీఎం వైఎస్‌ జగన్‌ రాత్రి బస చేసిన ప్రాంతం నుంచి ప్రారంభం కానుంది. బస్సు యాత్ర శుక్రవారం షెడ్యూల్‌ను వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం వెల్లడించారు. ఉదయం 9 గంట­లకు సీఎం జగన్‌ పెంచికలపాడు నుంచి బయలుదేరి రామచంద్రపురం, కోడుమూరు, హంద్రీ కైరవడి, గోనెగండ్ల మీదుగా రాళ్లదొడ్డికి చేరుకుంటారు.

ఆ ప్రాంతంలో భోజన విరామం తీసు­కుంటారు. అనంతరం కడిమెట్ల మీదుగా ఎమ్మిగనూరులోని వీవర్స్‌ కాలనీ సొసైటీ గ్రౌండ్‌ దగ్గరకు చేరుకొని మధ్యాహ్నం 3గంటలకు బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం అరెకల్, ఆదోని క్రాస్, విరుపా­పురం, బెణిగేరి, ఆస్పరి, చిన్నహుల్తి, పత్తికొండ బైపాస్‌ మీదుగా కేజీఎన్‌ ఫంక్షన్‌ హాల్‌కు దగ్గరలో ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి సీఎం చేరుకుంటారు.  

ఒక్క ఊరికే రూ.49 కోట్ల ఉపకారం
కేవలం ఒక్క ఎర్రగుంట్ల గ్రామానికే 58 నెలల వ్యవధిలో వివిధ పథకాల ద్వారా డీబీటీతో రూ.49 కోట్ల మేర లబ్ధి చేకూర్చగలిగాం. ఈ గ్రామంలోని రెండు సచివాలయాల పరిధిలో ఎన్ని ఇళ్లు ఉన్నాయి? ఎంత మంది లబ్ధిదారులున్నారు? ఎవరెవరికి ఏయే పథకాలు అందాయి? అనే విషయాలను కాసేపటి క్రితమే అడిగి తెలుసుకున్నా. గ్రామంలో 1,496 ఇళ్లు ఉండగా, 1,391 ఇళ్లకు ప్రభుత్వ పథకాల ద్వారా రూ.48,74,34,136 అందాయి. 93 శాతం మందికి ప్రభుత్వ పథకాలు అందాయి. ఒక్క ఈ ఊరులోనే వైఎస్సార్‌ పెన్షన్‌ కింద రూ.16.52 కోట్లు పంపిణీ చేశాం.

వైఎస్సార్‌ రైతు భరోసా కింద రూ.6.81 కోట్లు, అమ్మఒడితో 1,043 మంది తల్లులకు రూ.4.69 కోట్లు అందజేశాం. వైఎస్సార్‌ ఆసరా కింద రూ.3.88 కోట్లు, వైఎస్సార్‌ చేయూత కింద 492 మంది అక్కచెల్లెమ్మలకు రూ.2.96 కోట్లు, జగనన్న విద్యా దీవెన కింద 837 మందికి రూ.2.46 కోట్లు, హౌసింగ్‌ కింద రూ.2.75 కోట్లు, ఆరోగ్యశ్రీ ద్వారా రూ.2.24 కోట్లు, ఇన్‌పుట్‌ సబ్సిడీతో రూ.1.13 కోట్లు, జగనన్న వసతి దీవెన కింద రూ.కోటి, సున్నా వడ్డీ కింద రూ.86 లక్షలు, క్రాప్‌ ఇన్సూరెన్స్‌ కింద రూ.67 లక్షలు, జగనన్న తోడు కింద ఇచ్చిన రుణాలు రూ.41.30 లక్షలు, చేదోడు కింద రూ.40 లక్షలు, కాపు నేస్తం కింద రూ.31 లక్షలు, వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరా కింద రూ.21.48 లక్షలు అందజేశాం.

మీ బిడ్డ గత 58 నెలల వ్యవధిలో ఒక్క గ్రామానికే ఇంత మంచి చేశాడనే విషయాన్ని గమనించాలని కోరుతున్నా. వీటితోపాటు గోరుముద్ద, ఇళ్ల స్థలాలు, బియ్యం కార్డులు, విద్యా కానుక, సంపూర్ణ పోషణ కింద మరింత అదనంగా లబ్ధి చేకూర్చాం. ఎక్కడా ఎవరూ లంచం అడగడం లేదు. అర్హత ఉంటే చాలు పారదర్శకంగా ప్రయోజనాన్ని అందిస్తున్నాం. చివరిగా.. ఈ ముఖా­ముఖిలో వీలైనంత ఎక్కువ మందితో మాట్లాడించే ప్రయత్నం చేశాం.

సమయాభావం వల్ల అందరికీ మాట్లాడే అవకాశం దొరకలేదు. మీ అందరికీ స్లిప్పులు ఇచ్చాం. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే అందులో రాసి బాక్సులో వేస్తే నా దగ్గరికి వస్తాయి. వ్యవస్థను ఇంకా బాగుపరిచే సూచనలను కచ్చితంగా పరిగణనలోకి తీసుకుంటాం.

నవరత్నాలతో ప్రతి కుటుంబానికి మేలు
ముఖ్యమంత్రి జగన్‌ ప్రవేశపెట్టిన నవ­రత్నాల పథ­కాలతో ప్రతి కుటుంబానికి మేలు జరిగింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75సంవత్సరాలు పూర్తయినా ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి చేయని పనులను సీఎం జగన్‌ చేసి చూపించారు. తెలంగాణలో నాడు–నేడు కింద పాఠశాలలను అభివృద్ధి చేయాలని తలపెట్టి చేతులెత్తేశారు. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం సర్కారు బడుల రూపురేఖలు మార్చి  పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు వేశారు. – హుసేన్‌బాషా, ఎర్రగుంట్ల

ఎన్నో పథకాలు అందించారు
నాలాంటి వారికి అన్న­గా, పిల్లలకు మేన­మామ­లా, అవ్వా­తాత­లకు మన­వడిగా ఎంతో మందికి కుమారుడిగా ముఖ్యమంత్రి జగన్‌ ఎన్నో సంక్షేమ పథకాలను అందించారు. అన్ని వర్గాల ప్రజలు సుభిక్షంగా ఉన్నారు. మళ్లీ మీరే ముఖ్యమంత్రి కావాలని మేమంతా కోరు­కుంటున్నాం. ఈ ఎన్నికల్లో 175కి 175 స్థానాలు సాధిస్తారు. – పుష్పలత, ఎర్రగుంట్ల

రూ.5 లక్షలు బీమా వచ్చింది
మా అత్త రోడ్డు ప్రమా­దంలో మృతి చెంద­డంతో ప్రమాద బీమా కింద రూ.5 లక్షలు ఆర్థిక సాయ­ం అందింది. నాలుగు­­సార్లు అమ్మ ఒడి పథకం వర్తించింది. అర్హతే ప్రామాణికంగా ముఖ్యమంత్రి జగన్‌ సంక్షేమ పథకాలను వర్తింపజేస్తున్నారు. – పద్మావతి, గోవిందపల్లె

స్కూళ్ల రూపురేఖలు మార్చారు
ప్రభుత్వ పాఠశాలలను ముఖ్యమంత్రి జగన్‌ అన్ని విధాలుగా తీర్చిదిద్దారు. ఇంగ్లిష్‌ మీ­డి­యం విద్యను అందిస్తు­న్నారు. గతంలో మా పాఠశాలకు ప్రహరీ లేదు. మరుగుదొడ్లు అస్తవ్యస్తంగా ఉండేవి. నాడు–­నేడు ద్వారా పాఠశాలల రూపు­రేఖలు మార్చే­శారు. మరుగుదొడ్ల వసతి కల్పించారు. గోరుముద్ద ద్వారా చిక్కీలు, గుడ్లు, రాగి­జా­వతో ఆరోగ్యకరమైన భోజనం అందిస్తున్నా­రు.  – చర్విత, విద్యార్థిని, శిరివెళ్ల

ఆదుకున్న సీఎంఆర్‌ఎఫ్‌..
నా కుమారుడికి చిన్న వయసులోనే గుండెకు రంధ్రం పడి పెద్ద ఆరోగ్య సమస్య తలెత్తింది. ఆప­రేషన్‌కు రూ.6 లక్షలు ఖర్చ­వు­తుందన్నారు. ఆరోగ్యశ్రీ వర్తిం­చకపోవడంతో సీఎం రిలీఫ్‌ ఫండ్‌ కింద ఆపరేషన్‌ చేశా­రు. నా కుమారుడు బతికి బయటపడ్డా­డ­ంటే సీఎం జగన్‌ చలవే. ఆయనే మళ్లీ సీఎం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. – నాగరాజు దంపతులు, ఎర్రగుంట్ల

పాదయాత్ర హామీలన్నీ నెరవేర్చారు
చంద్రబాబు 600కిపైగా హామీలిచ్చి 2014లో అధికారంలోకి వచ్చాక ఏ ఒక్కటీ సంపూర్ణంగా అమలు చేసిన పాపాన పోలేదు. మేనిఫెస్టోలోని ప్రతి హామీని అమలు చేసిన ఘనత ఒక్క వైఎస్‌ జగన్‌కు మాత్రమే దక్కుతుంది. మాకు మళ్లీ అధికారం ఇస్తే గ్రామాలను అభివృద్ధి చేస్తాం, పిల్లలకు మంచి బడులు కట్టిస్తాం, మంచి చదువులు చెప్పిస్తాం, మంచి వైద్యం అందుబాటులోకి తీసుకొస్తాం, మహిళలకు ఆర్థిక చేయూ­త­నందిస్తామని చెబుతున్నాం.

కానీ, ప్రతిపక్షాలు ఏం మాట్లాడు­తు­న్నాయో ఒక్కసారి గమనించండి. ఒకరేమో తమ దగ్గర ఎర్ర పుస్తకంలో పేర్లు రాసుకు­న్నామని, అధికారంలోకి వస్తే వారి అంతు చూస్తానని బెదిరిస్తున్నారు. ఇంకొకరేమో తాము అధికారంలోకి వస్తే మీరంతా గుడుల్లో, బడుల్లో దాక్కోవాలంటూ రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారు. పగటి కలలు కనడం మానండి. వచ్చేది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే. సీఎంగా మళ్లీ ప్రమాణ స్వీకారం చేసేది జగనే.  – గంగుల బిజేంద్రారెడ్డి, ఎమ్మెల్యే, ఆళ్లగడ్డ

పేదల కోసం పెత్తందార్లతో యుద్ధం
సీఎం జగన్‌ ప్రజలతో నేరుగా మాట్లాడ­టం ఈ రోజు ప్రారంభిస్తున్నది కాదు. నేను విన్నాను.. నేను ఉన్నాను.. అంటూ జనం కోసం నిలబడిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి మన జగనన్న. ఓదార్పు యాత్రలో, పాదయాత్రలో ప్రజల బాధలు విన్నారు. ప్రజా ప్రభుత్వం ఎలా ఉంటుందో, ఎలా ఉండాలో ఈ ఐదేళ్లలో చేసి చూపారు. పేదల కోసం పెత్తందార్లతో యుద్ధం చేస్తున్నారు.

ఈ రోజు అక్కచెల్లెమ్మల కళ్లల్లో కనిపిస్తున్న ఆనందం అలాగే ఉండాలంటే ఏం చేయాలో వినడానికి వచ్చారు. సామాన్యుల జెండాను, అణగారిన వర్గాల అజెండాను మోసుకుంటూ, నడుచుకుంటూ వచ్చారు. కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి మనకు తగిన సమయం వచ్చింది.  – వాసిరెడ్డి పద్మ, ఏపీ మహిళా కమిషన్‌ మాజీ చైర్‌ పర్సన్‌

రెండో రోజు యాత్ర సాగిందిలా..
మేమంతా సిద్ధం అంటూ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన బస్సు యాత్ర రెండో రోజు గురువారం ఉదయం ప్రారంభమైంది. 
రాత్రి బస చేసిన శిబిరం నుంచి ఉదయం 9.40 గంటలకు సీఎం జగన్‌ బయటకు వచ్చారు. 
 9.45 గంటలకు ఆళ్లగడ్డ నుంచి బయలుదేరి నల్లగట్ల, బత్తలూరు మీదుగా ఎర్రగుంట్ల గ్రామానికి చేరుకున్నారు. 
   11.10 గంటలకు ఎర్రగుంట్ల గ్రామంలో వివిధ వర్గాల ప్రజలతో ముఖాముఖిలో పాల్గొని ప్రసంగించారు. 
 12.50 గంటలకు సభ నుంచి బయటకు వచ్చి వెంకటాపురం, శిరివెళ్ల మెట్ట మీదుగా దీబగుంట్ల గ్రామానికి చేరుకున్నారు. 
   మధ్యాహ్నం 2 గంటలకు దీబగుంట్ల వద్ద ఎమ్మెల్యే శిల్పా రవి పుష్పగుచ్చాలు అందజేసి నంద్యాల నియోజకవర్గంలోకి స్వాగతం పలికారు. 
 2.40 గంటలకు చాబోలు వద్ద భోజన విరామం కోసం ఆగారు. 
 సాయంత్రం 4.40 గంటలకు చాబోలు నుంచి రైతు నగరం క్రాస్‌ మీదుగా బొమ్మలసత్రం ఫ్లై ఓవర్‌ మీదుగా ఆర్ట్స్‌ కాలేజీలో ఏర్పాటు చేసిన సభ వద్దకు 5.30 గంటలకు చేరుకున్నారు. 
   5.40 గంటల నుంచి 7.10 వరకు ముఖ్యమంత్రి జగన్‌ ప్రసంగించారు. 
 8.10 గంటలకు ఆర్‌జీఎం కాలేజీ వద్దకు చేరుకుని విద్యార్థులకు అభివాదం చేశారు. 
 9.40 గంటలకు పాణ్యం, సుగాలిమెట్ట, హుసేనాపురం, ఓర్వకల్లు మీదుగా నన్నూరు టోల్‌ప్లాజా వద్దకు చేరుకున్నారు. 
 పెద్దటేకూరు, మార్కాపురం క్రాస్‌ మీదుగా రాత్రి 11.06 గంటలకు బస చేయనున్నపెంచికలపాడుకు చేరుకున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement