రాష్ట్రంలో అధికారం దక్కాక జరుగుతున్న తొలి ఎన్నికల్లోనే గందరగోళం
లోక్‌సభ అభ్యర్థుల ప్రకటనలో బీఆర్‌ఎస్, బీజేపీల కంటే వెనుకంజ
ఇప్పటికే మెజార్టీ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించి.. ప్రచారం చేపట్టిన విపక్షాలు
అధికార కాంగ్రెస్ టికెట్లు ఇచ్చిన తొమ్మిది మందిలో నలుగురు పారాచూట్ నేతలే!.. టికెట్ల కేటాయింపులోనూ నేతల కుటుంబాలకే ప్రాధాన్యం..
సద్దుమణగని మాల, మాదిగ సామాజిక వర్గాల వివాదం
ఇంకా ప్రకటించాల్సిన ఎనిమిది సీట్లపై కుదరని ఏకాభిప్రాయం.. ఈ పరిస్థితిపై పార్టీలో అంతర్గతంగా తీవ్ర చర్చలు
సాక్షి, హైదరాబాద్: సుదీర్ఘ రాజకీయ అనుభవం, దశాబ్దాల సీనియారిటీ ఉన్న నాయకులు.. రాష్ట్రంలో చేజిక్కిన అధికారం.. ఢిల్లీ నుంచి పర్యవేక్షణ.. స్క్రీనింగ్ కమిటీలు, ప్రదేశ్ ఎన్నికల కమిటీల వరుస సమావేశాలు.. చర్చలు.. ఇంత చేసీ లోక్‌సభ అభ్యర్థుల ఖరారుపై రాష్ట్ర కాంగ్రెస్ మల్లగుల్లాలు పడుతోంది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలను ఎదుర్కోవడంలో ఆ పార్టీ గందరగోళానికి గురవుతోందనే చర్చ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. రాష్ట్రంలో ప్రతిపక్షాలైన బీఆర్‌ఎస్, బీజేపీ తమ అభ్యర్థులను వడివడిగా ఖరారు చేస్తూ, ప్రచారంలో ప్రజాక్షేత్రంలో దూసుకెళ్లేందుకు వ్యూహాలు పన్నుతుంటే.. అధికార కాంగ్రెస్ మాత్రం ఇంకా అభ్యర్థుల ఖరారు స్థాయిలోనే తలమునకలైంది.
లోక్‌సభ ఎన్నికల రేసులో అధికార కాంగ్రెస్ మిగతా పక్షాల కంటే వెనుకంజలో ఉందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఇప్పటివరకు 9 స్థానాలకే అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్.. ఎనిమిదింటిని పెండింగ్‌లో పెట్టింది. అయితే అటు ఖరారు చేసిన స్థానాల్లోనూ, ఇటు ఇంకా అభ్యర్థిని ఎంపిక చేయాల్సిన స్థానాల్లోనూ అనేక సమస్యలు ఎదురవుతున్న పరిస్థితి. ముఖ్యంగా పారాచూట్ నేతలకు టికెట్లివ్వడం, దళిత సామాజిక వర్గాల మధ్య సర్దుబాటు చేయలేకపోవడం, పార్టీ సీనియర్ నేతల కుటుంబాలకే లోక్‌సభ టికెట్ల కేటాయింపులో ప్రాధాన్యం ఇస్తుండటంపై పార్టీ లో అంతర్గతంగా చర్చ జరుగుతోంది.
మున్షీ టీమ్ ఏం చేస్తున్నట్టు?
లోక్‌సభ టికెట్ల ఖరారు విషయంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ ఏం చేస్తున్నారన్న దానిపై గాం«దీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గాం«దీభవన్‌తోపాటు ఫిల్మ్‌నగర్‌లోని తన కార్యాలయం వేదికగా ఆమె లోక్‌సభ అభ్యరి్థత్వాల కోసం తరచూ ఆయా నియోజకవర్గాల నేతలతో భేటీ అవుతున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలందరి అభిప్రాయాలు తీసుకున్నారు. ప్రదేశ్ ఎన్నికల కమిటీ (పీఈసీ) సభ్యులు కూడా తమ సిఫారసులను సీల్డ్ కవర్‌లో ఆమెకు అందజేశారు. జిల్లా పార్టీ అధ్యక్షుల అభిప్రాయాలను కూడా ఆమె సేకరించారు.
పలుమార్లు సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కలతోనూ సమావేశమయ్యారు. ఆమెకు సహాయకారులుగా ఉన్న ఏఐసీసీ కార్యదర్శులు కూడా మంతనాలు జరుపుతున్నారు. అయితే వీరంతా అధిష్టానానికి ఏం చెబుతున్నారన్నది అంతు పట్టడం లేదని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. అభ్యర్థుల ఖరారులో ఇతర పార్టీ ల కంటే వెనుకబడినా పరిస్థితిని అధిష్టానానికి వివరించడంలో మున్షీ టీమ్ పాత్ర ఏమిటన్నది కూడా అర్థం కావడం లేదని పేర్కొంటున్నాయి. ఇతర పార్టీ ల నుంచి నేతలను చేర్చుకోవడంలో క్రియాశీల పాత్ర పోషిస్తున్న మున్షీ టీమ్.. లోక్‌సభ అభ్యర్థుల ఖరారు విషయంలో సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోలేకపోతుందనే చర్చ జరుగుతోందని వివరిస్తున్నాయి.
ఖరారైన చోట కూడా ‘కంగారే..’..
ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ 9 మంది లోక్‌సభ అభ్యర్థులను ఖరారు చేసింది. ఇందులో ఐదుచోట్ల మాత్రమే మొదటి నుంచీ స్పష్టత కనిపించింది. సురేశ్ షెట్కార్ (జహీరాబాద్), బలరాం నాయక్ (మహబూబాబాద్), వంశీచంద్‌రెడ్డి (మహబూబ్‌నగర్), మల్లురవి (నాగర్‌కర్నూల్), కుందూరు రఘువీర్‌రెడ్డి (నల్లగొండ)ల విషయంలో మాత్రమే నిర్ణయాలు త్వరితగతిన జరిగిపోయాయి.
► చేవెళ్ల స్థానానికి తొలుత మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి సతీమణి సునీత పేరు దాదాపు ఖరారైంది. ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్‌చార్జి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నుంచి ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే ఆమోదం కోసం పంపిన జాబితాలోనూ ఆమె పేరు కనిపించింది. కానీ అనూహ్యంగా బీఆర్‌ఎస్ ఎంపీ రంజిత్‌రెడ్డి తెరపైకి వచ్చారు. కాంగ్రెస్‌లో చేరిన వెంటనే చేవెళ్ల టికెట్ అందిపుచ్చుకున్నారు. దీనితో సునీతను మల్కాజిగిరికి మార్చాల్సి వచ్చింది.
► సికింద్రాబాద్ విషయంలో కూడా ఇలాగే జరిగింది. హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్‌ను పార్టీ లో చేర్చుకుని టికెట్ ఇవ్వాలనుకున్నారు. కానీ అనూహ్యంగా ఖైరతాబాద్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తెరపైకి వచ్చారు. అటు ఎమ్మెల్యే పదవికి, ఇటు బీఆర్‌ఎస్ పార్టీ కి రాజీనామా చేయకుండానే సికింద్రాబాద్ టికెట్‌ను దానం నాగేందర్‌కు ఇవ్వడం గమనార్హం.
► పెద్దపల్లికి సంబంధించి ఎమ్మెల్యే గడ్డం వివేక్‌కు మంత్రి పదవి ఇవ్వాలా? ఆయన కుమారుడు వంశీకి లోక్‌సభ టికెట్ ఇవ్వాలా అన్న దానిపై సమాలోచనలు జరిగాయి. చివరికి లోక్‌సభ టికెట్ ఇచ్చారు.
► మరోవైపు ఎస్సీ రిజర్వ్‌డ్ స్థానాలైన నాగర్‌కర్నూల్, పెద్దపల్లి టికెట్లను మాల సామాజిక వర్గానికే ఇవ్వడంపై మాదిగ సామాజికవర్గ నేతల్లో ఆగ్రహం వ్యక్తమైంది. ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ కూడా ఈ విషయంలో కాంగ్రెస్‌ను విమర్శించారు. ఆయనకు కౌంటర్‌గా కాంగ్రెస్‌లోని మాదిగ సామాజిక వర్గ నేతలు మాట్లాడుతున్నా.. అంతర్గతంగా మాత్రం మాల, మాదిగ సామాజిక వర్గాల సమన్వయ లోపం రాష్ట్ర కాంగ్రెస్‌లో స్పష్టంగా కనిపిస్తోంది.
► మరోవైపు ఇతర పార్టీ ల నుంచి వస్తున్న నేతలకు లోక్‌సభ టికెట్లు ఎందుకు ఇవ్వాలన్న చర్చ కూడా కాంగ్రెస్ వర్గాల్లో సీరియస్‌గా జరుగుతుండటం గమనార్హం. అటు వలస నేతలు, ఇటు నేతల కుటుంబ సభ్యులకే టికెట్ల కేటాయింపులో ప్రాధాన్యం ఇస్తుండటం ఏమిటనే ఆగ్రహం వ్యక్తమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment