దానం నాగేందర్ కాంగ్రెస్ నుంచి లోక్‌సభకు పోటీచేసే విషయంలో ట్విస్ట్
ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీజేపీ తీసుకెళ్తే పరిస్థితేమిటనే చర్చ
ఆయన రాజీనామా చేసి, పోటీచేస్తారని అధిష్టానాన్ని ఒప్పించిన రేవంత్!
ఒకవేళ దీనికి ససేమిరా అంటే నాగేందర్‌కు ప్రత్యామ్నాయం సిద్ధం చేస్తున్న టీపీసీసీ
కడియం విషయంలోనూ ఇదే చర్చ
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ సికింద్రాబాద్ లోక్‌సభ అభ్యర్థిగా దానం నాగేందర్ పోటీ అంశం తీవ్ర చర్చనీ యాంశంగా మారింది. ఆయన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగానే ఉండి.. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉంటారనే ప్రచారం గందరగోళం రేపుతోంది. వాస్తవానికి దానం నాగేందర్ చేరిక సందర్భంగా జరిగిన చర్చల్లో సికింద్రా బాద్ లోక్‌సభ స్థానంలో పోటీ చేయాలని, ఖైరతా బాద్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని ఆయనకు కాంగ్రెస్ పార్టీ పెద్దలు స్పష్టతనిచ్చినట్టు తెలిసింది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎంపీగా పోటీ చేయా లనే ప్రతిపాదన మేరకే ఆయన కాంగ్రెస్‌లో చేరారు. టీపీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌రెడ్డి ఈ విషయాన్ని పార్టీ అధి ష్టానానికి వివరించాకే.. నాగేందర్‌కు ఎంపీ అభ్యర్థిత్వా న్ని ఏఐసీసీ ఖరారు చేసింది. కానీ ఆయన రాజీనామా పై ఊగిసలాటలో పడ్డారు. ఎంపీగా గెలిచాకే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఈ క్రమంలో పార్టీ పెద్దలు ఏం చేస్తారనే చర్చ మొదలైంది.
ప్రత్యామ్నాయంపై ఆలోచన!
గాంధీభవన్ వర్గాల్లో, కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న చర్చల మేరకు.. దానం నాగేందర్ బీఆర్ ఎస్ ఎమ్మెల్యేగా ఉండి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడం సాధ్యం కాదని ఏఐసీసీ పెద్దలు తేల్చినట్టు సమాచారం. పదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుందని.. ఇప్పుడు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేను కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీచేయిస్తే ఆ రాష్ట్రాల్లో బీజేపీ వ్యవహారాన్ని తప్పుపట్టలేని స్థితికి వెళతామని స్పష్టం చేసినట్టు తెలిసింది. ఈ క్రమంలో నాగేందర్ అభ్యర్థి త్వంపై పునః సమీక్ష చేసే అవకాశాలు ఉన్నట్టు సమాచా రం. నాగేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తేనే ఎంపీగా పోటీచేస్తారని.. ఆయన రాజీనామాకు ససేమిరా అంటే మరో అభ్యర్థిని పోటీకి పెట్టాలని భావిస్తున్నట్టు తెలిసింది. హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ లేదా మరో నేతను ప్రత్యామ్నాయంగా పోటీ చేయించేందుకు సిద్ధంగా ఉంచాలని కాంగ్రెస్ పెద్దలు రాష్ట్ర నేతలకు సూచించినట్టు సమాచారం.
కడియం శ్రీహరి విషయంలోనూ!
స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి విషయంలోనూ కాంగ్రెస్‌లో ఇదే తరహా చర్చ జరుగుతోంది. కడియంతోపాటు ఆయన కుమార్తె కావ్య నేడు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ నేపథ్యంలో కడియం శ్రీహరి వరంగల్ లోక్‌సభ ఎంపీగా పోటీచేస్తారని, ఖాళీ అయ్యే స్టేషన్‌ఘన్‌పూర్‌లో కావ్యను ఎమ్మెల్యేగా పోటీ చేయిస్తారనే చర్చ జరుగుతోంది. లేదా కావ్యను ఎంపీగా పోటీచేయించి.. శ్రీహరి ఎమ్మెల్యేగా కొనసాగుతారని అంటున్నారు. మొత్తమ్మీద బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు.. కాంగ్రెస్ తరఫున ఎంపీ అభ్యర్థులుగా పోటీచేసే అంశం ఆ పార్టీలో కొంత గందరగోళానికి దారిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment