
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మంత్రి హరీష్ రావుకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ లేకపోతే తెలంగాణ లేదు.. మీకు పదవులు వచ్చాయంటే అది సోనియా భిక్ష అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
కాగా, మహేష్ కుమార్ గౌడ్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఆటుపోట్లను చూసిన సముద్రం వంటిది. పదవులే పరమావధిగా బీజేపీ, బీఆర్‌ఎస్ నాయకులు పనిచేస్తారు. కాంగ్రెస్ పని అయిపోయిందని హరీష్ రావు చెప్పడం కాదు.. ప్రజలు మీ పని పట్టే పనిలో ఉన్నారు. పార్టీలో తెలంగాణ అనే పదం లేకుండా బీఆర్‌ఎస్‌ను ఏర్పాటు చేసుకున్నారు. సోనియా గాంధీ లేకపోతే తెలంగాణ లేదు. సోనియా భిక్ష వల్లే మీకు పదవులు వచ్చాయి.
సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు అధికారం మీద కాంక్ష లేదు. అందుకే దేశానికి ప్రధాని అయ్యే అవకాశం ఉన్నా పదవి చేపట్టకుండగా మన్మోహన్ సింగ్‌ను ప్రధానిని చేశారు. ఈ నెల 20, 21,22 తేదీలో ఏఐసీసీ ఇంచార్జ్ తెలంగాణ పర్యటనకు రానున్నారు. కాంగ్రెస్ నేతలతో సమావేశం అవుతారు. హత్ సే హత్ జోడో యాత్ర, పార్టీ బలోపేతం మీద చర్చిస్తారు. రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులను ప్రజలు గమనిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు చూస్తున్నారు. టీచర్ల బదిలీలు, ప్రమోషన్లు తప్పుల తడకగా ఉంది. టీచర్ల ఎమ్మెల్సీలో కూడా అదే కుట్ర చేస్తున్నారు. టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఈ ప్రకటన చేశారు. ప్రతీ నెల ఒకటో తేదీన రావాల్సిన జీతాలు, సమయానికి రావడం లేదు’ అంటూ కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment