ఎస్.రాజమహేంద్రారెడ్డి: ఏ రాజకీయ పార్టీకైనా ఎన్నికల్లో గెలవడమే అతిపెద్ద సవాల్. ది గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్‌కు మాత్రం ఎన్నికల్లో నెగ్గడం దైవాదీనం, నెగ్గాక ముఖ్యమంత్రిని ఎంపిక చేయడమే అతిపెద్ద సవాల్. ప్రస్తుత కర్ణాటక సంక్షోభమే ఇందుకు ఉదాహరణ. ఐదేళ్లు పాలించిన బీజేపీని కాదని, కింగ్‌మేకర్ అనుకున్న జేడీ(ఎస్)కు అవకాశం లేకుండా చేసి, కర్ణాటక ఓటర్లు అందించిన ఘన విజయాన్ని సగర్వంగా భుజాలకెత్తుకోవాల్సిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఎంపికలో తడబాటుకు గురవుతోంది.
ఎన్నో చేదు అనుభవాలు, మరెన్నో గుణపాఠాల నుంచి నేర్చుకున్నది ఏమీ లేదని ఆ పార్టీ మరోసారి రుజువు చేసింది. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వైరం నుంచి శాసనసభాపక్ష నాయకుడు సిద్ధరామయ్య, పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌లను ‘దోస్త్ మేరా దోస్త్’ దాకా తీసుకొచ్చి ఎన్నికల ముందు హిట్ కొట్టిన కాంగ్రెస్ హైకమాండ్, సీఎం పదవి విషయానికొచ్చేసరికి ఇద్దరి మధ్య సఖ్యత కుదర్చడానికి మల్లగుల్లాలు పడుతోంది. ఎందుకిలా?
ఒకేమాట.. కలలో మాట
ఎన్నికల ముందు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాటే గాందీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ల మాటగా చెల్లింది. దాంతో ఎందుకిలా అని అడిగేవాళ్లు గానీ, అలకపాన్పు ఎక్కే వాళ్లు గానీ ఎవరూ కనిపించలేదు. లేదా ఎవరూ అందుకు సాహసించలేదు. సిద్ధరామయ్య, శివకుమార్‌లు సైతం ఖర్గే మాట జవదాటకుండా పార్టీ విజయానికి కృషి చేశారు. గెలిచాక మళ్లీ షరా మామూలే! సిద్ధరామయ్య, శివకుమార్‌లు ఎవరి గూట్లోకి వారు వెళ్లిపోయి, సై అంటే సై అనే స్థాయిలో ఢీకొంటున్నారు. సీఎం రేసులోనూ అదే వైఖరి.
ఎన్నికల ఫలితాలు వెలువడి నాలుగు రోజులైనా ఎటూ తేల్చుకోలేని స్థితిలో అధిష్టానం ఊగిసలాడుతోందంటే ఏమనుకోవాలి? పార్టీలోని పెద్దలు ఒకేమాట మీద నిలబడలేకపోవడం కారణం కాదా? రాహుల్ గాందీ, ప్రియాంకా గాందీలు సిద్ధరామయ్య వైపు, మల్లికార్జున ఖర్గే శివకుమార్ వైపు మొగ్గు చూపుతున్నారని అభిజ్ఞ వర్గాల భోగట్టా. ఎన్నికల ముందు లాగా హైకమాండ్ ఒకేమాట మీద ఉండి ఉంటే ఈ పరిస్థితి వచ్చేదే కాదు. సిద్ధరామయ్య, శివకుమార్‌లు మా అంటే కాసేపు అలకపాన్పు ఎక్కి, ఆ తర్వాత సర్దుకునేవారు.
అందుకే సీఎం పీఠంపై పీటముడి
గతంలో ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన సిద్ధరామయ్య అనుభవానికి పెద్దపీట వేయడంలో తప్పులేదు గానీ, పార్టీ విజయం కోసం అహర్నిశలూ చెమటోడ్చడమే కాకుండా ఆర్థిక వనరులు సైతం సమకూర్చిన శివకుమార్‌ను ఉప ముఖ్యమంత్రి పదవితో సరిపెట్టుకోమనడం అభిమానులకు రుచించలేదు. అందుకే ముఖ్యమంత్రి పీఠంపై పీటముడి పడింది. ఢిల్లీ వేదికగా ప్రత్యర్థులిద్దరూ బుధవారం మొత్తం లాబీయింగ్‌లో తలమునకలై ఉన్నారు.
క్షణానికో సీన్ మారింది. సిద్ధరామయ్యే సీఎం అంటూ లేఖ సైతం సిద్ధమయ్యింది. శివకుమార్ ససేమిరా అనడంతో ఆ లేఖ బుట్టదాఖలయ్యింది. బెంగళూరు కంఠీరవ స్టేడియంలో గురువారం జరగాల్సిన ప్రమాణ స్వీకార ఏర్పాట్లను ప్రస్తుతానికి నిలిపేశారు. సీఎం పోస్టు కోసం కోట్లాట ఈ స్థాయికి చేరుకుందంటే ముగింపు ఎలా ఉంటుందో ఊహించడం కష్టం.
అసలు హైకమాండ్ దాకా వెళ్లకుండా కాంగ్రెస్ శాసనసభాపక్ష(సీఎల్పి) సమావేశంలోనే సీఎం అభ్యర్థిని ఎన్నుకొని ఉంటే ఎలాంటి వివాదానికి తావు ఉండేది కాదు. హైకమాండ్ చేతికి మట్టి అంటకుండా ఉండేది. అలా చేస్తే అది కాంగ్రెస్ సంస్కృతి ఎందుకవుతుంది? తెగేదాకా లాగి రెండు కుంపట్లు పెట్టుకుంటే ప్రతిపక్షం దాన్ని సొమ్ము చేసుకోవడం ఖాయం. అదే పరిస్థితి వస్తే ఈ ఇద్దరినీ కాదని మూడో వ్యక్తిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేయడం తప్ప కాంగ్రెస్‌కు మరో గత్యంతరం లేదు.
కాంగ్రెస్ నేర్చుకున్నదేమీ లేదు
రాజస్తాన్‌లో 2018లో అశోక్ గహ్లోత్, సచిన్ పైలట్ మధ్య మొదలైన సీఎం పీఠం లొల్లి ఐదేళ్లయినా ఇంకా ఓ కొలిక్కిరాలేదు. ఈ అనుభవం నుంచి కాంగ్రెస్ నేర్చుకున్నదేమీ లేదు. పీసీసీ అధ్యక్షుడిగా పార్టీని గెలిపించిన సచిన్ పైలట్‌ను పక్కనపెట్టి (కొన్ని రోజులు డిప్యూటీ సీఎం పదవి ఎరవేసి), అనుభవాన్ని సాకుగా చూపి గహ్లోత్‌ను ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టారు.
అప్పటినుంచి రాజస్తాన్ అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతూనే ఉంది. రాష్ట్రంలో ఈ ఏడాది డిసెంబర్‌లో జరిగే ఎన్నికల్లో గెలుస్తామన్న ఆశలు సన్నగిల్లాయి. ఇదంతా ఎందుకంటే.. డీకే శివకుమార్ మరో సచిన్ పైలట్ అయితే, కర్ణాటక మరో రాజస్తాన్ అవుతుందని రాజకీయ విశ్లేషకుల అంచనా.
Comments
Please login to add a commentAdd a comment