న్యూఢిల్లీ: కర్ణాటక ముఖ్యమంత్రి ఎంపిక వ్యవహారం కాంగ్రెస్ అధిష్టానానికి చుక్కలు చూపుతోంది. మాజీ సీఎం సిద్ధరామయ్య, పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ ఎవరి పట్టు మీద వారే ఉండటంతో పీటముడి మరింత బిగుసుకుంటోంది. ఈ విషయమై హస్తినలో సోమ, మంగళవారాల్లో అధిష్టానం చర్చోపచర్చలు జరిపినా ఫలితం లేకపోయింది. దాంతో బుధవారం నిర్ణయం తీసుకుంటామని ప్రకటించడం తెలిసిందే.
కానీ ఇద్దరు నేతల్లో ఎవరూ వెనక్కు తగ్గేందుకు సిద్ధంగా లేకపోవడంతో చివరికి అధిష్టానం ఏమీ తేల్చలేకపోయింది. నిర్ణయానికి మరో రెండు మూడు రోజులు పట్టవచ్చని కాంగ్రెస్ కర్ణాటక వ్యవహారాల ఇన్‌చార్జి రణ్‌దీప్ సుర్జేవాలా మీడియాకు చెప్పారు. ఆలోపు కాంగ్రెస్ నేతలెవరూ దీనిపై తప్పుడు ప్రకటనలు చేయొద్దని ఆదేశించారు. లేదంటే క్రమశిక్షరాహిత్యంగా పరిగణించి చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
కర్ణాటకలో కాంగ్రెస్ చేతిలో ఓటమిని జీర్ణించుకోలేని బీజేపీ సీఎం ఎంపికపై తప్పుడు ప్రచారాలకు పాల్పడుతోందని ఆరోపించారు. సీఎంను కూడా ఎన్నుకోలేకపోతున్నారన్న విమర్శలను తిప్పికొట్టారు. అస్సాం వంటి రాష్ట్రాల్లో సీఎం ఎంపికకు బీజేపీ ఎన్ని రోజులు తీసుకుందో అందరికీ తెలుసన్నారు. ఎవరిని సీఎం చేయాలో కూడా తేల్చుకోలేని అయోమయంలో కాంగ్రెస్ పెద్దలున్నారంటూ కర్ణాటక తాజా మాజీ సీఎం బసవరాజ్ బొమ్మై, ఇతర బీజేపీ నేతలు అంతకుముందు చురకలు వేశారు.
రోజంతా చర్చలే చర్చలు
బుధవారం ఉదయం రాహుల్‌గాంధీ తొలుత సిద్ధరామయ్య, తర్వాత డీకేతో సమావేశమయ్యారు. 10, జన్‌పథ్ నివాసంలో వారితో చెరో అరగంటకు పైగా చర్చలు జరిపారు. తర్వాత సిద్ధరామయ్యనే సీఎం చేయాలని అధిష్టానం నిర్ణయించినట్టు చెబుతున్నారు. ఈ మేరకు లేఖ కూడా సిద్ధమైనట్టు సమాచారం. బెంగళూరు కంఠీరవ స్టేడియంలో గురువారం మధ్యాహ్నం సిద్ధరామయ్య ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు కూడా మొదలయ్యాయి.
సిద్ధరామయ్యే సీఎం అంటూ చానళ్లలో వార్తలు రావడంతో ఆయన సొంతూళ్లో, బెంగళూరులోని నివాసం వద్ద సంబరాలు మొదలయ్యాయి. దాంతో భగ్గుమన్న డీకే సరాసరి వెళ్లి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సమావేశమయ్యారు. అనంతరం బెంగళూరులో ప్రమాణోత్సవ ఏర్పాట్లు నిలిచిపోయాయి.
నిర్ణయానికి మరో రెండు మూడు రోజులు పట్టొచ్చన్న ప్రకటన వెలువడింది. తర్వాత ప్రతిష్టంభనకు తెర దించే ప్రయత్నాలను అధిష్టానం ముమ్మరం చేసింది. వాటిలో భాగంగా ఆదివారం నాటి కర్ణాటక సీఎల్పీ భేటీకి అధిష్టానం పరిశీలకునిగా వెళ్లిన సుశీల్‌కుమార్ షిండేతో ఖర్గే తన నివాసంలో భేటీ అయ్యారు.
బుధవారం హస్తినలో చోటుచేసుకున్న కర్ణాటక రాజకీయ పరిణామాలు...
♦ ఉదయం 8.46: సీఎం రేసులో ముందున్న సిద్ధరామయ్య
♦ 11.30: సిద్ధరామయ్యతోరాహుల్ భేటీ
♦ మధ్యాహ్నం 12.20: డీకే శివకుమార్‌తో రాహుల్ సమావేశం
♦ 1.27: బెంగళూరు కంఠీరవ స్టేడియంలో ప్రమాణస్వీకార ఏర్పాట్లు షురూ
♦1.54: సిద్ధరామయ్యను సీఎంగా పేర్కొంటూ లేఖ ప్రతి కూడా సిద్ధం
♦ 2.14: కాంగ్రెస్ చీఫ్ ఖర్గేతో శివకుమార్ భేటీ
♦ 4.16: షేరింగ్ ఫార్ములాకు, డిప్యూటీ సీఎం పదవికి డీకే ససేమిరా
♦ సాయంత్రం 4.30: బెంగళూరులో నిలిచిపోయిన ప్రమాణస్వీకార ఏర్పాట్లు
♦ 5.25: ఎమ్మెల్యేలు, మద్దతుదారులతో ఢిల్లీలోని సోదరుడు సురేశ్ నివాసంలో డీకే మంతనాలు
Comments
Please login to add a commentAdd a comment