పాటియాలా జిల్లాలో మున్సిపల్ ఎన్నికల్లో గెల్చిన కాంగ్రెస్ అభ్యర్థి బలిజీందర్ కౌర్ ఆనందం
చండీగఢ్: పంజాబ్‌లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ విజయ ఢంకా మోగించింది. మొత్తం 8 మున్సిపల్ కార్పొరేషన్లకు గాను ఇప్పటివరకు 6 కార్పొరేషన్లను కైవసం చేసుకుంది. మరో కార్పొరేషన్‌లోనూ పాగా వేసే పరిస్థితి కనిపిస్తోంది. ఈ ఎన్నికల్లో ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ(బీజేపీ)కి చేదు అనుభవమే ఎదురయ్యింది. అధికార పక్షానికి గట్టి పోటీ కూడా ఇవ్వలేక బీజేపీ చతికిలపడింది. శిరోమణి అకాలీ దళ్(ఎస్‌ఏడీ), ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్), బహుజన సమాజ్ పార్టీ(బీఎస్పీ) కూడా తమ అభ్యర్థులను బరిలోకి దింపాయి. కొన్నిచోట్ల తమ ఉనికిని చాటుకున్నాయి.
2020లో జరగాల్సిన పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలను కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా వాయిదా వేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 7న నిర్వహించారు. బుధవారం ఓట్ల లెక్కింపు చేపట్టారు. భటిండా, హోషియార్‌పూర్, కపుర్తలా, అబోహర్, బటాలా, పటాన్‌కోట్ మున్సిపల్ కార్పొరేషన్లు కాంగ్రెస్ వశమయ్యాయి. ఇక మరో ఆరు వార్డులు గెలుచుకుంటే చాలు మోగా కార్పొరేషన్‌లోనూ కాంగ్రెస్ విజయం ఖాయం కానుంది. మొహాలీ మున్సిపల్ కార్పొరేషన్ ఓట్ల లెక్కింపు గురువారం జరుగనుంది. ఇక్కడ రెండు బూత్‌ల్లో రీపోలింగ్ నిర్వహించారు. 109 మున్సిపల్ కౌన్సిళ్లు, నగర పంచాయతీల్లోనూ మెజారిటీ స్థానాలను కాంగ్రెస్ సొంతం చేసుకుంది.
ఈ విజయం ప్రతి పంజాబీ విజయం: బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్ రైతులు పెద్ద ఉత్తున పోరాటం సాగిస్తున్నారు. వారికి కాంగ్రెస్ అండగా నిలుస్తోంది. తాజా ఎన్నికల ఫలితాలతో ఆ పార్టీలో ఉత్సాహం ద్విగుణీకృతమయ్యింది. ఈ విజయం ప్రతి పంజాబీ విజయమని అభివర్ణిస్తూ సీఎం అమరీందర్ సింగ్ ట్వీట్ చేశారు. రాష్ట్ర ప్రజలు కేవలం అభివృద్ధిని కోరుకుంటున్నారని.. విద్వేష, విభజన, అప్రజాస్వామిక, రాజ్యాంగ వ్యతిరేక రాజకీయాలను కాదని తేల్చిచెప్పారు.
బీజేపీ, ఆప్, శిరోమణి అకాలీ దళ్ పార్టీల ప్రజా వ్యతిరేక చర్యలను జనం ఛీకొట్టారని అన్నారు. ఆయా పార్టీలు పంజాబ్‌ను నాశనం చేసేందుకు కంకణం కట్టుకున్నాయని ధ్వజమెత్తారు. ప్రతికూల రాజకీయాలను ప్రజలు తిరస్కరించారని పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు సునీల్ జక్కర్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం పంజాబ్‌పై వివక్ష చూపుతోందని ఆరోపించారు. పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్‌సింగ్ నాయకత్వానికి ఆయన మద్దతు పలికారు. మొత్తం 1,817 వార్డులకు గాను ఇప్పటివరకు కాంగ్రెస్ 1,102, ఎస్‌ఏడీ 252, ఆప్ 51, బీజేపీ 29, బీఎస్పీ 5 వార్డులు గెలుచుకున్నాయి. 374 వార్డుల్లో స్వతంత్ర అభ్యర్థులు ఎన్నికయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment