Congress manifesto: ధరణి బదులు ‘భూమాత’ | Congress released manifesto for Telangana assembly elections | Sakshi
Sakshi News home page

Congress manifesto: ధరణి బదులు ‘భూమాత’

Published Sat, Nov 18 2023 2:02 AM | Last Updated on Sat, Nov 18 2023 8:08 AM

Congress released manifesto for Telangana assembly elections - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అన్ని వర్గాలను ఆకట్టుకునేలా కాంగ్రెస్‌ పార్టీ తమ మేనిఫెస్టోను విడుదల చేసింది. ఇప్పటికే ప్రకటించిన ఆరు గ్యారంటీలు, రైతు, యూత్, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ డిక్లరేషన్‌లతోపాటు పలు కీలక హామీలతో ‘అభయ హస్తం’ పేరిట ప్రణాళికను ప్రజల ముందు పెట్టింది. సుపరిపాలన అందిస్తామంటూ ప్రారంభమైన ఈ 42 పేజీల మేనిఫెస్టోలో మొత్తం 37 విభాగాల్లో పెద్ద ఎత్తున హామీలను గుప్పించింది. 

తమకు అధికారమిస్తే ప్రజల ఆకాంక్షల మేరకు పూర్తిస్థాయి ప్రజాస్వామిక పాలన తెస్తామని, ప్రతిరోజూ సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్‌ నిర్వహిస్తామని పేర్కొంది. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కూడా ప్రజా దర్బార్‌లు నిర్వహిస్తారని తెలిపింది. బీఆర్‌ఎస్‌ పాలనలోని అవినీతి, కుంభకోణాల ఆరోపణలపై రిటైర్డ్‌ హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపిస్తామని.. కాళేశ్వరం అవినీతిపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ చేయిస్తామని ప్రకటించింది. 

­గ్రామ వలంటీర్ల వ్యవస్థ తెస్తాం.. 
ప్రజా ఫిర్యాదుల కోసం టోల్‌ఫ్రీ నంబర్‌ అందుబాటులోకి తెస్తామని కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో పేర్కొంది. ప్రభుత్వ పథకాల అమలు కోసం గ్రామీణ వలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేస్తామని తెలిపింది. కొత్త జిల్లాలు, మండలాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. 2030 నాటికి తెలంగాణను 500 బిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామని, ఇండ్రస్టియల్‌ కారిడార్లు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ కారిడార్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఉపాధి హామీ పనిదినాలను, వేతనాలను పెంచుతామని తెలిపింది. 

ఉచితంగా కరెంటు.. 
200 యూనిట్లలోపు వాడే వినియోగదారులందరికీ ఉచిత కరెంటు ఇస్తామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చింది. కృష్ణా జలాల్లో తెలంగాణకు రావాల్సిన న్యాయమైన వాటా సాధిస్తామని, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా తెస్తామని తెలిపింది. చెరువుల మరమ్మతు, నిర్వహణ బాధ్యతలను నీటి సంఘాలకు అప్పగిస్తామని వెల్లడించింది. ఆదర్శ రైతు విధానాన్ని పునరుద్ధరిస్తామని.. ధాన్యం కొనుగోళ్లలో తేమశాతం పేరిట తరుగు తీసే విధానాన్ని రద్దు చేస్తామని ప్రకటించింది. పాల ఉత్పత్తిదారులకు లీటర్‌కు రూ.5 ప్రోత్సాహకం ఇస్తామని వివరించింది. నిషేధిత జాబితాలో ఉన్న పట్టా భూములను వంద రోజుల్లో తొలగిస్తామని హామీ ఇచి్చంది. 

సంక్షేమం కోసం మరెన్నో.. 
విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు పెంచుతామని.. పీఈటీ పోస్టులు భర్తీ చేసి ఏటా క్రీడా పోటీలు నిర్వహిస్తామని కాంగ్రెస్‌ పేర్కొంది. అన్ని జిల్లా కేంద్రాల్లో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు, నియోజకవర్గంలో 100 పడకల సూపర్‌ స్పెషాలిటీ, మున్సిపాలిటీల్లో 100 పడకల ఆస్పత్రులను నిర్మిస్తామని తెలిపింది. రెవెన్యూ ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేస్తామని, రేషన్‌షాపులను మినీ సూపర్‌మార్కెట్లుగా మార్చుతామని ప్రకటించింది. వాల్మీకిలను ఎస్టీ జాబితాలో చేరుస్తామని, సమ్మక్క జాతరను జాతీయ పండుగగా గుర్తిస్తామని హామీ ఇచ్చింది. 

బీసీలకు క్రిమీలేయర్‌ విధానాన్ని తొలగించాలని కేంద్రానికి సిఫార్సు చేస్తామని తెలిపింది. చేనేత ఉత్పత్తులను ఈ–కామర్స్‌తో అనుసంధానం చేస్తామని, రిటైరైన జర్నలిస్టులకు పింఛన్‌ సదుపాయం కల్పిస్తామని పేర్కొంది. హైదరాబాద్‌ నగరాన్ని ముంపు రహిత నగరంగా తీర్చిదిద్దుతామని.. అన్ని నగరాలు, మున్సిపాలిటీల్లో ప్రతి ఇంటికి 25 వేల లీటర్ల మంచి నీటిని ఉచితంగా సరఫరా చేస్తామని ప్రకటించింది. ఎల్బీనగర్‌–బీహెచ్‌ఈఎల్‌ రూట్లలో కొత్త మెట్రో లైన్లను నిర్మిస్తామని తెలిపింది.

కాంగ్రెస్‌ మేనిఫెస్టోలోని కీలక అంశాలివీ.. 

  •      తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు పూర్తిస్థాయి ప్రజాస్వామిక పరిపాలన 
  •      ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రతిరోజూ ‘ప్రజాదర్బార్‌’ నిర్వహణ 
  •      కాళేశ్వరం అవినీతిపై సిట్టింగ్‌ హైకోర్టు జడ్జితో న్యాయ విచారణ 
  •      ఫార్మాసిటీలు రద్దు.. మద్యం బెల్టుషాపుల రద్దు 
  •      తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమ అమరవీరుల కుటుంబంలో ఒకరికి రూ.25 వేల నెలవారీ గౌరవ పింఛన్, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం 
  •      తెలంగాణ ఉద్యమకారులపై కేసుల ఎత్తివేత. 250 గజాల ఇళ్ల స్థలాల పంపిణీ 
  •      సింగరేణి ప్రైవేటీకరణకు నో.. కారుణ్య నియామకాల ప్రక్రియ పునఃపరిశీలన 
  •      హైదరాబాద్‌లో కొత్త మెట్రోరైల్‌ మార్గాల నిర్మాణం.. ఆస్తిపన్ను, ఇంటి పన్ను బకాయిలపై ఉన్న పెనాల్టీ రద్దు.

రైతులు – భూములు

  • రైతులకు రూ.2 లక్షల పంటరుణాల మాఫీ.. రూ.3 లక్షల వరకు వడ్డీలేని పంట రుణాలు 
  • వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు.. అన్ని ప్రధాన పంటలకు సమగ్ర బీమా 
  • ధరణి స్థానంలో భూమాత పోర్టల్‌.. ల్యాండ్‌ కమిషన్‌ ఏర్పాటు 
  • పేదలకు పంపిణీ చేసిన 25 లక్షల ఎకరాల అసైన్డ్‌ భూములపై వారికి పూర్తి హక్కుల కల్పన 
  • రైతులకు ఎకరానికి రూ.15 వేలు ఆర్థిక సాయం. కౌలు రైతులకూ ఈ పథకం వర్తింపు. రైతు కూలీలకూ ఏటా రూ. 12 వేలు ఆర్థిక సాయం.

గౌరవ వేతనాలు పెంపు 

  • మధ్యాహ్న భోజన కార్మికుల నెలవారీ వేతనం రూ.10వేలకు పెంపు 
  • గ్రామ పంచాయతీ వార్డు సభ్యుల గౌరవ వేతనం నెలకు రూ.1,500 పెంపు 
  • మాజీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్‌లకు గౌరవ పింఛన్‌ 
  • అంగన్‌వాడీల వేతనం రూ.18 వేలకు పెంపు, వారిని ఈపీఎఫ్‌ పరిధిలోకి చేర్పు 
  • రేషన్‌ డీలర్లకు రూ.5వేల గౌరవ వేతనం 

యువత – నిరుద్యోగులకు.. 

  • వార్షిక జాబ్‌ కేలండర్‌.. నిర్ణీత కాలంలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ 
  • మెగా డీఎస్సీ తో ఆరు నెలల్లో నే ఖాళీ టీచర్‌ పోస్టులన్నీ భర్తీ

విద్యార్థులకు..

  • విద్యార్థులకు ఉచితంగా వైఫై ఇంటర్నెట్‌.. విద్యా రంగానికి బడ్జెట్‌ 15శాతానికి పెంపు 
  • బాసర ట్రిపుల్‌ఐటీ తరహాలో రాష్ట్రంలో మరో 4 ట్రిపుల్‌ఐటీల ఏర్పాటు 
  • మూతపడిన 6వేల పాఠశాలల పునరుద్ధరణ 
  • ప్రతి జిల్లాలో రెసిడెన్షియల్‌ స్పోర్ట్స్‌ స్కూల్‌ 
  • కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో అన్ని ఆధుని క సౌకర్యాలతో బస్తీ పబ్లిక్‌ స్కూళ్ల ఏర్పాటు 

ప్రభుత్వ ఉద్యోగులకు..

  • ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్‌ విధానం రద్దు.. పాత పెన్షన్‌ విధానం (ఓపీఎస్‌) పునరుద్ధరణ 
  • పీఆర్సీ ప్రకటించి ఆరు నెలల్లోపు సిఫారసుల అమలు..  పెండింగ్‌లో ఉన్న మూడు డీఏల తక్షణ విడుదల 
  • ఆర్టీసీ సిబ్బందికి రెండు పీఆర్సీ బకాయిల చెల్లింపు 
  • హోంగార్డులకు వేతన సవరణ అమలు 

మహిళలకు..

  • ఆడపిల్లలకు వివాహ సమయంలో రూ.లక్ష ఆర్థికసాయంతోపాటు ఇందిరమ్మ కానుకగా తులం (10 గ్రాముల) బంగారం 
  • స్వయం సహాయక బృందాలకు రూ.10 లక్షల వరకు పావలా వడ్డీ రుణాలు.. బంగారు తల్లి పథకం పునరుద్ధరణ 

ఆరోగ్యం

  • ఆరోగ్యశ్రీ పథకం పరిమితి రూ.10 లక్షలకు పెంపు.. మోకాలు సర్జరీ కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి.. 
  • ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది నియామకాలు 
  • ఉస్మానియా ఆస్పత్రి ఆధునీకరణ 

సంక్షేమ రంగం 

  • ప్రతి ఆటోడ్రైవర్‌కు సంవత్సరానికి రూ. 12 వేల ఆర్థిక సాయం.. పెండింగ్‌లో ఉన్న చలానాలు 50% రాయితీతో సెటిల్‌మెంట్‌ 
  • బీడీ కార్మికులకు జీవిత బీమా, ఈఎస్‌ఐ పరిధిలోకి చేర్పు.. ప్రమాదంలో చనిపోయే గీత కార్మికుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా రూ.10 లక్షలకు పెంపు 
  • గొర్రెల పంపిణీ కోసం నగదు బదిలీ ద్వారా రూ.2 లక్షలు 
  • గల్ఫ్‌ కార్మికుల కోసం సంక్షేమ బోర్డు 
  • పేదలకు తెల్ల రేషన్‌కార్డులపై సన్నబియ్యం.. 
  • హైదరాబాద్‌ జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యకు పరిష్కారం.. మరణించిన జర్నలిస్టు కుటుంబాలకు రూ.5 లక్షల నగదు 
  • 50 ఏళ్లు దాటిన జానపద కళాకారులకు నెలకు రూ. 3 వేల పింఛన్‌.. 
  • దివ్యాంగుల పింఛన్‌ రూ.6 వేలకు పెంపు 
  • అన్ని జిల్లా కేంద్రాల్లో అనాథ వృద్ధుల కోసం ఓల్డేజ్‌ హోమ్స్‌..  

ఉద్యోగాల భర్తీకి జాబ్‌ కేలండర్‌ 
రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే తొలి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలను పబ్లిక్‌ సరీ్వస్‌ కమిషన్, స్పెషల్‌ డిపార్ట్‌మెంట్‌ నియామకాల మిషన్‌ ద్వారా చేపడతామని అనుబంధ మేనిఫెస్టోలో పేర్కొంది. దరఖాస్తుదారులెవరూ ఒక్క రూపాయి ఫీజు కట్టనవసరం లేదని తెలిపింది. ఏయే కేడర్‌ ఉద్యోగాల భర్తీకోసం ఏ తేదీన నోటిఫికేషన్లు ఇస్తామనే వివరాలనూ పేర్కొంది. కొన్ని ఉద్యోగాలను ఒకే దశలో, మరికొన్ని ఉద్యోగాలను రెండు దశల్లో భర్తీ చేస్తామని హామీ ఇచ్చింది. మేనిఫెస్టోలో ప్రకటించిన నోటిఫికేషన్‌ తేదీలివీ.. 

  •      గ్రూప్‌–1 – 2024, ఫిబ్రవరి 1 
  •      గ్రూప్‌–2 – మొదటి దశలో 2024, ఏప్రిల్‌ 1, రెండో దశ డిసెంబర్‌ 15 
  •      గ్రూప్‌–3 – 2024 జూన్‌ 1, డిసెంబర్‌ 1 
  •      గ్రూప్‌–4 – 2024 జూన్‌ 1, డిసెంబర్‌ 1 
  •      రోడ్లు–భవనాలు, పంచాయతీరాజ్, నీటిపారుదల, ఆర్‌డబ్ల్యూఎస్, ప్రజారోగ్య శాఖ, మున్సిపల్, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు, విద్యుత్‌ శాఖల్లో ఏఈ పోస్టులు–2024 మే 1 
  •      అగ్రికల్చర్, హార్టీకల్చర్, వెటర్నరీ అధికారుల పోస్టులు – 2024 మే1 
  •      ఏఎంవీఐ, టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు తదితర పోస్టులు – 2024 జూన్‌ 1, డిసెంబర్‌ 1 
  •      పోలీస్‌ కానిస్టేబుల్, ఇతర యూనిఫాం సిబ్బంది ఉద్యోగాలు – 2024 మార్చి 1, డిసెంబర్‌ 1 
  •      కాలేజీ లెక్చరర్లు, విశ్వవిద్యాలయాల ఫ్యాకల్టీ ఉద్యోగాలు – 2024 ఏప్రిల్‌ 1, డిసెంబర్‌ 15 
  •      టీచర్‌ పోస్టులు – మొదటి దశలో 2024 ఏప్రిల్‌ 1, రెండోదశలో 2024 డిసెంబర్‌ 15 
  •      నర్సులు, ఇతర ఆస్పత్రి సిబ్బంది నియామకాలు – 2024 మే 1, డిసెంబర్‌ 15 
  •      డాక్టర్‌ పోస్టులు – 2024 ఆగస్టు 1 
  •      వీఆర్వోలు, పంచాయతీ కార్యదర్శులు, ఇతర సాంకేతిక సిబ్బంది నియామకాలు – 2024 జూన్‌ 1  

కులాలు–రిజర్వేషన్లు 

  • ఎస్సీల వర్గీకరణ అనంతరం మాదిగ, మాల, ఇతర ఉపకులాలకు కొత్తగా 3 కార్పొరేషన్లు 
  • బీసీల కులగణన, జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు. సంచార జాతులకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో 5 శాతం రిజర్వేషన్లు 
  • ప్రతి జిల్లా కేంద్రంలో బీసీ భవన్‌.. జనగామ జిల్లాకు సర్దార్‌ సర్వాయి పాపన్నగౌడ్‌ పేరిట నామకరణం 
  • అన్ని బీసీ వర్గాలకు కార్పొరేషన్ల ఏర్పాటు.. బీసీలకూ సబ్‌ప్లాన్‌.. ఈబీసీల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు 
  • మైనార్టీ సబ్‌ప్లాన్‌ అమలు..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement