కర్ణాటక ఫార్ములాను రాజస్తాన్‌లో కూడా కాంగ్రెస్ హైకమాండ్ ప్రయోగించింది. ఉప్పు నిప్పుగా ఉన్న ఇద్దరు కీలక నేతలు అశోక్ గెహ్లాట్, సచిన్ పైలెట్‌ను ఒక్కటి చేసింది.
రాహుల్ గాంధీతో జరిగిన భేటీలో ఇరువురు నేతలు కలిసి పనిచేయడానికి ఒప్పించింది. మరి గెహ్లాట్, పైలెట్ చేతులు కలిపినట్టేనా ? ఎన్నికల్లో కలసికట్టుగా పని చేస్తారా ? ఆచరణలో ఇది ఎంతవరకు సాధ్యమనే ప్రశ్నలైతే వినిపిస్తున్నాయి.
కర్ణాటకలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ల మధ్య విభేదాలను పరిష్కరించి ఎన్నికల్లో విజయ ఢంకా మోగించిన కాంగ్రెస్ పార్టీ అదే ఫార్ములాను రాజస్తాన్‌లోనూ ప్రయోగించింది. రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలెట్‌ల మధ్య రాజీ కుదర్చడానికి స్వయంగా రాహుల్ గాంధీ రంగంలోకి దిగారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో గెహ్లాట్, పైలెట్‌లు రాహుల్‌తో చర్చించాక ఇరువురు నేతలు కలిపి పని చేస్తారని కాంగ్రెస్ హైకమాండ్ చేసిన ప్రకటనపై రాష్ట్ర నేతల్లో విశ్వాసం కలగడం లేదు. ఎందుకంటే బీజేపీ హయాంలో జరిగిన అవినీతిపై విచారణ కోసం సచిన్ పైలెట్ రాష్ట్ర ప్రభుత్వానికి పెట్టిన గడువు బుధవారంతో ముగుస్తుంది.
ఈ లోగా అధ్యక్షుడు ఖర్గే లేదంటే సీఎం నుంచి ఏదో ఒక ప్రకటన రాకపోతే సచిన్ పైలెట్ వ్యూహం ఎలా మార్చుకుంటారోనన్న ప్రశ్నలైతే వినిపిస్తున్నాయి. రాహుల్‌తో భేటీలో ఈ సమస్యలకైతే సామరస్యపూర్వక పరిష్కారం లభించలేదు.
ఖర్గే వ్యూహం ఏంటి?
ఈ ఏడాది నవంబర్‌లోనే ఎన్నికలు ఉండడంతో ఇరువురు నేతల మధ్య పూర్తి స్థాయి అవగాహన కుదర్చడానికి సమయం అంతగా లేదు. చాలా తక్కువ సమయంలో ఇద్దరికీ సంతృప్తికరమైన చర్యలు ఎలా చేపడతారన్నది మరో పెద్ద సవాల్‌గా ఉంది. అశోక్ గెహ్లాట్ ప్రభుత్వ ప్రతిష్ట గత కొన్ని నెలలుగా మసకబారుతోంది. ఈ విషయంలో సీఎంకు అధ్యక్షుడు ఖర్గే ఘాటైన హెచ్చరికలు పంపినట్టు సమాచారం.
కర్ణాటక తరహా ఫలితాలు రావాలంటే జూలై నాటికే 60% అభ్యర్థుల్ని ప్రకటించాలని అధ్యక్షుడు ఖర్గే గట్టిగా కసరత్తు చేస్తున్నారు. అది జరగాలంటే పైలెట్‌కు పీసీసీ అధ్యక్ష పదవి లేదంటే ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాల్సి ఉంటుంది. పీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చి పైలెట్ అనుచరులకే అధికంగా సీట్లు ఇస్తే అధికార వ్యతిరేకత నుంచి కూడా బయటపడవచ్చునని ఖర్గే భావిస్తున్నారు. దీనిపై ఖర్గే, హైకమాండ్ ఒక మాట మీదకొస్తే పైలెట్‌ను పీసీసీ చీఫ్‌గా అంగీకరించడమో లేదంటే తానే సీఎం పదవికి రాజీనామా చేయడమో గెçహ్లాట్‌కు అనివార్యంగా మారుతుంది.
ఈ నేపథ్యంలో మంగళవారం గెహ్లాట్ తన అనుచరులతో మాట్లాడుతూ అందరూ సహనంగా ఉండాలని పిలుపునిచ్చారు. పైలెట్‌కు పార్టీలో ఏ పదవి ఇవ్వాలో హైకమాండ్ నిర్ణయిస్తుందన్నారు. తనకు పదవి ముఖ్యం కాదని, ఎన్నికల్లో గెలుపు కోసం హైకమాండ్ ఏం చెబితే అదే చేస్తానని వ్యాఖ్యానించడం కొసమెరుపు మొత్తమ్మీద సచిన్ పైలెట్ తండ్రి, దివంగత రాజేశ్ పైలెట్ వర్ధంతి జూన్ 11 లోపు పైలెట్‌కు పార్టీలో కీలక పదవి ఇచ్చే అవకాశాలైతే అధికంగా కనిపిస్తున్నాయి.
చిక్కుముళ్లు ఎలా విప్పుతారో..!
అశోక్, పైలెట్ మధ్య విడదీయలేని చిక్కుముళ్లు ఎన్నో ఉన్నాయి. వసుంధరా రాజె ప్రభుత్వ హయాంలో అవినీతిపై విచారణ జరపాలని పైలెట్ డిమాండ్ చేస్తున్నప్పటికీ సీఎం గెహ్లాట్‌పై ఆయన వ్యక్తిగతంగా దూషణలకు దిగడంతో గెహ్లాట్ దీనిపై రాజీకి వచ్చే అవకాశాలు లేవని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో సంస్థాగతంగా పలు మార్పులు చేపట్టాలని అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే భావించారు.
కానీ పైలెట్‌ను విశ్వాసంలోకి తీసుకోకుండా ఇవి చెయ్యడం అంత సులభం కాదు. సోమవారం ఖర్గే నివాసంలో జరిగిన సమావేశంలో కూడా ఇరువురు నాయకుల మధ్య ఉన్న కీలక సమస్యలకు పరిష్కారం దొరకలేదు. రాహుల్, ఖర్గేలు తొలుత గెహ్లాట్‌తో చర్చించారు. అనంతరం సచిన్ పైలెట్‌తో చర్చలు జరిపారు. గంటల కొద్దీ సమావేశం జరిగినప్పటికీ గెహ్లాట్, పైలెట్ కలిసికట్టుగా పని చేస్తామని బహిరంగంగా చెప్పకపోవడం గమనార్హం.
డిమాండ్లపై పట్టు వీడని పైలెట్
సచిన్ పైలెట్ గత కొద్ది నెలలుగా చేస్తున్న డిమాండ్లపై వెనక్కి తగ్గే అవకాశాలు లేవు. వసుంధరా రాజె ప్రభుత్వ అవినీతిపై విచారణ, రాజస్తాన్ పబ్లిక్ సర్వీసు కమిషన్ (ఆర్‌పీఎస్‌సి) తిరిగి ఏర్పాటు చేసి కొత్త నియామకాలు చేపట్టడం పేపర్ల లీకేజీ వల్ల పరీక్షలు రద్దు ప్రభావం పడిన విద్యార్థులకు నష్టపరిహారం చెల్లించడమనే మూడు డిమాండ్లపై సచిన్ పట్టు వీడడం లేదు.
రాహుల్‌తో సమావేశానంతరం అశోక్ గెహ్లాట్ పార్టీ హైకమాండ్ కీలకమని, పార్టీ పెద్దలు ఎవరికి ఏ పదవి ఇస్తారో ముందుగానే స్పష్టమైన హామీలు ఇవ్వరంటూ చేసిన వ్యాఖ్యలు కూడా భవిష్యత్‌లో జరిగే సమావేశాల్లో ప్రతిబంధకంగా మారే అవకాశాలున్నాయి.
- సాక్షి నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment